300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విప్రో
మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక
మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని ఆమోదించబోమంటూ స్పష్టం చేసిన అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం
స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ పేర్కొన్న టీసీఎస్.
ఇలా దిగ్గజ ఐటీ కంపెనీలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా.. మరో వైపు మూన్‌లైటింగ్ పాల్పుడుతున్న ఉద్యోగుల్ని సంస్థలు విధుల నుంచి తొలగిస్తున్నాయి. నియామకాల్ని నిలిపివేసి.. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఈ అంశం ఉద్యోగులకు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఉద్యోగం సంపాదించిన అభ్యర్ధుల్ని కలవరానికి గురి చేస్తోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు జల్లెడ పడుతున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను, తప్పుడు పత్రాలతో చేరిన సిబ్బందిని ఏరివేస్తున్నాయి. అభ్యర్థులకు ప్రత్యక్షంగా మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్, ప్రావిడెంట్ ఫండ్ స్టేట్‌మెంట్లను ఉద్యోగుల సమక్షంలో, లైవ్‌లో తనిఖీ చేస్తున్నాయి.
స్నేహితులు, సీనియర్ల సహకారంతో గతంలో ఇంటర్వ్యూలు గట్టెక్కినవారు.. ఈ ఇంటర్యూల్లో నోరెళ్లబెడుతున్నారట. కొందరు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నట్టు బయటపడింది. బెంచ్ మీద ఉన్నవారిని క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తేనే వేతనం. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే.
నియామకాలు చేపట్టవద్దని..
మూడు నెలల నుంచే జల్లెడ పట్టే కార్యక్రమాన్ని కంపెనీలు ప్రాధాన్యతగా చేపట్టాయి. తప్పుడు అనుభవం, వేతన ధ్రువపత్రాలతో వందలాది మంది చేరినట్టు తేలిందని పరిశ్రమ వర్గాల సమాచారం. విధుల్లో మరొకరి సాయం తీసుకున్నట్టు కొందరిని గుర్తించారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి.
ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ చేరిక తేదీని ఐటీ సంస్థలు వాయిదా వేస్తున్నాయని స్మార్ట్‌స్టెప్స్ కో–ఫౌండర్ నానాబాల లావణ్య కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే పరిశ్రమలో తప్పుడు సంకేతం వెళుతుందన్నారు. కాగా.. విప్రో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇలా బయటపడింది..
మహమ్మారి కాలంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానం, మరికొన్ని పూర్తిగా కార్యాలయం నుంచి విధులను అమలులోకి తెచ్చాయి. కొందరు ఆఫీస్‌కు రాలేమని పట్టుపట్టారు.
సిబ్బంది ఎందుకు ఇలా చేస్తున్నారనే అంశంపై కంపెనీలు లోతుగా పరిశీలించాయి. వీరు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నట్టు తేలింది. కంపెనీలు పట్టుపట్టడంతో అధికంగా జీతం ఇచ్చే సంస్థల్లో ఇటువంటివారు చేరారు. ఆఫీస్‌లో ప్రత్యక్షంగా పని చేయాల్సి రావడంతో తప్పుడు అనుభవంతో చేరినవారు సాంకేతిక పరిజ్ఞానం లేక చేతులెత్తేశారు. మోసపూరితంగా చేరినవారిని రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందిగా కంపెనీలు ఆదేశిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment