సాక్షి, ముంబై: జల రవాణాకు మంచి రోజులు రాబోతున్నాయి. కొంకణ్ తీరంలోని ఓడ రేవులను పునరుద్ధరించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు రూ. 22,775 కోట్లతో ప్రణాళికను రూపొందించాయి. కొంకణ్‌లోని 720 కిలోమీటర్ల తీరంలో ఉన్న 51 ఓడ రేవుల్లోని జలమార్గాల్లో పూడిక తీయాలని కూడా నిర్ణయించాయి.
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ముంబై, నవీముంబై, జేఎన్‌పీటీ వంటి ఓడ రేవులతో పాటు మిగిలిన 49 ఓడరేవులు చిన్నతరహా, మీడియం ఇలా అయిదు రకాల వర్గాలుగా ఏర్పాటుచేసి వీటిని అభివృద్ధి చేయనున్నాయి.ఈ చర్యల వల్ల జల రవాణా మరింత పుంజుకొని రాబోయే రోజుల్లో కొంకణ్ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఈ ప్రణాళికకు ఆమోదం లభిస్తే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
జల రవాణాతో లాభాలు అనేకం....
ముంబైతోపాటు ఇతర ప్రాంతాలకు జలరవాణా ప్రారంభిస్తే అనేక లాభాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జలరవాణా వల్ల నగరంలోని ట్రాఫిక్ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశముందని అంటున్నారు. అలాగే ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశముందని తెలిపారు.
మరోవైపు ముంబై-గోవా జలమార్గం సేవలు ప్రారంభించాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. రోడ్డు మార్గం ద్వారా ముంబై-గోవా మధ్య సుమారు 12 నుంచి 15 గంటల సమయం పడుతుంది. అదే సముద్ర మార్గం ద్వారా వెళితే కేవలం ఐదు గంటల్లో చేరుకునే అవకాశముంది. విలువైన సమయంతోపాటు చార్జీలు కూడా కలిసి వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జల రవాణాకు మహర్దశ
Published Sat, Feb 1 2014 5:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement