అంతర పంటలతో అదనపు ఆదాయం
అనంతపురం అగ్రికల్చర్ : ఏకపంట విధానానికి స్వస్తి పలికి ప్రధాన పంటలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. ఖరీఫ్ ఆరంభం కావడంతో వర్షాలు కూడా కురుస్తుండటంతో రైతులు పంటల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు.
అంతర పంటల ప్రాధాన్యత
జిల్లాలో ప్రధానంగా వేరుశనగ అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే చాలా మంది రైతులు కేవలం వేరుశనగ మాత్రమే వేస్తున్నందున నష్టపోతున్నారు. అందులో అంతర పంటలు వేసుకోవడం వల్ల తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. వీటి వల్ల పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు కూడా తగ్గుతాయి. 7:1 లేదా 11:1 లేదా 15:1 నిష్పత్తిలో వేరుశనగలో అంతర పంటగా కంది వేసుకోవడం బాగుంటుంది. బెట్ట ఏర్పడినా వేరుశనగ దెబ్బతిన్నా కంది పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏకపంటగా కంది పంట వేసుకోవడం జరుగుతోంది. కంది సాళ్ల మధ్య 1:4 లేదా 1:7 నిష్పత్తిలో పెసర, కొర్ర పంటలు వేసుకోవచ్చు. పెసర పంట 70 రోజుల్లో చేతికి వస్తుంది.
తర్వాత కంది సాళ్ల మధ్య ఉలవ కూడా వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. ఎర్రనేలలు 1:4 నిష్పత్తిలో కంది+కొర్ర సాగుకు అనుకూలం. నల్లరేగడి భూముల్లో చాలా మంది కేవలం పప్పుశనగ మాత్రమే వేస్తున్నారు. పప్పుశనగ పంట వేసే ముందు కొర్ర వేసుకోవచ్చు. ఆముదం+ప్రత్తి వేసే రైతులు అంతర పంటగా కంది 4:1 లేదా 7:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. నవధాన్యపు పంటలు వేసుకోవడం మరచిపోకూడదు. వేరుశనగ ప్రధాన పొలం చుట్టూ జొన్న, సజ్జ లాంటి పంటలు నాలుగైదు వరుసలు వేసుకోవడం వల్ల అదనపు ఆదాయంతో పాటు చీడపీడలు, పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. బీటీ ప్రత్తి పంట వేసే రైతులు పొలం చుట్టూ నాన్‌బీటీ విత్తనాలు వేసుకోవాలి. దీని వల్ల ప్రమాదకరమైన గులాబీరంగు కాయతొలచు పురుగు ఉనికి, ఉధృతిని నివారించుకోవచ్చు.
ప్రస్తుతం ఆముదం, కందికి అనుకూలం
దుక్కులు చేసుకుని సిద్ధంగా ఉన్న రైతులు ఈ వర్షాలకు కంది, ఆముదం పంటలు విత్తుకోవచ్చు. నీటి వసతి కింద అయితే వేరుశనగ పంట సాగు చేయవచ్చు. వర్షాధారంగా అయితే వేరుశనగ పంట సాగుకు జూలై మంచి సమయం. విత్తే ముందు సిఫారసు చేసిన విధంగా విత్తనశుద్ధి పాటించాలి. విత్తుకున్న 24 లేదా 48 గంటల్లోగా సిఫారసు చేసిన విధంగా కలుపు నివారణ మందులు పిచికారీ చేసుకుంటే 30 రోజుల పాటు పంటకు కలుపు సమస్య ఉండదు.