సాక్షి, ముంబై: ముంబై అనగానే... లోకల్ రైళ్లు మన కళ్ల ముందు కదలాడతాయి. అవును... క్షణం తీరిక లేకుండా ఉండే నగర అభివృద్ధిలో లోకల్ రైళ్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెస్టు బస్సులు, ట్యాక్సీలు, ఆటోలతోపాటు లోకల్ రైళ్లు ముంబై నగరం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటికి తోడుగా ఇటీవలే మోనో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఏ నగరాభివృద్ధిలోనైనా రవాణా వ్యవస్థ కీలకం. మరి అది దేశ ఆర్ధిక రాజధాని అయితే... అందుకే ఇప్పుడు ముంబై రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.
త్వరలోనే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ జల రవాణా ప్రారంభించాలనే డిమాండ్ కూడా పెద్దఎత్తున ఉంది. భవిష్యత్తులో జల రవాణా వ్యవస్థ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ముంబై నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడం ఖాయం.
లైఫ్‌లైన్‌లు...
ముంబైలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు బెస్టు బస్సులతో పాటు ప్రధానంగా సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ సేవలు ‘ముంబై లైఫ్‌లైన్’లుగా గుర్తింపు పొందాయి. ఉరుకులు, పరుగులతో నగర జీవితం నిత్యం బిజీ. తీరిక లేని ప్రజల జీవన విధానానికి తగ్గట్టుగా నగరంలో రవాణా వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి ఐదు నిమిషాల తేడాతో నడిచే బెస్టు బస్సులు, లోకల్ రైళ్లలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రతి రోజూ సుమారు 65 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. దీంతో ఇక్కడ సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్ ఇలా మూడు మార్గాల్లో లోకల్ రైళ్లను నడుపుతున్నారు.
కాగా ముంబై నగరానికి అంతర్జాతీయ హోదాను దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. భారీ వ్యయంతో కూడుకున్న మోనో, మెట్రోలాంటి ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మోనో రైలు సేవలు...
దేశంలోనే మొట్టమొదటి రైలు ముంబై- ఠాణేల మధ్య ప్రారంభమైన విషయం విదితమే. ఇక్కడ లోకల్ రైళ్లు కూడా చాలా సంవత్సరాల కిందటే ప్రారంభమయ్యాయి. తాజాగా దేశంలోని మొట్టమొదటి మోనో రైలు సేవలు కూడా ఇక్కడే ప్రారంభం కావడం విశేషం. ఇవి మొదటి విడతలో చెంబూర్-వడాలా వరకు ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఏసీ కోచ్‌లతో భూమికి సుమారు 20 అడుగుల ఎత్తుపై నుంచి ఎలాంటి శబ్దంలేకుండా వెళ్లే ఈ మోనో సేవలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించినంతగాలేదని తెలుస్తోంది. రెండో విడతలో వడాలా-సాత్ రాస్తా వరకు మోనో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి.
మెట్రో రైలు సేవలు...
రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ 11.4 కి.మీ.పొడవైన మెట్రో మార్గం పనులు పూర్తి అయ్యాయి. ఈ ‘ముంబై మెట్రో-1 కు అన్ని అనుమతులు లభించాయి. ఈ రైళ్లు ప్రారంభంలో గంటకు 50 కి.మీ. వేగంతో నగరంలో పరుగులు పెడతాయని మెట్రో-1 అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పిల్లర్ల మీదుగా సాగుతుంది. దీంతో రైళ్లకు ఎలాంటి అడ్డంకులు, ట్రాక్‌కు ఇరువైపుల మురికివాడలు, లెవెల్ క్రాసింగ్‌లు ఉండవు. అలాగే మెట్రో రైల్వే ట్రాక్‌లు ప్రత్యేక లోహంతో తయారుచేసినవి కావడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమే లేదు. భవిష్యత్తులో గంటకు 80 కి .మీ. వేగంతో రైళ్లను నడపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్డీఎస్‌ఓ స్పష్టం చేసింది. కాగా కొన్ని ప్రమాదకర మలుపులవద్ద వేగాన్ని కొంత నియంత్రించాల్సి ఉంటుంది. మిగతా చోట్ల నిర్దేశించిన వేగంతోనే రైళ్లను నడిపేందుకు అనుమతివ్వనున్నట్లు ఆర్డీఎస్‌ఓ అధికారులు పేర్కొన్నారు.
జల రవాణా...
నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకొంటూ జల రవాణా ప్రారంభించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల అతి తక్కువ సమయంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడంతోపాటు ట్రాఫిక్ జాం, కాలుష్య సమస్యలు కూడా ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. ముంబై-నవీముంబైల మధ్య రోడ్లపై, లోకల్ రైళ్లపై భారం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని తగ్గించేందుకు రహదారులను పెంచడం, వెడల్పు చేయడం, లోకల్ రైళ్ల సంఖ్య పెంచేందుకు వీలు లేకుండాపోవడంతో ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన్ని ఎంచుకోక తప్పడం లేదు.
ఇందులో భాగంగా నవీముంబైలోని నేరుల్ నుంచి ముంబైలోని భావుచా ధక్కా వరకు లేదా మాండ్వా నుంచి భావుచా ధక్కా వరకు జల మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ముంబై నుంచి నవీముంబై వరకు రోడ్డు మార్గం మీదుగా చేరుకోవాలంటే కనీసం గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే కేవలం 20 నిమిషాల్లో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు.
లోకల్ రైళ్లే మేలు...
మరోవైపు మోనో, మెట్రో రైల్వే సేవలకంటే లోకల్ రైళ్లు సౌకర్యవంతంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లోకల్ రైళ్లతో పోలిస్తే మోనో, మెట్రో రైళ్లలో ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం చాలా తక్కువ. లోకల్ రైళ్లలో రద్దీ సమయంలో గంటకు 3.60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. అయితే మెట్రో రైలులో గంటకు 60 వేల మంది, మోనో రైలులో గంటకు కేవలం 6,295 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది.
ఎలివేటెడ్ మార్గం
చర్చిగేట్ నుంచి విరార్, ముంబై నుంచి ఠాణేల వరకు ప్రస్తుతం నేలపై ఉన్న రైల్వే ట్రాక్‌ల వెంబడి పైనుంచి (ఎలివేటెడ్) వెళ్లే మార్గం నిర్మించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్ల మాదిరిగా గంటకు దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా చాలావరకు తగ్గేందుకు ఆస్కారం ఉంది. దీనికోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎలివేటెడ్ రైల్వే మార్గాన్ని పక్కనబెట్టి మోనో, మెట్రో లాంటి ఖరీదైన ప్రాజెక్టులు ప్రారంభించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
‘రవాణా’లో ముంబై ముందడుగు
Published Mon, May 12 2014 11:35 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement