water transport
-
జల రథ సారథులు
మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్లు.అరుణిమ, లక్ష్మి, స్నేహఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్లు నియమితులయ్యారు.75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లుకొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.పురుష ప్రపంచంలో మహిళా సారథులుకేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ. ‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు. -
1,555 కి.మీ. జలమార్గాల్లో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంతర్గత జలరవాణా అభివృద్ధిపై దృష్టిసారిస్తున్నట్టు ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ చెప్పారు. త్వరలోనే జలరవాణా, కార్గో రవాణాలో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) తీసుకొస్తామన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సంయుక్తంగా బుధవారం విజయవాడలో వివిధ స్టేక్ హోల్డర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా రంగంలో జలరవాణా గ్రోత్ ఇంజన్‌గా మారుతోందన్నారు. కాలుష్యంతోపాటు ప్రతి కిలోమీటరుకు టన్ను సరుకు రవాణాలో రైలు కంటే 18 శాతం, రోడ్డు మార్గం కంటే 54 శాతం ఖర్చు తగ్గుందని చెప్పారు. ఈ క్రమంలోనే లాభదాయక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నదీమార్గాల సామర్థ్యాల పెంపుపై సాంకేతిక పద్ధతిలో సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరితో పాటు సుమారు 57 చిన్న, పెద్ద నదులున్నాయన్నారు. వీటిద్వారా 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరరేఖలోని కోస్టల్ షిప్పింగ్‌ను ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్తో అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వీటిల్లో దాదాపు 1,555 కిలోమీటర్ల పొడవైన 11 నదులు/కాలువలు సరకు రవాణాకు అనువైన జలమార్గాలుగా మారతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత జలరవాణాలో ఏటా 8 మిలియన్ టన్నుల సరుకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ సీఈవో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏపీకి నేషనల్ వాటర్‌వేస్ (ఎన్‌డబ్ల్యూ)4 నంబరును కేటాయించగా.. దాదాపు 90 శాతం జలమార్గం ఏపీలోనే ఉందని చెప్పారు. కృష్ణానదిలో (వజీరాబాద్–విజయవాడ) 157 కిలోమీటర్లు, గోదావరిలో (భద్రాచలం–రాజమహేంద్రవరం) 171 కిలోమీటర్లు, కాకినాడ కెనాల్ (కాకినాడ పోర్టు– ధవళేశ్వరం) 50 కి.మీ., ఏలూరు కెనాల్ (రాజమహేంద్రవరం–విజయవాడ) 139 కి.మీ., కొమ్మమూరు కెనాల్ (విజయవాడ–పెదగంజాం) 113 కి.మీ., నార్త్ బకింగ్హమ్ కెనాల్ (పెదగంజాం–తడ) 258 కి.మీ. మేర ఏపీ జలమార్గం విస్తరించిందని వివరించారు. వీటితో పాటు ఎన్‌డబ్ల్యూ 79 కింద పెన్నానది (పోతిరెడ్డిపాలెం–కుడితిపాలెం/బంగాళాఖాతం) 32 కిలోమీటర్లు, ఎన్‌డబ్ల్యూ 104 కింద తుంగభద్ర నది (కిండి సింగవరం–జోహ్రాపురం) 58 కి.మీ. ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఏడాదికి ఎనిమిది మిలియన్ టన్నుల అంతర్గత జలరవాణా జరుగుతోందన్నారు. సిమెంట్ పరిశ్రమల క్లస్టర్లలో భాగంగా ముక్త్యాల నుంచి మచిలీపట్టణం, కాకినాడ పోర్టుకు సరుకు రవాణా చేసేలా అనుసంధానం చేస్తున్నామన్నారు. కడప ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు, పవర్ ప్లాంట్లకు పెన్నానది ద్వారా కృష్ణపట్నం ఓడరేవుకు జలమార్గం కలిసొస్తుందన్నారు. గండికోటలో క్రూజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. కృష్ణానది తీరంలోని 8 ప్రముఖ ఆలయాల సందర్శనకు టెంపుల్ టూరిజం ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. తొలుత రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్చ్యువల్‌గా మాట్లాడారు. సమావేశంలో జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి, హెరిటేజ్ క్రూజ్ కోల్కత్తా ప్రతినిధి రాజ్‌సింగ్, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
జల రవాణాపై ఏపీతో చర్చలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ చెప్పారు. అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగే గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్–2023కి అనుబంధంగా డీసీఐలో ఈ నెల 28న రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లను ఎండీ దివాకర్ పరిశీలించారు. డీసీఐ పురోగతికి తీసుకుంటున్న చర్యలు, సమ్మిట్‌కు సంబంధించిన విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. జలరవాణాపై సంప్రదింపులు ప్రస్తుతం జీడీపీ విలువలో 80 శాతం వరకూ మారి టైమ్ ట్రేడ్ జరుగుతోంది. డ్రెడ్జింగ్ చేయకుండా ఏ పోర్టు అభివృద్ధి జరగదు. అందుకే ప్రధాని కూడా దేశీయ జలమార్గాల (ఇన్లాండ్ వాటర్ వేస్)పై దృష్టి సారించారు. ప్రస్తుతం 110 నదులుండగా కేవలం 4 నదుల్లో జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్ పనుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పూడికతో నిండిపోయిన డ్యామ్‌లు, రిజర్వాయర్లలోనూ డ్రెడ్జ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం చిన్నచిన్న డ్రెడ్జర్లు అవసరం అవుతాయి. దీనిపైనా సమాలోచనలు చేస్తున్నాం. డ్రెడ్జ్ చేస్తే.. వాటర్ క్యాచ్మెంట్ ఏరియా పెరుగుతుందని ఇందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాం. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపాం. ఏ ప్రభుత్వమైనా డ్యామ్‌లు, రిజర్వాయర్ల డ్రెడ్జింగ్ పనుల్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అప్పగిస్తే కొత్త డ్రెడ్జర్లు తీసుకుంటాం. దేశంలో డ్రెడ్జింగ్ కోసం 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకూ డిమాండ్ ఉంది. కానీ.. డీసీఐలో ప్రస్తుతం 59 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న10 టీఎస్‌హెచ్ డ్రెడ్జర్లు, 6 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న 2 కట్టర్ సీఎస్ డ్రెడ్జర్లు, ఒక బీహెచ్వో డ్రెడ్జర్ ఉన్నాయి. 12 వేల టన్నుల హోపర్ కెపాసిటీ డ్రెడ్జర్ కోసం ఆర్డర్ చేశాం. 2025 డిసెంబర్ నాటికి ఇది రానుంది. రూ.12 వేల కోట్ల వరకూ ఎంవోయూలు 2021లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.14 వేల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నాం. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల వరకూ వస్తాయని భావి స్తున్నాం. ఇందుకోసం 28న డీసీఐలో నిర్వహించే రోడ్‌షోలో షిప్ బిల్డర్స్, షిప్ ఆపరేటర్స్,పోర్టులు, రెగ్యులేటరీస్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం. ఏపీలో 4 పోర్టుల రాకతో అపార అవకాశాలు ఏపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని చురుగ్గా నిర్వహిస్తోంది. కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అపారమైన అవకాశాలు కలగనున్నాయి. ఈ నాలుగు పోర్టుల్లో కనీసం 150 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మచిలీపట్నంలో పనులు చేపడుతున్నాం. మిగిలిన పోర్టుల్లోనూ పనుల కోసం మరిన్ని డ్రెడ్జర్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. -
జల రవాణా ప్రాజెక్టు పట్టాలెక్కేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదితో బకింగ్ హామ్ కాలువను పునరుద్ధరించటం ద్వారా అనుసంధానించి జల రవాణా చేపట్టాలన్న ప్రణాళిక పట్టాలెక్కేలా లేదు. మహా రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. నాలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ అద్భుత ప్రాజెక్టు ద్వారా సరుకు రవాణా ఖర్చును నాలుగో వంతుకు తగ్గించే గొప్ప అవకాశం చేజారిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నదుల అనుసంధానం ద్వారా జల రవాణాకు ఊతమివ్వనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాతి క్రమంలో దీనిపై మౌనం దాల్చడమే ఇందుకు కారణం. డీపీఆర్ తయారీ కసరత్తు వరకు హడావుడిగా జరిగినా, ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో అడుగు ముందుకు పడలేదు. జలరవాణాకు, ముఖ్యంగా గోదావరి నదిలో కారిడార్ ఏర్పాటుకు విఘాతం లేని విధంగా, నదిపై నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పుడు దానితో ప్రమేయం లేకుండా పనులు జరుగుతున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు చేపడితే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో ఊరించిన జలరవాణా ప్రాజెక్టు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటీ ప్రాజెక్టు.. గోదావరి నదిలో సరుకు రవాణాకు వీలుగా ప్రత్యేక కారిడార్ ఏర్పాటును 2015లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర మీదుగా చెన్నై వరకు సరుకులు తరలించేలా ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి ప్రవహిస్తోంది. దీనిని అతిపురాతన బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా అతిపెద్ద ఓడ రేవు ఉన్న చెన్నైతో అనుసంధానిస్తే సరుకు రవాణాలో సరికొత్త విప్లవం వస్తుందని గడ్కరీ యోచించారు. నిపుణులతో సర్వే చేయించారు. బ్రిటిష్ పాలనలో కాకినాడ నుంచి తమిళ నాడులోని విల్లుపురం వరకు 796 కి.మీ. మేర బకింగ్‌హామ్ కెనాల్‌ను నిర్మించారు. అప్పట్లో ఈ కాలువను సరుకు రవాణాకు ముమ్మరంగా వాడారు. స్వాతంత్య్రానంతరం దీని ప్రాభవం క్రమంగా తగ్గిపోయింది. తాజాగా దీన్ని పునరుద్ధరించటం ద్వారా పులికాట్ సరస్సుకు అనుసంధానించి పుదుచ్చేరి వరకు విస్తరించాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది. గోదావరిని ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం (గోదావరి చివరి బ్యారేజీ) నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ (గుంటూరు జిల్లా దుగ్గిరాల) ద్వారా (ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద) బకింగ్‌హామ్ కెనాల్‌కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఈ మేరకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడ ఎలా అనుసంధానించాలో వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆ అంశం మరుగున పడిపోవడం సందేహాలకు తావిస్తోంది. సందేహాలకు తావిస్తున్న వంతెనల నిర్మాణం పడవలు నడవాలంటే నదిలో ఎప్పుడూ నీటి నిల్వ ఉండాలి. కానీ గోదావరిలో భద్రాచలం సహా చాలా ప్రాంతాల్లో వేసవిలో నీళ్లు ఇంకిపోతుంటాయి. అందువల్ల జల రవాణాకు వీలుగా ప్రత్యేకంగా కారిడార్‌ను నిర్ధారించి ఛానెల్ ఏర్పాటు ద్వారా అన్ని సమయాల్లో నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నది దాటేందుకు నిర్మించే వంతెనలు పడవల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా ప్రత్యేక డిజైన్‌ను ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆ డిజైన్‌తో సంబంధం లేకుండా పలుచోట్ల వంతెనల పనులు జరుగుతుండటం ఈ ప్రాజెక్టుపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జల రవాణాతో ఎంతో ఆదా.. ప్రస్తుతం సరుకు రవాణా సింహభాగం రోడ్డు మార్గాన జరుగుతోంది. రైల్వే లైన్ అందుబాటులో ఉన్న చోట ఎక్కువగా రైళ్ల ద్వారా సాగుతోంది. రోడ్డు మార్గాన సరుకు రవాణాకు నాలుగు రూపాయలు ఖర్చయితే, రైలు మార్గాన తరలించేందుకు మూడు రూపాయలు వ్యయం అవుతుంది. అదే జల రవాణా ద్వారా అయితే అర్ధ రూపాయితో సరిపోతుందన్నది నిపుణుల మాట. ఇటీవల ఆ ఊసెత్తని గడ్కరీ.. గతంలో జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రారంభం కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంలో గడ్కరీ గోదావరి ఇన్లాండ్ వాటర్ వే గురించి మాట్లాడారు. నాటి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో దీనిపై చర్చించారు. కానీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం దీని ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ‘గతంలో ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ గత నాలుగైదేళ్లుగా దీనిపై ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేవు. మేం మా పని చేసుకుపోతున్నాం. వంతెనలకు ప్రత్యేక డిజైన్ విషయంలో కూడా ఎలాంటి సూచనలు అందలేదు..’ అని జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
తరలుతున్న జలం
కోవెలకుంట్ల: ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి భారీగానే వరద నీరు చేరింది. ఈ నీటితో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతుల అవసరాల నిమిత్తం ఈ జిల్లాల్లోని రిజర్వాయర్లు నింపకుండానే రాష్ట్ర ప్రభుత్వం నీటి తరలింపునకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు తరలించేందుకు సిద్ధం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుందూ నది ద్వారా శుక్రవారం నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున నీటిని తరలిస్తోంది. దీనివల్ల రానున్నరోజుల్లో రెండు జిల్లాల రైతులకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. గోరుకల్లు, అవుకు నింపకుండానే.. జిల్లాలోని గోరుకల్లు రిజర్వాయర్ సామర్థ్యం 13 టీఎంసీలు, అవుకు రిజర్వాయర్ సామర్థ్యం 4.8 టీఎంసీలు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల సాధారణ నీటిమట్టం చేరితే ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తారు. ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 870 అడుగులకు పైగా నీరు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల క్రాస్ ద్వారా నీటి విడుదల జరుగుతోంది. ఇక్కడి నుంచి ఎస్సార్బీసీకి 1,300 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా.. 400 క్యూసెక్కులు అవుకు రిజర్వాయర్‌కు, 100 క్యూసెక్కులు గోరుకల్లుకు చేరుతున్నాయి. బైపాస్ కెనాల్ ద్వారా 1,200 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. ఈ నీరు కుందూనదిలో చేరుతోంది. నది ద్వారా నెల్లూరు జిల్లాకు తరలిపోతోంది. పంట పొలాలకు సాగునీటి పేరుతో ఎస్సార్బీసీ ద్వారా నీటి విడుదల జరుగుతుండగా ప్రస్తుతం రైతులు కొద్దిమేర మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఈ నీరంతా తిరిగి కుందూలో చేరి నెల్లూరు తరలిపోతోంది. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపకుండా పంట పొలాలకు సాగునీటి పేరుతో నెల్లూరుకు తరలిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ రిజర్వాయర్లలో నీరు లేక సాగునీటి సమస్య తలెత్తుతుందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం గోరుకల్లులో 1.2 టీఎంసీల(డెడ్ స్టోరేజీ) నీరు మాత్రమే ఉంది. రబీ సీజన్లో ఆరుతడి పంటలకు సాగునీరు అందించేందుకు ఎస్సార్బీసీకి నీటి కేటాయింపులు జరగ్గా.. ఇప్పటి నుంచే నీటిని విడుదల చేసి ¯ð నెల్లూరు జిల్లాకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కుందూ నది ద్వారా దాదాపు 10 టీఎంసీల నీటిని నెల్లూరు జిల్లాకు తరలించాలన్న దిశగా.. రోజుకు రెండువేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపాలి: శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున జిల్లాలోని గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లు నింపిన తర్వాతే నెల్లూరుకు తరలించాలి. ఈ రిజర్వాయర్లు నింపకుండా నీటిని తరలిస్తే రైతులకు అన్యాయం జరుగుతుంది. గోరుకల్లులో కనీసం ఐదు టీఎంసీలు, అవుకులో మూడు, వైఎస్సార్ జిల్లా గండికోట రిజర్వాయర్‌లో ఐదు, మైలవరంలో నాలుగు టీఎంసీల నీరు నింపితే రెండు జిల్లాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. కామని వేణుగోపాల్‌రెడ్డి,రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీకోఆర్డినేటర్, కోవెలకుంట్ల -
సర్వేషురూ
ఉంగుటూరు : జిల్లాలో జల రవాణా అభివృద్ధి దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు ప్రధాన కాలువను విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన భూములను గుర్తించేందుకు ఉంగుటూరు మండలం బాదంపూడి, ఉప్పాకపాడు వద్ద సర్వే పనులకు మంగళవారం శ్రీకారం చుడుతున్నారు. ఈ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కాలువ అధికారులు ఉంగుటూరు రానున్నారు. ఇందుకు అవసరమైన రికార్డులను స్థానిక అధికారులు సిద్ధం చేశారు. సర్వే పనులకు ఏలూరు ఆర్డీఓ చక్రధరరావు కో–ఆరి్డనేటర్గా వ్యవహరిస్తారు. విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకూ.. జిల్లాలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ప్రారంభమయ్యే నిడదవోలు మండలం విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు ఎంత భూమిని సేకరించాలనే విషయంపై అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. భూముల సర్వే చేపట్టాలంటూ 8 మంది తహసీల్దార్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వారు గ్రామాల వారీగా భూసేకరణ జాబితాను వీఆర్వోలకు అందజేశారు. స్థల సేకరణకు రంగం సిద్ధం చేశారు. ఆలయాల తరలింపు జల రవాణా అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువ గట్లపై ఉన్న ఆలయాలను తొలగించి మరోచోట నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. శ్మశాన వాటికలను తొలగించాల్సి వస్తే మరోచోట స్థలాలను చూపిస్తామని చెబుతున్నారు. గట్టు నుంచి 120 మీటర్లు జల రవాణా కోసం కాలువ గట్టు నుంచి 120 మీటర్ల వరకు కాలువను వెడల్పు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎక్కడెక్కడ ఎంతెంత భూముల్ని సేకరించాలనే విషయాన్ని నిర్థారించేందుకు సర్వే పనులు చేపడుతున్నారు. ఇది పూర్తయిన అనంతరం భూములను సేకరించి అప్పగించేందుకు తహసీల్దార్లు సంసిద్ధంగా ఉన్నారు. స్థల సేకరణలో భాగంగా ఎనిమిది మండలాల్లో కాలువ గట్ల వెంబడి ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. దీనివల్ల తలనొప్పులు తప్పవని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. మార్కింగ్ వేస్తారు జల రవాణా అభివృద్ధి పనుల కోసం మంగళవారం ఉంగుటూరు మండలం బాదంపూడి, వెల్లమిల్లిలో సర్వే మొదలవుతుంది. సర్వే చేసి మార్కింగ్ వేయనున్నారు. –వైకేవీ అప్పారావు, తహసీల్దార్, ఉంగుటూరు జిల్లాలోని 8 మండలాల పరిధిలో 2,547 ఎకరాల 13 సెంట్ల భూమిని జల రవాణా అభివృద్ధి పనుల కోసం సేకరించనున్నారు. మండలం సేకరించనున్న భూమి (ఎకరాల్లో) ఏలూరు 150.5 దెందులూరు 349.19 భీమడోలు 448.47 ఉంగుటూరు 403.31 పెంటపాడు 152.60 తాడేపల్లిగూడెం 467.98 నిడదవోలు 470.57 సెంట్లు కొవ్వూరు 104.94 సెంట్లు మొత్తం 2,547.13 -
నిడదవోలు టు ఏలూరు
తాడేపల్లిగూడెం : జిల్లాలో ప్రధాన జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దేశీయ జల మార్గ విధానం (ఇన్‌ల్యాండ్ వాటర్ వే పాలసీ)లో భాగంగా నిడదవోలు–ఏలూరు మధ్య 74 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి ప్రధాన కాలువను ఆధునికీకరించాలని ఇప్పటికే నిర్ణయిం చారు. కాలువ వెడల్పు పెంచేందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందనే దానిపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. సర్వే, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రయాణించే రవాణా ఓడలను నిలిపేందుకు, సరుకుల ఎగుమతి, దిగుమతులకు వీలుగా తాడేపల్లిగూడెం, ఏలూరులో ఫ్లీట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. కృష్ణా జిల్లా పరిధిలో కాలువ విస్తరణ అవసరమైన భూముల కోసం ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. మన జిల్లాలోనూ సర్వే, భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేసి వచ్చే వేసవి నాటికి కాలువ విస్తరణ చేపట్టాలనే ప్రణాళికతో యంత్రాంగం ముందుకు వెళుతోంది. కాలువ గర్భం 25 మీటర్లు.. వెడల్పు 40 మీటర్లు ఏలూరు కాలువ గర్భం 25 మీటర్లు, ఉపరి తలంపై కాలువ వెడల్పు 40 మీటర్లు ఉం డేలా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువకు రెండు వైపులా కలిపి మరో 20 మీటర్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ దృష్ట్యా ఎక్కడ ఎంత భూమిని సేకరించాలనే దానిపై 35 గ్రామాల్లో సర్వే పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు కాలువ వెంబడి మార్కింగ్ ఇవ్వగానే, రెవెన్యూ అధికారులు భూమిని సేకరించే పని చేపడతారు. అనంతరం కాలువ ఆధునికీకరణ పనులు మొదలవుతాయి. గూడెంలో ఇబ్బంది లేదు గతంలో బకింగ్‌హాం కెనాల్లో జలరవాణా మార్గంతో జిల్లాలోని ఏలూరు ప్రధాన కాలువ అనుసంధానమై ఉండేది. అప్పట్లో తాడేపల్లిగూడెంలో ఫ్లీట్ పాయింట్ (ఓడలు నిలిపే స్థలం) ఉండేది. యద్దనపూడి వెంకట సుబ్బారావు, ఆయన తనయుడు సూర్యనారాయణమూర్తి దీనిని నిర్వహించేవారు. దీనికి అనుబంధంగా నిడదవోలులో వార్ఫ్ వద్ద దిగుమతులు కొనసాగేవి. మద్రాసు ప్రాంతం నుంచి వచ్చే సరుకులను నిడదవోలులో దింపి, పడవల ద్వారా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేవారు. ఆ తరువాత పెద్దఫ్లీట్ పాయింట్‌గా ఉన్న తాడేపల్లిగూడెం నుంచి సరుకుల రవాణా సాగేది. ఇందుకోసం ప్రస్తుత రైల్వే గూడ్స్‌షెడ్, ఏలూరు కాలువకు మధ్య నీటిపారుదల శాఖ అప్పట్లో భూమిని సేకరించింది. ఇప్పటికీ ఆ భూమి మొత్తం ఆ శాఖ అధీనంలోనే ఉంది. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసే ఫ్లీట్ పాయింట్‌కు ఈ స్థలం సరిపోతుందని భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడ భూసేకరణ విషయంలో పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఉండదంటున్నారు. ఏలూరులో మాత్రం కాలువ వెంబడి విస్తరణ పనులు, ఫ్లీట్ పాయింట్ ఏర్పాటుకు సరిపడే స్థలం అందుబాటులో లేదు. ఈ దృష్ట్యా అక్కడి కాలువను బైపాస్ (ఉపమార్గం) తరహాలో నిర్మించాల్సి ఉంటుంది. -
జలరవాణా కోసం వంతెనలు
♦ రెండు పడవలు వెళ్లేలా మార్గం ♦ ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల చర్చ సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణానదుల్లో జలరవాణాకు అనువుగా కొత్త వంతెనల నిర్మాణాలకుగాను డిజైన్లు సిద్ధమయ్యాయి. రెండు పడవలు వెళ్లగలిగేలా మార్గాన్ని వదలిపెట్టి కొత్త వంతెనలను నిర్మించేలా నమూనాలను అధికారులు సిద్ధం చేశారు. రెండువైపులా ఒకేసారి రెండు పడవలు వెళ్లేందుకు వీలుగా 70-80 మీటర్ల వెడల్పు, 40-50 మీటర్ల ఎత్తుతో ఈ మార్గం ఉంటుంది. భవిష్యత్తులో రెండు నదులపై నిర్మించే అన్ని వంతెనలకు ఇదే నమూనా సిద్ధం చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయ న సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీ-ప్లస్ వన్ పద్ధతిలో వాటి నమూనాను అధికారులు రూపొందించారు. ఒక్కో ఇంటికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాల్సి ఉన్నం దున స్థలసేకరణ, ఇతరత్రా అనుమతులకు కసరత్తు ప్రారంభించాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మను మంత్రి ఆదేశించారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 1400 కి.మీ. జాతీయ రహదారులకు సంబంధించి వెంటనే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలన్నారు. జిల్లా కేంద్రాలు-మండల కేం ద్రాల అనుసంధాన రహదారుల నిర్మాణ పనులన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రోడ్లు, భవనాల శాఖలోని అన్ని ఖాళీలు, పదోన్నతుల భర్తీపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రోడ్ల విభాగం ఈఎన్సీ రవీందర్రావు, జాతీయ రహదారులు, భవనాల ఈఎన్సీ గణపతి రెడ్డి పాల్గొన్నారు. -
జలరవాణాకు వీలుగా ప్రాజెక్టుల డిజైన్
* కొత్త నమూనాలు సిద్ధం చేయాలని సర్కారు ఆదేశం * గోదావరి నదిలో నిర్మించే అన్ని నిర్మాణాలపై పునఃసమీక్ష * పోలవరం డిజైన్‌పై కేంద్రానికి తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జలరవాణాను విస్తరించాలన్న లక్ష్యంతో భారీ ప్రాజెక్టును కేంద్రం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో దానికి రూపురేఖలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గోదావరి నది తెలంగాణకు ప్రధాన జలరవాణా మార్గం కానున్నందున దీనిపై నిర్మాణంలో ఉన్న, కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టుల డిజైన్ మార్చాలని నిర్ణయించింది. అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో గోదావరి న దిని జలరవాణాతో అనుసంధానించనున్నందున రెండు రాష్ట్రాల వైపు ఉన్న ప్రాజెక్టుల డిజైన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జలరవాణా ఏర్పడితే నిరంతరాయంగా పడవలు వచ్చిపోయేందుకు మార్గం అవసరం. అందుకు తగ్గట్టుగానే నీటి ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణం ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్సీ వరద నీటి కాలువ, దుమ్ముగూడెం ప్రాజెక్టుల డిజైన్‌ను మార్చబోతోంది. ఇక గోదావరిలో భారీ వంతెనల నిర్మాణం జరగనున్నందున వాటి డిజైన్‌ను కూడా పునఃసమీక్షించాలని రోడ్లు భవనాల శాఖను ఆదేశించింది. పోలవరం డిజైన్‌ను మార్చేలా ఆదేశించండి ఏపీ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను కూడా ఇందుకు వీలుగా మార్చేలా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి తాజాగా లేఖ రాశారు. వాస్తవానికి గోదావరి నది లో జలరవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండొద్దని ఇప్పటికే గడ్కారీ కేంద్ర ప్రభు త్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్న ఆయన.. గోదావరి నదిలో ఆ రాష్ట్రం నుంచి వాణిజ్య ఓడలు చెన్నై వరకు వెళ్లేలా ప్రత్యేక మార్గం ఉండాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇప్పిం చారు. దీంతో తెలంగాణ అభ్యర్థనలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. తుమ్మల లేఖ రాయడంతో వెంటనే ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడారు. జలరవాణా అంశం ప్రస్తుతం పరిశ్రమలు-మౌలిక వసతుల శాఖ పరిధిలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని ఆ శాఖ పరిధిలోకి తెచ్చారు. అంతకుముం దు రోడ్లు భవనాలు-పోర్టుల శాఖగా ఉండేది. తెలంగాణలో ఓడరేవులు లేకపోవడంతో ఏడాదిగా దాన్ని పట్టించుకోలేదు. తాజాగా కేంద్రం జలరవాణాను తెరపైకి తేవడంతో దానికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే సమాచారం నేరుగా పరిశ్రమల శాఖకు చేరుతోంది. రవాణాతో తమకు సంబంధం లేదంటూ ఆ శాఖ స్పందించడం లేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను రోడ్లు భవనాల శాఖకే అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
గోదావరిపై మళ్లీ జల రవాణా
నౌకాయానం పునరుద్ధరణకు ప్రయత్నాలు: మంత్రి తుమ్మల సామర్లకోట-బకింగ్‌హామ్ కెనాల్ వరకు నౌకాయానం సాక్షి, హైదరాబాద్: గోదావరిపై మళ్లీ జల రవాణా (నౌకాయానం)ను పునరుద్ధరించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్య్రానికి పూర్వం వెంకటాపురం- చెన్నై వరకు గోదావరిలో జల రవాణా జరిగేదని ఆయన గుర్తుచేశారు. దుమ్ముగూడెం, ధవళేశ్వరం, కృష్ణా కెనాల్, కృష్ణా బ్యారేజీ తదితర మార్గాల మీదుగా జల రవాణా సాగేదన్నారు. అత్యంత తక్కువ ధరలతో, కాలుష్య రహితంగా రవాణా అవసరాలు తీర్చే జల రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇన్ ల్యాండ్ వాటర్ వే బిల్లును తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సామర్లకోట-బకింగ్‌హామ్ కెనాల్ వరకు గోదావరిపై జల రవాణా సౌకర్యం ప్రవేశపెట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారన్నారు. గోదావరి పుష్కరాలు, రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులపై మంత్రి తుమ్మల సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఆర్అండ్బీ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మతో కలసి విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని తుమ్మల పునరుద్ఘాటించారు. స్నానఘాట్లకు మరమ్మతులు చేయడంతోపాటు అవసరమైన సంఖ్యలో కొత్త ఘాట్లను నిర్మిస్తున్నామన్నారు. భక్తుల ప్రయాణాలకు ఉపయుక్తంగా నాణ్యతా ప్రమాణాలతో రహదారుల నిర్మాణాన్ని జూన్‌లోగా పూర్తి చేస్తామన్నారు. కేజ్ వీల్స్‌తో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు రాష్ట్రంలో రహదారులకు రూ. 6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా అందులో రూ. 3 వేల కోట్లను పాత రోడ్ల మరమ్మతులకే వెచ్చించాల్సి వస్తోందని తుమ్మల చెప్పారు. రోడ్లు ధ్వంసం కాకుండా రక్షించుకుంటే అనవసర వ్యయాన్ని నిర్మూలించవచ్చన్నారు. ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో రోడ్లపైకి తెచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
స్మార్ట్ ప్రణాళిక రూపొందించాలి
కడప సెవెన్‌రోడ్స్: స్మార్ట్ విలేజ్, వార్డు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి వెంటనే తమకు పంపాలని కలెక్టర్ కేవీ రమణ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. స్మార్ట్ అమలుకు ప్రభుత్వం 60 రోజుల కాల వ్యవధి ఇచ్చిందన్నారు. ఈలోపు గ్రామ, వార్డులను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాధ్యమైనంత మేరకు నీటి రవాణాను తగ్గించాలన్నారు. పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధుల కొరత లేనందున వెంటనే పనులు చేపట్టాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 12 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 15 వేలు ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ఇస్తామని తెలిపారు. ఇసుక పాలసీపై కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని మండలాల్లో అనుకున్నదాని కన్న తక్కువ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మండలాల్లో ఇసుక కోసం ఆర్డర్లు చాలా తక్కువ వచ్చాయన్నారు. కొత్తగా అనుమతించిన క్వారీలలో ఏడు రీచ్‌లను వారం రోజుల్లోగా ప్రారంభిస్తున్నామన్నారు. చెక్‌పోస్టులు ఏ ప్రాంతాల్లో అవసరమో తమకు వివరాలు పంపాలన్నారు. పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నందున మాపింగ్ పంపాలన్నారు. మార్పు కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాల రేటు తగ్గించాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ రామారావు మాట్లాడుతూ ఇ-పాస్‌పుస్తకాలు మ్యూటేషన్లు, సర్కారు భూమి, కోర్టు కేసులు, జమాబందీ లెక్కలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో 48 మండలాలు కరువు కింద ప్రకటించినందున ఉపాధి హామీ ద్వారా కూలీలకు పనులు కల్పించాల్సి ఉందన్నారు. ఇన్‌ఛార్జి ఏజేసీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ఒక మినీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించినందున అవసరమైన భూమి వివరాలను వెంటనే పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు అనిల్‌కుమార్‌రెడ్డి, రాఘవరావు, ఎల్డీఎం రఘునాథరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
101 నదుల్లో జల రవాణా!
న్యూఢిల్లీ: దేశంలో జల రవాణాను ప్రోత్సహిస్తే అది ప్రజా ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుందని కేంద్రం భావిస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా 101 నదులను జల రవాణా మార్గాలుగా మార్చే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి గడ్కారీ వెల్లడించారు. నదులను జల మార్గాలుగా మార్చాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అని పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. కిలోమీటర్ ప్రయాణానికి రోడ్డు మార్గంలో రూ.1.50 ఖర్చు అవుతుందని, జల రవాణాలో అయితే అర్ధరూపాయే ఖర్చవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రధానమంత్రి జల్ మార్గ్ యోజన’ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, నదీమార్గాలను జల మార్గాలుగా మార్చడంతోపాటు డ్రై, శాటిలైట్ ఓడరేవులను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని గడ్కారీ వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు జాతీయ జలమార్గాల్లో గంగా-భగీరథీ-హుగ్లీ నదీ వ్యవస్థ (అలహాబాద్-హల్దియా-1,620 కి.మీ.), బ్రహ్మపుత్ర నది (ధుబ్రీ-సదియా-891 కి.మీ.), ఉద్యోగ్‌మండల్-చంపకర కెనాల్స్‌లోని పశ్చిమ తీర కెనాల్ (కొట్టాపురం-కొల్లామ్-205 కి.మీ.), కాకినాడ-పుదుచ్చేరి కెనాల్స్ (గోదావరి-కృష్ణా నదులు 1,078 కి.మీ.), బ్రహ్మపుత్ర-మహానదిలోని తూర్పు తీర కెనాల్ (588 కి.మీ.) ఉన్నాయి. -
జలరవాణా మార్గమంతా ఆధునికీకరించాలి
రెండు సంస్థలకు సర్వే బాధ్యతలు వంతెనలు, లాకులు, అప్రోచ్ రోడ్లు తిరిగి నిర్మించాలి 10 మిలియన్ టన్నుల సరుకు రవాణా ఐడబ్ల్యూఏఐ ఇంజినీర్ల అభిప్రాయం విజయవాడ : రాష్ట్రంలో జల రవాణా మార్గమంతా ఆధునికీకరించాలని భారత అంతర్గత జలరవాణా సాధికార సంస్థ(ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఐడబ్ల్యూఏఐ) చీఫ్ ఇంజినీర్ ఎస్.దండపత్, సీనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ టివి ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వారిద్దరూ ఆదివారం ఉదయం నీటిపారుదల శాఖ కార్యాలయంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో జాతీయ జలమార్గం(ఎన్డబ్ల్యూఏ-4) గురించి చర్చించారు. అనంతరం దండపత్, ప్రసాద్‌లు ‘సాక్షి’తో మాట్లాడుతూ జలరవాణా గురించి వివరించారు. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు... బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనే భద్రాచలం నుంచి పుదుచ్చేరి వరకు 1,095 కిలో మీటర్ల మేర జలరవాణా మార్గం ఉండేది. ఆ తర్వాత కాలంలో దీన్ని ఉపయోగించకపోవడం, కాల్వలు ఆక్రమణలకు గురికావడం వల్ల జలరవాణా మార్గం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం జలరవాణా వల్ల ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయి. అందువల్లే కేంద్ర ప్రభుత్వం ఎన్డబ్ల్యూఏ-4పై దృష్టి సారించింది. ఇప్పటికే మూడు జలరవాణా మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో మార్గం అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. గోదావరి నది ప్రాంతంలో 171 కి.మీ, కాకినాడ కాల్వలో 50 కి.మీ. ఏలూరు కాల్వలో 139 కి.మీ., కృష్ణానది ప్రాంతంలో 157 కి.మీ., గుంటూరు జిల్లా కొమ్మనూరు కాల్వలో 113 కి.మీ., ఉత్తర బకింగ్‌హాం కాల్వలో 316 కి.మీ., దక్షిణ బకింగ్‌హాం కాల్వలో 110 కి.మీ. పుదుచ్చేరిలో 22 కి.మీ పొడవునా జలరవాణా సాగుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి నెల్లూరు వరకు.. ఉభయగోదావరి జిల్లాల్లో జలరవాణా పనులను పరిశీలించిన ఇంజినీర్ల బృందం శనివారం ప్రకాశం బ్యారేజీ నుంచి నెల్లూరు వరకు గల జలరవాణా మార్గాన్ని కూడా పరిశీలించింది. ఈ మార్గంలో కాల్వలు, వంతెలు, లాకులను పరిశీలించిన ఇంజినీర్లు ప్రస్తుత అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవని నిర్ధారించారు. బ్రిటిష్ కాలంలో చిన్నబోట్లలో సరుకు రవాణా చేసినందున వారి అవసరాలకు తగినట్టుగా కాల్వలు నిర్మించారు. కొన్నేళ్లుగా ఆక్రమణల కారణంగా కాల్వలు కుంచించుకుపోయాయి. ప్రస్తుతం 500 టన్నుల వరకు సరుకు రవాణా చేసే పెద్ద బోట్లు ఈ మార్గంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాల్వలు విస్తరించాల్సిన అవసరం ఉంది. జలరవాణాకు కాల్వల వెడల్పు 32 మీటర్లు ఉండాలి. అయితే ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద కేవలం 6 మీటర్లు మాత్రమే వెడల్పు ఉంది. నెల్లూరు, కృష్ణపట్నం వద్ద ఈ వెడల్పు ఇంకా తక్కువగా ఉంది. కాల్వలో 2 నుంచి 2.5 మీటర్ల లోతు నీరు ఉండాలి. కొన్నిచోట్ల 1.2 మీటర్లు మాత్రమే ఉంది. కాల్వల్లో లాకులు 12 మీటర్లు ఉండాల్సి ఉండగా, 6 మీటర్లే ఉన్నాయి. వంతెనలు వాటర్ లెవెల్ నుంచి 5 మీటర్లు ఎత్తులో ఉండాలి. కానీ, 3 మీటర్లు ఎత్తులోనే ఉన్నాయి. కాల్వల వద్దకు వెళ్లేందుకు కొన్నిచోట్ల అప్రోచ్ రోడ్లు కూడా లేవు. వీటిని ఏర్పాటుచేయాలి. అవసరమైన చోట జట్టీలు నిర్మించాలి. రెండు సంస్థలు సర్వే జలరవాణా చేయడానికి కాల్వల్లో చేపట్టాల్సిన మరమ్మతుల గురించి సర్వే చేసే బాధ్యతను రెండు సంస్థలకు వాటర్‌వేస్ అధికారులు అప్పగించారు. విజయవాడ నుంచి పెదగంజాం వరకు ఒడిశాలోని గోబెల్ ఇన్ఫోటెక్‌కు, పెదగంజాం నుంచి కృష్ణపట్నం వరకు కోల్‌కతాలోని పెసిషన్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది మేలోపు ఈ సంస్థలు సర్వే చేసి నివేదికను అందజేస్తాయి. ఆ తర్వాత టెండర్లు పిలిచి కాల్వల ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తారు. జలరవాణా మార్గానికి సుమా రు రూ.1,515 కోట్లు అవసరమవుతుందని అంచనా. విడుదలైన నిధులను బట్టి విడతల వారిగా పనులు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్గాన్ని పునరుద్ధరిస్తే ఏడా దికి 10 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయవచ్చని అంచనావేస్తున్నారు. జలరవాణా పనులు పూర్తికావడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. జల రవాణాను అభివృద్ధి చేయడం వల్ల సింగరేణి కాలరీస్ నుంచి కొత్తగూడేనికి బొగ్గును, కాకినాడ పోర్టు నుంచి ఫెర్టిలైజర్లు, భద్రాచలం అడవుల్లో లభించే కలపను పేపర్ మిల్లులకు, కోస్తా జిల్లాలో పండించే ధాన్యం, పప్పుధాన్యాలను రవాణా చేసే అవకాశం ఉంటుంది. -
జలమార్గానికి పచ్చజెండా
సాక్షి, ముంబై: నవీముంబై, ఠాణే, గేట్ వే ఆఫ్ ఇండియా జల రవాణా మార్గానికి కేంద్ర జల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆమోద ముద్రవేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు త్వరలో లాంచీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై-లోణావాలాలోని పవన్ జలాశయం వరకు సీ ప్లేన్ సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు నవీముంబై, ఠాణే-గేట్ వే ఆఫ్ ఇండియా 50 కి.మీ. దూరం గల జల రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి పోర్టు ట్రస్టు కీలక పాత్ర పోషించనుంది. జల మార్గం వినియోగంలోకి వస్తే నవీముంబై-ముంబై, ఠాణే-ముంబై రహదారులపై ఏర్పడుతున్న ట్రాఫిక్ జాం సమస్య కొంతమేర పరిష్కారం కానుంది. నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులకు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారికి వ్యయప్రయాసల నుంచి ఉపశమనం లభించనుంది. కొలాబా నుంచి ఏడు కార్పొరేషన్ల హద్దుల్లో ఉన్న సముద్ర ఖాడీ మీదుగా ఈ మార్గం వెళుతుంది. వసయి, భివండీ, ఉల్లాస్‌నగర్, కల్యాణ్, డోంబివలి, భయందర్, ఠాణే, నవీముంబై ప్రాంత ప్రజలకు ఈ లాంచీ సేవలు ఉపయోగపడనున్నాయి. -
అటకెక్కనున్న కీలక ప్రాజెక్టులు
సాక్షి, ముంబై: జలరవాణా, ఠాణే మెట్రో, ట్రాన్స్ హార్బర్ సీలింకు వంటి కీలక ప్రాజెక్టులకు ఎన్నికల తర్వాతే మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుండడంతో దాదాపుగా ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంద ని, ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని, దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం వద్ద కీలక ప్రాజెక్టుల విషయమై నిర్ణయం తీసుకునేంత సమయం లేదని, కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వమే ఈ ప్రాజెక్టులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెమ్మార్డీయే అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య తలెత్తిన విభేదాలు కూడా ఈ ప్రాజెక్టులు ఆలస్యమవడానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. పెండింగులో ఉన్న ఈ ప్రాజెక్టుల భవిత ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుదని చెబుతున్నారు. జలరవాణ, ఠాణేమెట్రో, ట్రాన్స్ హార్బర్ సీ లింకు వంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టుల ప్రతిపాదనలు కొంతకాలంగా పెండింగులోనే ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫైళ్లు ఇటీవలే ముందుకు కది లాయి. దీంతో త్వరలో వీటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుండవచ్చని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని శాసనసభ ఎన్నికలు సమీపించడంతో అన్ని రాజకీయ పార్టీ లు అభ్యర్థుల ఎంపిక, జాబితా రూపొందించడం, సీట్ల పంపకం తదితర పనుల్లోనే బిజీగా ఉన్నాయి. అధికారంలో కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు కూడా మార్పులు, చేర్పులపైనే దృష్టి సారించారు. దీంతో వేలాది కోట్ల రూపాయల విలువచేసే ఈ కీలక ప్రాజెక్టుల విషయంలో ఇంత తక్కువ సమయంలో ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకొని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని పలువురు చెబుతున్నారు. ఫలితంగా వీటికి ఎన్నికల ముందే ముహూర్తం లభిం చే అవకాశాలు సన్నగిల్లినట్లేనని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు తెలిపాయి. వీటికి గ్రీన్‌సిగ్నల్ లభించాలంటే కీలకమైన వ్యక్తులతో కూడిన ఓ కమిటీ ప్రత్యేకంగా ఏర్పా టు చేయాలని, ఆ తరువాత చర్చలు, ప్రణాళికలు రూపొందించాలని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు ఈ పనులన్ని పూర్తిచేయాలని చెబుతున్నారు. -
హైలెస్సా..లెస్సా..హైలెస్సా..
సాక్షి, ముంబై: సబర్బన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించే నిమిత్తం నగర తూర్పు తీరప్రాంతాల్లో త్వరలోనే జల రవాణా సేవలను అందుబాటులోకి తేనున్నారు. అయితే ఐలాండ్ ప్యాసింజర్ వాటర్ ట్రాన్స్పోర్ట్ (ఐపీడబ్ల్యూటీ) ప్రాజెక్టుకు మంచి స్పందన వస్తుందో లేదో అని రాష్ట్రప్రభుత్వం సందేహం వ్యక్తం చేస్తోంది. ఈ జల రవాణాను నెరుల్ నుంచి మండ్వా వరకు కొనసాగించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. స్టేట్ చీఫ్ సెక్రటరీ (సీఎస్), ఇతర ముఖ్యమైన విభాగాలకు చెందిన అధికారులు ఇటీవలే ఈ విషయమై ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కాగా, ఈ ప్రాజెక్టు నిమిత్తం తయారు చేయాలనుకున్న జెట్టీల పరిమాణంపై సమావేశంలో చర్చించారు. మొదట చిన్న సైజు జెట్టీలను నడపాలని, జలరవాణాకు మంచి స్పందన లభించిన తర్వాత జెట్టీల పరిమాణం మరింత పెంచవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సేవలతో హార్బర్ మార్గంలో కొంత మేర రద్దీ తగ్గుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఎంఆర్డీఏ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన సమావేశంలో తూర్పు తీరప్రాంతంలో ఏర్పాటు చేయనున్న జల రవాణా విజయవంతం అవుతుందో లేదో అన్న సందేహాన్ని అధికారులు వెలిబుచ్చారన్నారు. దీంతో జెట్టీల పరిమాణం తగ్గించాలని ఎంఎస్‌ఆర్డీసీని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ జెట్టీల పరిమాణం ప్రతిపాదనలో 40 మీటర్లు ఉండగా 10 మీటర్లు తగ్గించమని అధికారులు సూచించారన్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇదిలా వుండగా 40 మీటర్ల జెట్టీలు నిర్మించడానికి సుమారు రూ.1,300 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారుల అంచనా. అంత ఖర్చు పెట్టిన తర్వాత జలరవాణాకు తగిన స్పందన రాకపోతే కష్టమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రయోగాత్మకంగా 30 మీటర్ల జెట్టీలను నడపాలని యోచిస్తోంది. దీని వల్ల ఖర్చు కూడా సుమారు రూ.350 - 400 కోట్లు తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, నెరుల్ జెట్టీ నిర్మాణాన్ని రూ.308.28 కోట్లతో ఫెరీ వార్ఫ్‌కు కాంట్రాక్టుకు ఇవ్వగా, జె.కుమార్ ఫౌండేషన్ అసోసియేట్స్, డీబీఎం సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు... మండ్వా జెట్టీల నిర్మాణాన్ని రూ.63.71 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ జెట్టీల నిర్మాణం పూర్తి అయిన వెంటనే ఎంఎస్ఆర్డీసీ ప్రైవేట్ వ్యక్తులకు ఈ సేవలను అప్పగించనుంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ జెట్టీల నిర్మాణం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే వీటి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. జల రవాణాతో లాభాలు... ఈ జల రవాణా పర్యావరణానికి ఎలాంటి చేటు కలిగించదు. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ప్రయాణికుల సమయం కూడా ఆదా అవుతుంది. జల రవాణా సేవలు వేగంగా ఉండడమే కాకుండా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఉంటాయి. నగర వాసుల వాహన నిర్వహణ ఖర్చు కూడా కొంత మేర ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా రోడ్లపై కూడా కొంత మేర రద్దీ తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణ, శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. -
‘రవాణా’లో ముంబై ముందడుగు
సాక్షి, ముంబై: ముంబై అనగానే... లోకల్ రైళ్లు మన కళ్ల ముందు కదలాడతాయి. అవును... క్షణం తీరిక లేకుండా ఉండే నగర అభివృద్ధిలో లోకల్ రైళ్లు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బెస్టు బస్సులు, ట్యాక్సీలు, ఆటోలతోపాటు లోకల్ రైళ్లు ముంబై నగరం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటికి తోడుగా ఇటీవలే మోనో రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఏ నగరాభివృద్ధిలోనైనా రవాణా వ్యవస్థ కీలకం. మరి అది దేశ ఆర్ధిక రాజధాని అయితే... అందుకే ఇప్పుడు ముంబై రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. త్వరలోనే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకుంటూ జల రవాణా ప్రారంభించాలనే డిమాండ్ కూడా పెద్దఎత్తున ఉంది. భవిష్యత్తులో జల రవాణా వ్యవస్థ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ముంబై నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడం ఖాయం. లైఫ్లైన్లు... ముంబైలో ఇప్పటివరకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు బెస్టు బస్సులతో పాటు ప్రధానంగా సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే ఈ సేవలు ‘ముంబై లైఫ్‌లైన్’లుగా గుర్తింపు పొందాయి. ఉరుకులు, పరుగులతో నగర జీవితం నిత్యం బిజీ. తీరిక లేని ప్రజల జీవన విధానానికి తగ్గట్టుగా నగరంలో రవాణా వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి ఐదు నిమిషాల తేడాతో నడిచే బెస్టు బస్సులు, లోకల్ రైళ్లలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రతి రోజూ సుమారు 65 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. దీంతో ఇక్కడ సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్ ఇలా మూడు మార్గాల్లో లోకల్ రైళ్లను నడుపుతున్నారు. కాగా ముంబై నగరానికి అంతర్జాతీయ హోదాను దక్కేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. భారీ వ్యయంతో కూడుకున్న మోనో, మెట్రోలాంటి ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోనో రైలు సేవలు... దేశంలోనే మొట్టమొదటి రైలు ముంబై- ఠాణేల మధ్య ప్రారంభమైన విషయం విదితమే. ఇక్కడ లోకల్ రైళ్లు కూడా చాలా సంవత్సరాల కిందటే ప్రారంభమయ్యాయి. తాజాగా దేశంలోని మొట్టమొదటి మోనో రైలు సేవలు కూడా ఇక్కడే ప్రారంభం కావడం విశేషం. ఇవి మొదటి విడతలో చెంబూర్-వడాలా వరకు ప్రారంభమయ్యాయి. పూర్తిగా ఏసీ కోచ్‌లతో భూమికి సుమారు 20 అడుగుల ఎత్తుపై నుంచి ఎలాంటి శబ్దంలేకుండా వెళ్లే ఈ మోనో సేవలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించినంతగాలేదని తెలుస్తోంది. రెండో విడతలో వడాలా-సాత్ రాస్తా వరకు మోనో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మెట్రో రైలు సేవలు... రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దీనిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ 11.4 కి.మీ.పొడవైన మెట్రో మార్గం పనులు పూర్తి అయ్యాయి. ఈ ‘ముంబై మెట్రో-1 కు అన్ని అనుమతులు లభించాయి. ఈ రైళ్లు ప్రారంభంలో గంటకు 50 కి.మీ. వేగంతో నగరంలో పరుగులు పెడతాయని మెట్రో-1 అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం పిల్లర్ల మీదుగా సాగుతుంది. దీంతో రైళ్లకు ఎలాంటి అడ్డంకులు, ట్రాక్‌కు ఇరువైపుల మురికివాడలు, లెవెల్ క్రాసింగ్‌లు ఉండవు. అలాగే మెట్రో రైల్వే ట్రాక్‌లు ప్రత్యేక లోహంతో తయారుచేసినవి కావడంతో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమే లేదు. భవిష్యత్తులో గంటకు 80 కి .మీ. వేగంతో రైళ్లను నడపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆర్డీఎస్ఓ స్పష్టం చేసింది. కాగా కొన్ని ప్రమాదకర మలుపులవద్ద వేగాన్ని కొంత నియంత్రించాల్సి ఉంటుంది. మిగతా చోట్ల నిర్దేశించిన వేగంతోనే రైళ్లను నడిపేందుకు అనుమతివ్వనున్నట్లు ఆర్డీఎస్ఓ అధికారులు పేర్కొన్నారు. జల రవాణా... నగరం చుట్టూ ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకొంటూ జల రవాణా ప్రారంభించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల అతి తక్కువ సమయంలో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడంతోపాటు ట్రాఫిక్ జాం, కాలుష్య సమస్యలు కూడా ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే దీనిపై దృష్టి సారిస్తున్నారు అధికారులు. ముంబై-నవీముంబైల మధ్య రోడ్లపై, లోకల్ రైళ్లపై భారం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని తగ్గించేందుకు రహదారులను పెంచడం, వెడల్పు చేయడం, లోకల్ రైళ్ల సంఖ్య పెంచేందుకు వీలు లేకుండాపోవడంతో ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన్ని ఎంచుకోక తప్పడం లేదు. ఇందులో భాగంగా నవీముంబైలోని నేరుల్ నుంచి ముంబైలోని భావుచా ధక్కా వరకు లేదా మాండ్వా నుంచి భావుచా ధక్కా వరకు జల మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ముంబై నుంచి నవీముంబై వరకు రోడ్డు మార్గం మీదుగా చేరుకోవాలంటే కనీసం గంటన్నరకు పైగా సమయం పడుతుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే కేవలం 20 నిమిషాల్లో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు. లోకల్ రైళ్లే మేలు... మరోవైపు మోనో, మెట్రో రైల్వే సేవలకంటే లోకల్ రైళ్లు సౌకర్యవంతంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లోకల్ రైళ్లతో పోలిస్తే మోనో, మెట్రో రైళ్లలో ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం చాలా తక్కువ. లోకల్ రైళ్లలో రద్దీ సమయంలో గంటకు 3.60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యం ఉంది. అయితే మెట్రో రైలులో గంటకు 60 వేల మంది, మోనో రైలులో గంటకు కేవలం 6,295 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఎలివేటెడ్ మార్గం చర్చిగేట్ నుంచి విరార్, ముంబై నుంచి ఠాణేల వరకు ప్రస్తుతం నేలపై ఉన్న రైల్వే ట్రాక్‌ల వెంబడి పైనుంచి (ఎలివేటెడ్) వెళ్లే మార్గం నిర్మించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్ల మాదిరిగా గంటకు దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా చాలావరకు తగ్గేందుకు ఆస్కారం ఉంది. దీనికోసం ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎలివేటెడ్ రైల్వే మార్గాన్ని పక్కనబెట్టి మోనో, మెట్రో లాంటి ఖరీదైన ప్రాజెక్టులు ప్రారంభించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
జల రవాణాకు మహర్దశ
సాక్షి, ముంబై: జల రవాణాకు మంచి రోజులు రాబోతున్నాయి. కొంకణ్ తీరంలోని ఓడ రేవులను పునరుద్ధరించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు రూ. 22,775 కోట్లతో ప్రణాళికను రూపొందించాయి. కొంకణ్‌లోని 720 కిలోమీటర్ల తీరంలో ఉన్న 51 ఓడ రేవుల్లోని జలమార్గాల్లో పూడిక తీయాలని కూడా నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ముంబై, నవీముంబై, జేఎన్పీటీ వంటి ఓడ రేవులతో పాటు మిగిలిన 49 ఓడరేవులు చిన్నతరహా, మీడియం ఇలా అయిదు రకాల వర్గాలుగా ఏర్పాటుచేసి వీటిని అభివృద్ధి చేయనున్నాయి.ఈ చర్యల వల్ల జల రవాణా మరింత పుంజుకొని రాబోయే రోజుల్లో కొంకణ్ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఈ ప్రణాళికకు ఆమోదం లభిస్తే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జల రవాణాతో లాభాలు అనేకం.... ముంబైతోపాటు ఇతర ప్రాంతాలకు జలరవాణా ప్రారంభిస్తే అనేక లాభాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జలరవాణా వల్ల నగరంలోని ట్రాఫిక్ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశముందని అంటున్నారు. అలాగే ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశముందని తెలిపారు. మరోవైపు ముంబై-గోవా జలమార్గం సేవలు ప్రారంభించాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. రోడ్డు మార్గం ద్వారా ముంబై-గోవా మధ్య సుమారు 12 నుంచి 15 గంటల సమయం పడుతుంది. అదే సముద్ర మార్గం ద్వారా వెళితే కేవలం ఐదు గంటల్లో చేరుకునే అవకాశముంది. విలువైన సమయంతోపాటు చార్జీలు కూడా కలిసి వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.