రియా, రోనక్ ఆనంద్ (PC: Betterindia)
‘కాలంతోపాటు ఎన్నో మారుతున్నాయి. మారనిది మాత్రం జిమ్ మాత్రమే’ అంటూ ఫ్లెక్స్‌నెస్ట్ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు ఈ దంపతులు. ‘విజయం సాధిస్తామా?’ అనే సందేహం వారిలో ఏ ఒక్కరోజూ రాలేదు. ఎందుకంటే కొత్తదనాన్ని ఎవరూ నిరాకరించరనే విషయం వారికి బాగా తెలుసు. ఎన్నో రకాల ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్‌లను పరిచయం చేసిన ‘ఫ్లెక్స్‌నెస్ట్’ అనుకున్నట్లుగానే గెలుపు జెండా ఎగరేసింది. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది...
కోవిడ్ భీకరంగా కోరలు సాచిన సమయం అది. దిల్లీకి చెందిన రియా, రోనక్ ఆనంద్ దంపతులకు జిమ్‌కు వెళ్లనిదే రోజు మొదలు కాదు. అలాంటిది కోవిడ్ వల్ల జిమ్‌కు ఒక్కరోజు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇలా అయితే కుదరదు అనుకొని ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
లాక్‌డౌన్ లేని సమయంలో ఎన్నో షాప్‌లకు వెళ్లారు. ఏ షాప్‌కు వెళ్లినా ఒకే దృశ్యం. అవే పాత ఎక్విప్‌మెంట్స్!
మరికొన్ని షాప్‌లలో విదేశాల్లో నుంచి దిగుమతి చేసుకున్న కొత్త ఎక్విప్‌మెంట్ కనిపించిదిగానీ, ధరలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి.
‘రెండు దశాబ్దాల క్రితం ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్‌లు లేవు. స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు లేవు. ఎన్నో రంగాలలో స్మార్ట్ వచ్చేసింది. జిమ్ విషయంలో మాత్రం ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది’ అంటూ మాట్లాడుకున్నారు రియా, ఆనంద్‌లు.
అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే ఈ దంపతులకు ‘ఫ్లెక్స్‌నెస్ట్’ అనే అంకుర ఆలోచన వచ్చింది.
రియా ఆర్థికశాస్త్రంలో పట్టభద్రురాలు. కొంత కాలం ఒక మీడియా సంస్థలో పనిచేసింది.
ఆనంద్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇద్దరికీ స్టార్టప్‌లో పూర్వ అనుభవం లేదు. అయినా సరే ధైర్యంతో ముందడుగు వేశారు.
నిధుల సమీకరణకు వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్‌లపై ఆధారపడలేదు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ చేశారు. అవసరమైతే తప్ప పొదుపు మొత్తాలను ఖర్చు చేయకూడదని నిర్ణయించుకున్నారు.
థర్డ్ పార్టీ రీటెయిలర్స్, హోల్‌సేలర్స్, మిడిల్‌మెన్ ప్రమేయం లేని డి2సి (డైరెక్ట్–టు–కస్టమర్) బిజినెస్ మోడల్‌తో ‘ఫ్లెక్స్‌నెస్ట్’ పట్టాలకెక్కింది. మొదట ప్రయోగాత్మకంగా డంబెల్స్, యోగా మ్యాట్స్... అమ్మకాలు మొదలుపెట్టారు. ఆ తరువాత జర్మనీ, చైనా, తైవాన్‌ల నుంచి స్మార్ట్ ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్‌లను దిగుమతి చేసుకున్నారు.
స్మార్ట్ ఎక్సర్‌సైజ్ సైకిళ్లు, ఫ్లెక్స్ ట్రైనర్, ఫ్లెక్స్‌ప్యాడ్, ఫ్లెక్స్ బెంచ్, ఫ్లెక్సి కెటిల్, ఫ్లెక్సిబెల్‌స్టాండ్, ఫ్లెక్స్ నెస్ట్ యోగా బ్యాక్స్, మసాజ్‌గన్, ఫ్లెక్స్ బ్యాంగిల్....ఇలా ఎన్నోరకాల ఎక్విప్‌మెంట్స్‌తో ఫ్లెక్స్‌నెస్ట్ స్మార్ట్‌గా తయారైంది. మొదలైన కొద్దికాలంలోనే పరుగులు ప్రారంభించింది.
ఫిట్‌నెస్‌కు సంబంధించి ఆన్‌లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్న ‘ఫ్లెక్స్‌నెస్ట్’ వర్కవుట్స్, బైక్‌రైడ్స్‌కు సంబంధించి సొంత కంటెంట్ తయారు చేసుకుంది. త్వరలో మరిన్ని వర్కవుట్ ప్లాన్స్ తమ యాప్‌లో లాంచ్ చేయనుంది.
‘మేము పరిచయం చేసిన ఎక్విప్‌పెంట్ వల్ల బ్యాడ్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ ప్రాడక్ట్స్ మధ్య తేడా ఎంతోమంది తెలుసుకోగలిగారు. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను ఒకే వేదికపై తీసుకురావడం ద్వారా ఫిట్‌నెస్‌ను మరింత సౌకర్యంగా మార్చాం. వినియోగదారుల ఫిట్‌నెస్ జర్నీకి మా వంతుగా సహాయం అందించాలనుకుంటున్నాం. ఇండియన్ ఫిట్‌నెస్ మార్కెట్‌లో విస్తరించడానికి మరిన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం’ అంటుంది రియా.
ఆరోజు... సర్దుకు పోయి ఉంటే, సమస్య లేదనుకొని ఉంటే‘ఫ్లెక్స్‌నెస్ట్’లాంటి సక్సెస్‌ఫుల్ స్టార్టప్ ఆవిర్భవించేది కాదు. సమస్యతోపాటు పరిష్కారం ఆలోచించడం కూడా గొప్ప వ్యాపార లక్షణం కదా!
చదవండి: Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్’కు సన్నిహిత మిత్రుడు
Anusha Shetty: లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..
Comments
Please login to add a commentAdd a comment