ఆకర్షణీయమైన రంగులతో ఉండే ఆహారాలు తీసుకోవచ్చా?
మా బాబు బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇది మంచిదేనా?
- సుమాల, బెంగళూరు
కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. దాంతో వాటి దుష్ర్పభావం మూత్రపిండాల పై పడుతుంది.
ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్‌లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4 ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణులు (హైపర్‌యాక్టివిటీ) పెరుగుతాయని తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనా లు విటమిన్ ’సి’ తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్ లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లల ను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి.
డాక్టర్ భక్తియార్ చౌదరి
స్పోర్ట్స్ మెడిసిన్,
ఫిట్‌నెస్ నిపుణుడు,
హైదరాబాద్