సాక్షి, అమరావతి: ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకొనే వరక మీ దినచర్య, ఆహారాన్ని జాగ్రత్తగా గమనించండి. అవసరమైన మార్పులు చేసుకోండి... మీ జీవిత కాలాన్ని పెంచుకోండి.. అంటోంది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. జీవన శైలి, ఆహార అలవాట్ల వల్లే దేశంలో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని, 63 శాతం మరణాలు వీటి వల్లే కలుగుతున్నాయని హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా గుండె పోటుతో పాటు బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం ప్రజల జీవన శైలేనని ఈ మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో పేర్కొంది. నాన్ కమ్యునికబుల్ జబ్బులతో పాటు గుండెపోటుతో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజలు కూడా జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించింది.
ఈ వ్యాధుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం స్క్రీనింగ్ చేస్తున్నాయి. అయినా ప్రతి సంవత్సరం బీపీ, సుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బుల రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ప్రజలు కూడా ఈ జబ్బులకు కారకాలైన వాటికి దూరంగా ఉండాలని, దిన చర్యలో మార్పులు చేసుకొని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నాన్ కమ్యునికబుల్ వ్యాధులు 21వ శతాబ్దంలో కొత్త సవాళ్లను విసురుతున్నాయని పేర్కొంది.
పట్టణీకరణతో పాటు జీవనశైలిలో మార్పులకు దారి తీసిందని, కొత్త కొత్త ఆహారపు మార్కెట్‌లు రావడం, వాటికి ప్రజలు ఆకర్షితులు కావడం, వాటికి తోడు పొగాకు, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి నాన్ కమ్యునికబుల్ వ్యాధులతో పాటు, గుండెపోటుతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని నివేదిక తెలిపింది.
రాష్ట్రంలో 3.53 కోట్ల మందికి స్క్రీనింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు పైబడిన జనాభాలో 92 శాతం మందికి నాన్ కమ్యునికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను పూర్తి చేశారు. ఇప్పటివరకు 3,53,44,041 మంది జనాభాకు పరీక్షలు చేశారు. గుండె జబ్బులు, రక్తపోటు, సుగర్, శ్వాస సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులున్నట్లు పరీక్షల్లో తేలిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
వ్యాధుల నివారణోపాయాలు
♦ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి
♦ శారీరక శ్రమను పెంచాలి
♦ మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి
♦ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి
♦ ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాములకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి
♦ ఏరేటెడ్ డ్రింక్స్, వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు
♦ పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనాలి
♦ 5 ఏళ్ల నుంచి ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ అవసరం.
దేశంలో 2020–21లో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు స్క్రీనింగ్, చికిత్స వివరాలు
Comments
Please login to add a commentAdd a comment