
‘అగ్గిపెట్టెలో పట్టే చీర’ను చూస్తూ రాష్ట్రపతి ముర్ము ఆశ్చర్యం
రాష్ట్రపతి భవన్‌లో ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ/భద్రాచలం: ‘యే క్యాహై?.. బహుత్ అచ్ఛా హై.. ఇస్‌కో కైసే బనాతే హో? (ఇదేంటి? చాలా బాగుంది..! ఎలా తయారు చేస్తారు?)’.. అంటూ అగ్గిపెట్టెలో పట్టేలా చేతితో నేసిన చీరను చూసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆశ్చర్యానికి గురయ్యారు. సిరిసిల్ల చేనేత కళాకారులపై ప్రశంసలు కురిపిస్తూ చీర తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ సౌత్ ఎడిషన్ ప్రారంభమైంది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంబోత్సవానికి ముందు తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించిన రాష్ట్రపతిని.. గవర్నర్, ఉపముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను వివరించారు. ఉత్సవ ప్రారంభంలో కళాకారులు ప్రదర్శించిన గుస్సాడీ నృత్యం ఆహూతులను అలరించింది.
ఈనెల 9 వరకు ఉత్సవం కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్‌లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌తో సహా 20 మంది పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది నిపుణులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి భవన్‌లో ‘భద్రాద్రి’ ఉత్పత్తులు
తెలంగాణ నుంచి భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని మహిళలు రూపొందించిన పలు రకాల సబ్బులు, షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు, కరక్కాయ పౌడర్, తేనె, న్యూట్రీ మిక్స్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్టు పీఓ రాహుల్ తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళలు రూపొందించే ఉత్పత్తులు, వాటి వల్ల ప్రయోజనాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ సూచనలతో ఈ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment