జలరవాణా కోసం వంతెనలు
♦ రెండు పడవలు వెళ్లేలా మార్గం
♦ ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి తుమ్మల చర్చ
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణానదుల్లో జలరవాణాకు అనువుగా కొత్త వంతెనల నిర్మాణాలకుగాను డిజైన్లు సిద్ధమయ్యాయి. రెండు పడవలు వెళ్లగలిగేలా మార్గాన్ని వదలిపెట్టి కొత్త వంతెనలను నిర్మించేలా నమూనాలను అధికారులు సిద్ధం చేశారు. రెండువైపులా ఒకేసారి రెండు పడవలు వెళ్లేందుకు వీలుగా 70-80 మీటర్ల వెడల్పు, 40-50 మీటర్ల ఎత్తుతో ఈ మార్గం ఉంటుంది. భవిష్యత్తులో రెండు నదులపై నిర్మించే అన్ని వంతెనలకు ఇదే నమూనా సిద్ధం చేయాల్సిందిగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయ న సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఇక నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీ-ప్లస్ వన్ పద్ధతిలో వాటి నమూనాను అధికారులు రూపొందించారు.
ఒక్కో ఇంటికి రూ.కోటి ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ఇళ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాల్సి ఉన్నం దున స్థలసేకరణ, ఇతరత్రా అనుమతులకు కసరత్తు ప్రారంభించాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మను మంత్రి ఆదేశించారు. ఇటీవల కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన 1400 కి.మీ. జాతీయ రహదారులకు సంబంధించి వెంటనే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలన్నారు. జిల్లా కేంద్రాలు-మండల కేం ద్రాల అనుసంధాన రహదారుల నిర్మాణ పనులన్నీ ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రోడ్లు, భవనాల శాఖలోని అన్ని ఖాళీలు, పదోన్నతుల భర్తీపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రోడ్ల విభాగం ఈఎన్‌సీ రవీందర్‌రావు, జాతీయ రహదారులు, భవనాల ఈఎన్‌సీ గణపతి రెడ్డి పాల్గొన్నారు.