హెల్దీ మజిల్స్ కోసం...
నేను రోజూ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను. కండలు బాగా పెరుగుతూ, మంచి షేప్ వచ్చేందుకు ఏం చేయాలో సలహా ఇవ్వండి.
- ధన్‌రాజ్, కరీంనగర్
మీరు అదేపనిగా ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవని గుర్తుంచుకోండి. హెవీ వెయిట్స్‌తో కండరం మీద భారం పడేలా ఎక్సర్‌సైజ్ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్‌సైజ్ చేయడం మంచిది. కండరాలు పెరగాలంటే కండరం మరింత ప్రోటీన్‌ను పొందేలా దాన్ని స్టిమ్యులేట్ చేయాలి. అయితే కండరానికి ఆరోగ్యకరమైన స్టిమ్యులేషన్ కలగాలంటే... మరీ ఎక్కువ బరువులు ఎత్తడం మంచిది కాదు.
దానికి బదులు మీరు... మీకు సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే తీసుకుని, మీరు ఏ కండరం పెరగడానికి వ్యాయామం చేస్తున్నారో అది అలసిపోయేవరకూ ఆ ఎక్సర్‌సైజ్‌ను కొనసాగిస్తూ వ్యాయామం చేయండి. ఇక చాలామంది తమ కండరాలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో తాము మోసే వెయిట్స్‌ను త్వరత్వరగా పెంచుకుంటూ పోతారు. ఇలా వెయిట్స్ తాలూకు బరువు పెరుగుతున్నకొద్దీ ఎక్సర్‌సైజ్ రిపిటేషన్స్ తగ్గుతాయి. దాంతో ఆశించినట్లుగా కండరం పెరగదు. మీరు చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్) చేసేందుకు తగినంత బరువును మాత్రమే ఎత్తండి.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్