మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్‌లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.
మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్‌లు.
అరుణిమ, లక్ష్మి, స్నేహ
ఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్‌లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్‌లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్‌లు నియమితులయ్యారు.
75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లు
కొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.
పురుష ప్రపంచంలో మహిళా సారథులు
కేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్‌బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్‌లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్‌లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ.
‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.
విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు.
Comments
Please login to add a commentAdd a comment