లండన్ : మద్యం తరచూ సేవిస్తే డీఎన్‌ఏ దెబ్బతిని క్యాన్సర్ సోకే రిస్క్ అధికమవుతుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆధ్వర్యంలో సాగిన ఓ అథ్యయనం హెచ్చరించింది. మద్యంతో క్యాన్సర్ ముప్పుపై గతంలో పలు పరిశోధనలు వెల్లడించినా, మద్యం కారణంగా మానవ డీఎన్‌ఏకు శాశ్వతంగా ఎంతటి నష్టం జరుగుతుందో వెల్లడించేందుకు తాజా అథ్యయనంలో పరిశోధకలు ఎలుకలపై చేసిన ప్రయోగ ఫలితాలను వివరించారు.
బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ఎలుకలకు ఆల్కహాల్‌ను ఇచ్చారు. అనంతరం వాటి శరీరంలో ఆల్కహాల్ ప్రవేశించిన అనంతరం రూపొందే హానికారక రసాయనం జన్యువులకు చేసే నష్టాన్ని పరిశీలించేందుకు క్రోమోజోమ్ విశ్లేషణను చేపట్టారు. రక్తకణాల్లోని డీఎన్‌ఏను ఈ రసాయనం విచ్ఛిన్నం చేస్తూ డీఎన్‌ఏ సీక్వెన్స్‌లు గతితప్పేలా చేస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. స్టెమ్ సెల్స్‌లో డీఎన్‌ఏ దెబ్బతినడంతో కొన్ని రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదం పొంచి ఉందని అథ్యయన వివరాలు వెల్లడిస్తూ ప్రొఫెసర్ కేతన్ పటేల్ స్పష్టం చేశారు. ఆల్కహాల్‌ను సేవించడంతో డీఎన్‌ఏ దెబ్బతినే అవకాశం అధికమని తమ అథ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు. మానవ శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలూ దెబ్బతింటే అవి క్యాన్సర్ డెవలప్ అయ్యేందుకు ఉపకరిస్తాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment