
లండన్ : సూర్యరశ్మితో శరీరానికి అందే విటమిన్ డీతో ఎముకలు, కండరాల పటిష్టమవడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలూ పుష్కలంగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. విటమిన్ డీ శ్వాససంబంధ, నరాల వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా ప్రాణంతక క్యాన్సర్‌నూ నిరోధిస్తుందని వెల్లడైంది. సూర్యరశ్మి తక్కువగా ఉండే శీతాకాలంలో ప్రతిఒక్కరూ 10 ఎంసీజీ డీ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
సూర్యరశ్మితో పాటు గుడ్లు, లివర్‌లో విటమిన్ డీ పుష్కలంగా లభిస్తున్నా ఆధునిక జీవనశైలి, నాలుగు గోడలకే పరిమితం కావడం వంటి కారణాలతో మూడో వంతు జనాభా ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. రక్తంలో విటమిన్ డీ అత్యధిక స్ధాయిలో ఉంటే ఆ మేరకు క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని జపాన్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ సెంటర్ అథ్యయనంలో వెల్లడైంది. 40 నుంచి 69 సంవత్సరాల వయస్సు కలిగిన 33,700 మంది రక్తనమూనాలను సేకరించి డేటాను 16 ఏళ్ల పాటు విశ్లేషించిన మీదట ఈ విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా లివర్ క్యాన్సర్ నివారణలో విటమిన్ డీ కీలకమని పరిశోధనలో తేలింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఈ అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.