ప్రస్తుతపు ఉరుకులు పరుగుల లైఫ్‌లో మిషన్ల సాయం లేకపో తే పని నడవదు. అలాగని కదలకుండా కూర్చుంటే చేజేతులా ముప్పు తెచ్చుకున్నట్లే. మరయితే ఏం చేయాలి? మనసుంటే మార్గం ఉన్నట్లు ఈ బిజీ లైఫ్‌లో కూడా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండొచ్చు. అవేమిటో చూద్దామా?
రకరకాల కారణాల వల్ల వ్యాయామం చేయడానికి సమయం లేనివారు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండవచ్చు. అందులో నడక ఒకటి. అసలు ఎలా నడవాలి.. ఎప్పుడెప్పుడు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం..
మాట్లాడుతూనే నడవండి
కొంతమందికి పొద్దస్తమానం ఫోన్ మాట్లాడటం అవసరం. మరికొందరికి వృత్తిరీత్యా తప్పదు. చాలామందికి అలవాటు. అది వర్క్ కాల్ అయినా.. మీకు ఇష్టమైన వారితో చెప్పుకునే కాలక్షేపం కబుర్లే కావచ్చు... మాట్లాడండి. కానీ అలా మాట్లాడుతూనే నడవండి. ఎందుకంటే అరగంట వాకింగ్ చేస్తే వొంటికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? ఇది మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఆరోగ్యానికి మెట్లు
ఫిట్‌గా ఉండటానికి మెట్లను ఖచ్చితంగా ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర కదలికలు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. మెట్లను ఎక్కుతున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అందుకే లిఫ్ట్‌లో వెళ్లకుండా మెట్లను ఎక్కడం అలవాటు చేసుకోండి. అయితే కొన్ని రకాల శారీరక ఇబ్బందుల రీత్యా, కొన్ని శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారినీ వైద్యులు మెట్లు ఎక్కవద్దని చెబుతారు. అలాంటి వారు మాత్రం మెట్లెక్కడాన్ని మినహాయించాలి.
ఎక్కువ కదలడానికి ప్రయత్నించండి
మీ ఆఫీస్ దగ్గరలో ఉంటే నడిచి వెళ్లడానికి ప్రయత్నించండి. లేదా ఆఫీసుకు కనీసం 10 నుంచి 20 నిమిషాల నడక దూరంలో దిగి.. నడిచి వెళ్లండి. బస్సులో వెళ్లినా, కారులో వెళ్లినా ఇలాగే నడవండి. ఫిట్‌గా ఉండటానికి ఈ చిన్న చిన్న మార్పులు అత్యవసరం.
నిలబడి పనిచేయండి
మీరు పనిచేసే ప్లేస్‌లో మీకు సౌకర్యంగా ఉంటే నిలబడి పని చేయడానికి ప్రయత్నించండి. ఇలా కొద్దిసేపు నిలబడి పనిచేయడం వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతారు. అలా అని మరీ ఎక్కువసేపు నిలబడటం ఆరోగ్యానికి మంచిది కాదు.
టీవీ చూస్తున్నప్పుడు...
టీవీ లేదా సెల్ ఫోన్‌లో సినిమాలను చూస్తున్నప్పుడు ఒకే దగ్గర కూర్చోకుండా.. ట్రెడ్‌మిల్‌పై నడవడం లేదా సైక్లింగ్ లేదా శరీరాన్ని సాగదీయడం వంటి కొన్ని వ్యాయామాలను చేయడం వల్ల మీ శరీరం బాగా కదిలి ఆరోగ్యంగా ఉంటుంది.
డ్యాన్స్ బెస్ట్
సమయం దొరికినప్పుడల్లా మీ శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించండి. అన్నింటిలో డ్యాన్స్ బెస్ట్. ఎందుకుంటే ఇది వ్యాయామంగా అనిపించదు. కొన్ని నిమిషాలపాటు డ్యాన్స్ చేస్తే మనసుకు సంతోషం, శరీరానికి ఆరోగ్యం చేకూరతాయి. వీటితోబాటు సాధ్యమైనంత వరకు ఇంట్లో మీ పనులు మీరే చేయండి. క్లీనింగ్, వాషింగ్, వంటపనుల్లో ఓ చే యి వేయండి. ఈ పనులు కూడా వ్యాయామం కిందికే వస్తాయి. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతాయి.
Comments
Please login to add a commentAdd a comment