దేశీయంగా తొలి ఈ–కామర్స్ ఎగుమతుల హబ్ ( E-Commerce Export Hub) ఈ ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేసేందుకు అయిదు సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు వివరించారు.
ఢిల్లీలో లాజిస్టిక్స్ అగ్రిగేటర్ షిప్‌రాకెట్, ఎయిర్ కార్గో హ్యాండ్లింగ్ సంస్థ కార్గో సర్వీస్ సెంటర్; బెంగళూరులో డీహెచ్‌ఎల్, లెక్స్‌షిప్; ముంబైలో గ్లోగ్లోకల్ ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ హబ్‌ల నిర్వహణ విధి విధానాలను రూపొందించడంపై వాణిజ్య, ఆదాయ విభాగాలు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) కలిసి పని చేస్తున్నాయని సారంగి చెప్పారు.
గేట్‌వే పోర్టుల్లో కస్టమ్స్ పరిశీలన నుంచి మినహాయింపులు, రిటర్నుల కోసం సులభతరమైన రీఇంపోర్ట్ పాలసీ మొదలైన ఫీచర్లు ఈ హబ్‌లలో ఉంటాయి. ఈ–కామర్స్ ఎగుమతులను పెంచుకోవడంపై భారత్ మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో వీటి ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం భారత్ ఈ–కామర్స్ ఎగుమతులు 5 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి వీటిని 100 బిలియన్ డాలర్లకు పెంచుకునే సామర్థ్యాలు ఉన్నాయనే అంచనాలు నెలకొన్నాయి.
ట్రేడ్ కనెక్ట్ ఈ-ప్లాట్‌ఫామ్ రెండవ దశను ప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కృషి చేస్తోందని సారంగి ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన మొదటి దశ ఎగుమతులు, దిగుమతులపై అవసరమైన సమాచారాన్ని అందించింది. రెండవ దశతో వాణిజ్య వివాదాలకు పరిష్కారం, వాణిజ్య విశ్లేషణలు, విదేశీ మిషన్ల నుండి ఇంటెలిజెన్స్ నివేదికలు, వాణిజ్య ఫైనాన్స్, బీమా ఎంపికలు వంటి అదనపు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఏప్రిల్ 1 నుంచి డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్
మరోవైపు డైమండ్ ఇంప్రెస్ట్ ఆథరైజేషన్ (DIA) పథకం ప్రారంభానికి సంబంధించిన ప్రణాళికలను కూడా డీజీఎఫ్‌టీ వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. ఈ స్కీమ్ నిర్దిష్ట పరిమితి వరకు కట్, పాలిష్ చేసిన వజ్రాలను సుంకం-రహిత దిగుమతికి అనుమతిస్తుంది. వజ్రాల ప్రాసెసింగ్, విలువ జోడింపునకు భారత్‌ను కేంద్రంగా మార్చడమే దీని లక్ష్యం. డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్ అర్హతగల ఎగుమతిదారులు గత మూడు సంవత్సరాల నుండి వారి సగటు టర్నోవర్‌లో 5 శాతం వరకు 10 శాతం విలువ జోడింపు అవసరంతో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment