ప్రపంచ జనాభాను వణికిస్తున్న వ్యాధి కేన్సర్. ఇతర ప్రమాదకర కేన్సర్లతో పాటు, మహిళలు రొమ్ముకేన్సర్, సర్వైకల్ కేన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ కేన్సర్‌కు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. భారతీయ స్త్రీలకు చీరల వల్ల కేన్సర్ వ్యాధి పొంచి ఉందిట. చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు, అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. అయితే దుస్తులు ఏవైనా పరిశుభ్రతే ఎక్కువ కారణమని వైద్యులు పేర్కొడం గమనార్హం. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ లాంటి చోట్ల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పరిశోధనలో ధోతీ కూడా ఉంది.
చీర కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన అందమైన దుస్తుల్లో ఒకటి. ఐదున్నర నుండి ఆరు మీటర్ల చీరను ధరించడం ఆనవాయితీ. ఢిల్లీలోని పిఎస్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా, ఒకే వస్త్రాన్ని ఎక్కువసేపు ధరించడం వల్ల నడుము వద్ద రాపిడి ఏర్పడుతుంది. చర్మం రంగు మారుతుంది. పొట్టులాగా రావడం జరుగుతుందిట. ఆ తరువాత మానని పుండుగా మారి ఇదే కేన్సర్‌కు దారితీసే అవకాశాలున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC), చీర క్యాన్సర్ అని పిలుస్తారని పరిశోధకులు తెలిపారు.
నడుము చుట్టూ ఇరిటేషన్, పుండ్లు
తాజాగా 68 ఏళ్ల మహిళ ఈ కేన్సర్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. చీర కట్టుకోవడం వలన వచ్చిన కేన్సర్ కాబట్టి, దీన్ని చీర కేన్సర్‌గా భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత, తేమ ఉండే జార్ఖండ్, బీహార్‌లో చీర క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య ఒక శాతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. డెర్మటోసిస్ నుండి ఉత్పన్నమయ్యే ప్రాణాంతక, చాలా అరుదైన కేసుగా వైద్యులు పేర్కొంటున్నారు.
భారత దేశంలోని అనేక ప్రాంతాలలో, ధనికులు, పేదలు, పట్టణ లేదా గ్రామీణ మహిళలు ఏడాది పొడవునా, వారానికి ఏడు రోజులు చీరలను ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి ఏ పని చేస్తున్నా రోజంతా చీరలోనే ఉంటారు. చీర జారిపోకుండా ఉండేందుకు పెటీకోట్‌ను నాడాతో గట్టిగా కట్టుకుంటారు. ఇలా గట్టిగా కట్టు కోవడం వల్ల నడుము చుట్టూ చర్మం కమిలిపోవడం, దురద రావడం, క్రమంగా పుండ్లు రావడం.. ఇవన్నీ చీర కట్టుకునేవారికి అనుభవమే. అధిక ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఇది మరీ చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఇది కేన్సర్‌గా (చాలా అరుదు)గా మారే ప్రమాదం ఉంది.
అంతేకాదు జీన్స్‌తో సహా బిగుతుగా ఉండే దుస్తులు ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని, మగవారిలో వ్యంధ్యత్వ సమస్యకు దారి తీస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి విదితమే.
కాశ్మీర్‌లో కాంగ్రీ కేన్సర్
అదేవిధంగా, కాశ్మీర్‌లో కాంగ్రీ కేన్సర్ అని పిలువబడే చర్మ కేన్సర్‌కి మరో రూపం. చలికాంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానం వల్ల ఈకేన్సర్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు , తొడ ప్రాంతాలలో కాంగ్రిస్ నుండి వేడికి ఎక్కువ కాలం ఎక్స్‌పోజ్ కావడం దీనికి దారి తీస్తుంది.
నోట్ : చీరలు కట్టుకునేవారికి అందరికీ కేన్సర్ వస్తుందని కాదు. దుస్తులు ఏవైనా, పరిశుభ్రంగా ఉండటం, మరీ బిగుతుగా కట్టుకోకుండా ఉండటం అవసరం. అలాగే లోదుస్తుల విషయంలో, ముఖ్యంగా వేసవిలో చాలా పరిశుభ్రతను పాటించాలి. చిన్న పిల్లల విషయంలో కూడా అప్రతమత్తత అవసరం. నడుము చుట్టూ గానీ, స్థనాల వద్ద, తొడలు, జననాంగాల మధ్య ఇరిటేషన్, నల్లటి మచ్చలు మానని పుండ్లు లాంటి సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment