మూన్‌లైటింగ్. ఇటీవలి కాలంలో అందరి నోళ్లలోనూ బాగా నానుతున్న పేరు. విప్రో సంస్థ ఇటీవల ఏకంగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో మరోసారి ఈ పేరు బాగా తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మెయిల్స్ పంపింది. మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని సుతరామూ ఆమోదించబోమని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా స్పష్టం చేసింది. స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ టీసీఎస్ కూడా పేర్కొంది. బడా ఐటీ సంస్థలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది...
అనైతికమా?
ఒక సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా ఉంటూ ఖాళీ సమయాల్లో, వారాంతాల్లో ఇతర సంస్థలకు పని చేయడాన్ని మూన్‌లైటింగ్‌గా పిలుస్తున్నారు. నిజానికి అదనపు ఆదాయం కోసం పని వేళల తర్వాత చాలామంది ఇతర పనులు చేయడం కొత్తేమీ కాదు. బడుగు జీవులు వేతనం చాలక ఇలా చేస్తే ఏమో గానీ భారీ జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు మాత్రం ఇతర సంస్థలకు, అదీ తమ ప్రత్యర్థులకు పని చేయడం అనైతికమన్నది ఐటీ సంస్థల వాదన.
బెంగళూరులో ఓ ఐటీ సంస్థ ఉద్యోగికి ఏకంగా ఏడు పీఎఫ్ ఖాతాలున్నట్టు తేలడం సంచలనం సృష్టించింది. చిన్నాదా, పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా పీఎఫ్ ఖాతా తప్పనిసరి కావడం తెలిసిందే. విప్రో కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న తమ ఉద్యోగులను పీఎఫ్ ఖాతాల ద్వారానే గుర్తించిందని స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాజీవ్ మెహతా చెప్పడం సంచలనంగా మారింది. ఈ ఒరవడి మనకు కాస్త కొత్తగా అన్పించినా అమెరికాలో మాత్రం 2018లోనే బహుళ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య 7.2 శాతం పెరిగిందట. అక్కడ మహిళలు అధికంగా మూన్‌లైటింగ్ చేస్తున్నట్టు తేలింది.
సమర్థకులే ఎక్కువ...
మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనైతికమే గాక సంస్థ పట్ల పచ్చి మోసమేనంటారు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ. టీసీఎస్ అధిపతి గణపతి సుబ్రమణ్యం దీన్ని నైతిక సమస్యగా అభివర్ణించారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్‌పాయ్ మాత్రం ఇందులో మోసమేముందని ప్రశ్నస్తున్నారు. ‘‘నిర్ణీత సమయం పాటు సంస్థలో పని చేస్తానంటూ ఉద్యోగి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ పని చేస్తే సంస్థకేంటి?’’ అన్నది ఆ్న ప్రశ్న.
టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ అయితే ఓ అడుగు ముందుకేసి తమ ఉద్యోగులు పనివేళల తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఓ విధానమే రూపొందిస్తామని ప్రకటించారు. మూన్‌లైటింగ్‌కు అనుమతించిన తొలి సంస్థగా ఆన్‌లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ నిలిచింది. ఫిన్‌టెక్, యూనికార్న్, క్రెడ్ సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. మింట్ సర్వేలో 64.5 శాతం మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. అనైతికమన్న వారి సంఖ్య కేవలం 23.4 శాతమే.
-దొడ్డ శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment