ఎక్కువసేపు కూర్చుంటే మహిళలకు క్యాన్సర్ ముప్పు
వాషింగ్టన్: ఎక్కువ సేపు కూర్చునే మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే మగవారిలో మాత్రం ఇలా ఎక్కువగా కూర్చోవడానికి, క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా అధ్యయనం వెల్లడించింది. అలాగే సరైన రీతిలో శారీరక శ్రమ చేసేవారికి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు తెలిపారు. కూర్చోవడానికి, క్యాన్సర్ వ్యాధికి ఎలాంటి సంబంధం ఉంది అనే అంశంపై ఆల్పా పటేల్ అనే భారత సంతతి శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ పరిశోధన సాగింది. 1999 నుంచి 2009 వరకు దాదాపు 69 వేల మంది పురుషుల్ని, 77 వేల మంది స్త్రీలని వీరు అధ్యయనం చేశారు.
వీరిలో 18 వేల మంది పురుషులు, 12 వేలకు పైగా స్త్రీలు అనంతరం క్యాన్సర్ బారిన పడ్డారు. అధిక సమయం కూర్చుని ఉండే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ముప్పు పది శాతం అధికంగా ఉందని వారు కనుగొన్నారు. కూర్చుని ఉండడానికి, క్యాన్సర్‌కు సంబంధం ఉన్నప్పటికీ కూర్చునే సమయం మాత్రం ప్రభావితం చేయడం లేదని వారు తెలిపారు.ఈ పరిశోధనలో వారి బాడీ మాస్ ఇండెక్స్, శారీరక శ్రమ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ అంశంపై మరింత పరిశోధన సాగించాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.