సాక్షి, ముంబై: జలరవాణా, ఠాణే మెట్రో, ట్రాన్స్ హార్బర్ సీలింకు వంటి కీలక ప్రాజెక్టులకు ఎన్నికల తర్వాతే మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుండడంతో దాదాపుగా ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంద ని, ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని, దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వద్ద కీలక ప్రాజెక్టుల విషయమై నిర్ణయం తీసుకునేంత సమయం లేదని, కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వమే ఈ ప్రాజెక్టులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెమ్మార్డీయే అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య తలెత్తిన విభేదాలు కూడా ఈ ప్రాజెక్టులు ఆలస్యమవడానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. పెండింగులో ఉన్న ఈ ప్రాజెక్టుల భవిత ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుదని చెబుతున్నారు. జలరవాణ, ఠాణేమెట్రో, ట్రాన్స్ హార్బర్ సీ లింకు వంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టుల ప్రతిపాదనలు కొంతకాలంగా పెండింగులోనే ఉన్నాయి.
వీటికి సంబంధించిన ఫైళ్లు ఇటీవలే ముందుకు కది లాయి. దీంతో త్వరలో వీటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుండవచ్చని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని శాసనసభ ఎన్నికలు సమీపించడంతో అన్ని రాజకీయ పార్టీ లు అభ్యర్థుల ఎంపిక, జాబితా రూపొందించడం, సీట్ల పంపకం తదితర పనుల్లోనే బిజీగా ఉన్నాయి. అధికారంలో కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు కూడా మార్పులు, చేర్పులపైనే దృష్టి సారించారు. దీంతో వేలాది కోట్ల రూపాయల విలువచేసే ఈ కీలక ప్రాజెక్టుల విషయంలో ఇంత తక్కువ సమయంలో ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకొని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని పలువురు చెబుతున్నారు.
ఫలితంగా వీటికి ఎన్నికల ముందే ముహూర్తం లభిం చే అవకాశాలు సన్నగిల్లినట్లేనని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. వీటికి గ్రీన్‌సిగ్నల్ లభించాలంటే కీలకమైన వ్యక్తులతో కూడిన ఓ కమిటీ ప్రత్యేకంగా ఏర్పా టు చేయాలని, ఆ తరువాత చర్చలు, ప్రణాళికలు రూపొందించాలని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు ఈ పనులన్ని పూర్తిచేయాలని చెబుతున్నారు.
అటకెక్కనున్న కీలక ప్రాజెక్టులు
Published Sun, Aug 3 2014 11:38 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement