కొన్ని కథల్లో భలే గమ్మత్తైన ట్విస్ట్ ఉంటుంది. ఊహకే అతీతంగా ఉంటుంది. తీరా అసలు విషయం తెలిశాక అబ్బా.. పక్కపక్కనే ఉంటూ గుర్తించలేకపోయామా..! అనిపిస్తుంది. అలాంటి విచిత్రమైన పరిస్థితే.. ఓ తల్లి కొడుకులకు ఎదురయ్యింది. ఇద్దరూ ఎదురుపడుతున్నా..ఒకరికి.. ఒకరూ.. ఏమవుతారో తెలియని స్థితి. ఏ విధి అయితే ఆ తల్లి బిడ్డలు వేరయ్యేలా చేసిందే.. అదే మళ్లీ అత్యంత విచిత్రంగా.. సరైన సమయంలో వారిని కలిపింది. ఆ తల్లికి స్వాంతన కల్పించింది. ఇంతకీ వారిద్దరి మధ్య విధి ఆడిన గమత్తైన కథ ఏంటంటే..
అమెరికాలోని చికాగోకి చెందిన 50 ఏళ్ల వామర్ హంటర్ తన ఇంటి సమీపంలో ఉండే 'గివ్ మీ సమ్ సుగా' అనే బేకరీ వద్దకు తరుచుగా వెళ్తుండేవాడు. అది ఆయనకు ఎంతో ఇష్టమైన బేకరీ. కానీ సరదాకి కూడా హంటర్ ఈ బేకరీ తనదవుతుందని, త్వరలో తానే నడుపనున్నానని ఎప్పుడూ ఊహించలేదు హంటర్.
ఇక హంటర్‌కి చిన్నతనం నుంచి ఇంట్లోని వాళ్లు తనవాళ్లు కారనే ఫీలింగ్ మనసులో బలంగా ఉంటుండేది. అయితే తనకు 35 ఏళ్ల వయసు వచ్చినప్పుడే.. తనని దత్తత తీసుకున్నారని, వాళ్లంతా తన కుటుంబసభ్యులు కారని తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుంచి తన కన్నతల్లి గురించి అన్వేషించడం ప్రారంభించాడు.
ఈ విషయంలో కాలిఫోర్నియాకు చెందిన జన్యు శాస్త్రవేత్త గాబ్రియెల్లా వర్గాస్ హంటర్‌కి సహాయం చేశారు. అతడి కన్నతల్లి 'గివ్ మీ సమ్ సుగా' బేకరీ యజమాని 67 ఏళ్ల లెనోర్ లిండ్సే అని కనిపెట్టడమే గాక ఆమెకు హంటర్ వివరాలు తోసహా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సరిగ్గా ఆ సమయంలో లిండ్సే బ్రెస్ట్ కేన్సర్‌కి చికిత్స తీసుకుంటోంది.
చెప్పాలంటే కీమోథెరపీ చేయించుకోవడానికి సిద్ధమవుతోంది. తన పరిస్థితి ఎలా ఉన్నా లెక్కచేయక..వెంటనే ఆ జన్యు శాస్త్రవేత్త ఇచ్చిన ఫోన్‌నెంబర్‌కి కాల్ చేసి హంటర్‌తో మాట్లాడుతుంది. అయితే ఆ ఫోన్‌లో తాను తరచుగా విన్న.. కస్టమర్ గొంతులా ఉండటంతో ఆశ్యర్యపోతుంది. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నాక..లిండ్సే హంటర్ తన కొడుకేనని నిర్ధారించుకుని.. తనను ఎందుకు దత్తతకు ఇవ్వాల్సి వచ్చిందో హంటర్‌కి విరిస్తుంది.
నిజానికి 1974లో హంటర్‌కి జన్మనిచ్చే సమయానికి లిండ్సేకి 17 ఏళ్లు. కుటుంబం తీవ్ర దారిద్య బాధల్లో కొట్టుమిట్టాడటంతో గత్యంతర లేక హంటర్‌ని దత్తతకు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్నాళ్లు పక్కపక్కనే ఉండి..అదికూడా తన తరుచుగా వెళ్లే బేకరీ.. యజమానే తన తల్లి అని తెలుసుకుని హంటర్ ఆనందానికి అవధులు లేవనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ తల్లి కొడుకులిద్దరూ కలిసి ఆ బేకరిని నడుపుతున్నారు. పరిస్థితులు ఆ తల్లి కొడుకులిని వేరే చేస్తే..విధి ఇద్దరిని పక్కపక్కనే ఉంచి.. సరైన సమయానికి చిత్రంగా కలిపింది కదూ..!. ఒకరకంగా ఆ తల్లికి ఈ వయసులో కొడుకు ఆసరా ఎంతో అవసరం కూడా.
(చదవండి: మోడలింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో..డిజిటల్ స్టార్‌గా ఫోర్బ్స్‌లో చోటు!)
Comments
Please login to add a commentAdd a comment