సాక్షి, అమరావతి: నడక నాలుగు విధాలుగా మేలు... అని తరచూ వైద్యులు చెబుతుంటారు. మంచి ఆరోగ్యం కోసం 18 ఏళ్లు పైబడిన వారు వారానికి కనీసం 150 నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదా వారానికి కనీసం 75 నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ చేయాలని డబ్ల్యూహెచ్‌వో కూడా సూచిస్తోంది. ముఖ్యంగా 60ఏళ్లు పైబడినవారు వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల ప్రమాదకర రోగాల నుంచి రక్షణ పొందవచ్చని పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి. తాజాగా ఇదే విషయం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ పరిశోధకుల అధ్యయనంలోనూ వెల్లడైంది.
60 ఏళ్లు పైబడిన వారు రోజు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెకు మంచిదని నిర్ధారించింది. ఈ అధ్యయనంలో భాగంగా అమెరికా సహా 42 దేశాల్లో 18 ఏళ్లు పైబడిన 20,152 మంది డేటాను ఎనిమిది కోణాల్లో పరిశోధకులు విశ్లేషించారు. ఆరేళ్ల పాటు వీరు నడుస్తున్న దూరం, ఆయా వ్యక్తుల్లో కార్డియోవాసు్కలర్ డిసీజ్ (సీవీడీ), నాన్ ఫాటల్ కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి అంశాలను బేరీజు వేశారు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారు రోజుకు 6వేల నుంచి 9వేల అడుగులు నడిస్తే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడవచ్చని గుర్తించారు.
రోజుకు రెండు వేల అడుగులు మాత్రమే నడిచే వారితో పోలిస్తే వీరిలో గుండెపోటుతోపాటు పక్షవాతం ముప్పు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతుందని తేల్చారు. వృద్ధులకే కాదు అన్ని వయసులవారు నడక, వ్యాయామం, జాగింగ్, ఇతర శారీరకశ్రమ కార్యకలాపాలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని స్పష్టంచేశారు. అయితే డబ్ల్యూహెచ్‌వో సూచించిన ప్రమాణాల మేరకు 41.3 శాతం మంది దేశంలో శారీరకశ్రమ చేయడం లేదని 2021లో ఒక సర్వేలో ఐసీఎంఆర్ తెలిపింది.
అన్ని వయసుల వారికి ఉత్తమం
నడక చక్కటి, సహజమైన వ్యాయామం వంటిది. రోజు వారి దినచర్యలో అన్ని వయసులవారు నడకను అలవాటుగా మార్చుకోవాలి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలో శారీరక శ్రమ చేయడం చాలా వరకూ తగ్గిపోయింది. దీనికితోడు ఆహారపు అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, ఇతర జీవనశైలి జబ్బుల బారినపడుతున్నారు. వీటిని జయించి ఆరోగ్యంగా ఉండాలంటే నడక ఒక్కటే ఉత్తమ మార్గం.
రోజు 30నిమిషాలు నడవడంవల్ల రక్తపోటు, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు అదుపులోకి వస్తాయి. 45ఏళ్లు పైబడినవారు, మధుమేహం, ఇతర సమస్యలు ఉన్నవారు కొత్తగా నడక, వ్యాయామం ప్రారంభిస్తున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సలహా మేరకు వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. మధుమేహం సమస్య ఉన్నవారు ఇన్సులిన్ తీసుకుంటుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నడక, వ్యాయామం కొనసాగించాలి.
– డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూల్ జీజీహెచ్
రోజు నడకతో ప్రయోజనాలు...
►రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తంలోని మలినాలు బయటకు పోతాయి.
►శరీర బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతాయి.
►మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులను అదుపులో ఉంటాయి.
►మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
►మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరిగి, చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది.
►ఆత్మ విశ్వాసం, శారీరక సామర్థ్యం పుంజుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment