కొత్తా డైట్‌ అండి.. పేగన్‌ వచ్చెనండి.. | It is not good to eat different foods | Sakshi
Sakshi News home page

కొత్తా డైట్‌ అండి.. పేగన్‌ వచ్చెనండి..

Published Thu, Feb 7 2019 11:55 PM | Last Updated on Fri, Feb 8 2019 12:01 AM

It is not good to eat different foods - Sakshi

ఇది తింటే మంచిది.. అది తింటే మంచిది కాదు.. దీన్ని ఇలా తీసుకోవాలి.. దాన్ని అలా తీసుకోవాలి..  రకరకాల ఆహారపు విధానాలు..  కీటో డైట్‌ అని.. చిరుధాన్యాలు అని ఇలా చాలా..  తాజాగా ఈమధ్య ఇంకో ఆహారపు విధానం ప్రపంచానికి పరిచయమైంది..  శాకాహారానికి... పేలియో డైట్‌ను కలిపేసిన ఈ పేగన్‌ ఆహారం మంచి చెడూ తెలుసుకుందామా...  దీనికి ముందు ‘పేలియో డైట్‌’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం మనుషులు తిన్న ఆహారాన్ని తీసుకోవడమే పేలియోడైట్‌. ఉదాహరణకు గుడ్లు, మాంసం.. కాయగూరలు తదితరాలు.  తృణధాన్యాలతోపాటు పప్పులు, చక్కెర, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, రిఫైన్డ్‌ నూనెలు, ఉప్పు, కృత్రిమ చక్కెరలను అస్సలు తీసుకోకూడదు.పేలియో డైట్‌ వల్ల  ప్రిజర్వేటివ్స్‌ రూపంలో కృత్రిమ రసాయనాలు కడుపులోకి చేరవని.. మొక్కల ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా అందడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందన్నది అంచనా. ఇక శాకాహారం అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాంసపు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా.. కాయగూరలు, అన్ని రకాల ధాన్యాలను వాడటం సంతులిత ఆహారమని దీన్ని అనుసరించే వారు చెబుతారు. అయితే... మార్క్‌ హైమన్‌ అనే ఓ అమెరికన్‌ డాక్టర్‌ ఈ రెండు ఆహార విధానాలను కలిపేసి పేగనిజమ్‌ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో హైమన్‌ ‘వాట్‌ ద హెక్‌ షుడ్‌ ఐ ఈట్‌’ పేరుతో రాసిన పుస్తకం సూపర్‌హిట్‌ కావడంతో పేగనిజమ్‌ ప్రాచుర్యంలోకి వచ్చేసింది. 

కలిపి కొట్టర కావేటి రంగ... 
పేగనిజమ్‌ అంటే రెండు ఆహారపు పద్ధతులను కలిపి తీసుకోవడం అని ముందుగానే చెప్పుకున్నాం. ఇందులో ఎక్కువగా తీసుకునేది మొక్కల ఆధారిత ఆహారమే. దీంతోపాటు మార్కెట్‌లో దొరికే ముదురు రంగు కాయగూరలు, పండ్లు బాగా తినాలి.  దీనివల్ల శరీరానికి పీచుపదార్థాలు ఎక్కువగా చేరతాయని, గుండెజబ్బులు రాకుండా చూడటంతోపాటు కేన్సర్, మరీ ముఖ్యంగా పేవు కేన్సర్‌ నివారణకు పేగనిజం ఉపయోగపడుతుందని హైమన్‌ చెబుతున్నారు. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫలితాలు పొందవచ్చునని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. పేగన్‌ డైట్‌లో పండ్లు, కాయగూరల మోతాదు 75 శాతం వరకూ ఉంటే.. అవిశ గింజలు (ఫ్లాక్స్‌ సీడ్స్‌), చేపలు... డ్రైఫ్రూట్స్, అవకాడో, ఆలివ్‌ సంబంధిత నూనెలు, గడ్డిమాత్రమే తిని పెరిగిన పశువుల నుంచి సేకరించిన మాంసం, వెన్న, నెయ్యి, ఆర్గానిక్‌ కొబ్బరి నూనె మిగిలిన పావు వంతు భాగాన్ని ఆక్రమిస్తాయి.  

నష్టాలూ ఉన్నాయి..
పేగన్‌ డైట్‌తో ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పోషక విలువలు ఉన్నట్లు రూఢీ అయిన అనేక ఆహార పదార్థాలు.. ఉదాహరణకు గోధుమలు, బీన్స్‌ వంటివాటిపై నిషేధం ఉండటాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు. గోధుమలోని గ్లుటెన్‌ కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చుగానీ.. పేగన్‌ డైట్‌లో గోధుమలతోపాటు క్వినోవా, బ్రౌన్‌ రైస్, ఓట్స్, రాజ్‌గిరా వంటి వాటిని కూడా తినకూడదనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర మోతాదులను పెంచుతాయని.. పైగా రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయని హైమన్‌ సూత్రీకరణ.నాలుగేళ్ల క్రితం హైమన్‌ ఒక బ్లాగ్‌ రాస్తూ.. పాడి ఉత్పత్తులన్నింటినీ మానేయాలని సూచించినప్పటికీ తరువాతి కాలంలో ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఫలితంగా మేక లేదా గొర్రె పాల నుంచి  పెరుగు, వెన్న తీసుకోవచ్చు. అయితే పాడి ఉత్పత్తుల వల్ల వ్యాధులు వస్తాయనే హైమన్‌ అంచనాకు ఇప్పటివరకూ శాస్త్రీయ ఆధారమేమీ లేకపోవడం గమనార్హం.  

ఏతా వాతా... 
‘పేగన్‌ డైట్‌’ ఆరోగ్యానికి కలిగించే మేలు కొంతే.  అదేసమయంలో మాంస ఉత్పత్తులను పరిమితం చేయడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. అతితక్కువ చక్కెరలు తీసుకోవడం.. చేపలు, అవిశగింజల నుంచి అందే ఒమేగా –3 ఫ్యాటీయాసిడ్లు పేగనిజానికి సానుకూల అంశాలైనప్పటికీ నిషేధిత జాబితాలో బోలెడన్ని ఆహార పదార్థాలు ఉండటం ప్రతికూల అంశమని నిపుణులు అంటున్నారు. ఆహార పద్ధతులేవీ మార్చుకోకుండానే.. శాకాహారాన్ని ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునని, తద్వారా పక్కా నియమాలతో తిండి తినాల్సిన అవసరం తప్పుతుందని
చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement