సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ రెగెట్టా చాంపియన్‌షిప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో హైదరాబాద్ యాటింగ్ క్లబ్ (వైసీహెచ్) సెయిలర్లు లక్ష్మీ నూకరత్నం, మజ్జి లలిత, గౌతమ్ కంకట్ల ఆకట్టుకున్నారు.
48 మంది సెయిలర్లు తలపడిన సబ్ జూనియర్ విభాగం తొలిరేసులో హైదరాబాద్ అమ్మాయిలు లక్ష్మి, లలిత మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. 12 పాయింట్లు సాధించిన లక్ష్మి అగ్రస్థానాన్ని, 20 పాయింట్లతో లలిత రెండోస్థానాన్ని దక్కించుకున్నారు. తుంగర మహబూబీ 25 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది.
ఓపెన్ కేటగిరీలో కర్ణాటకకు చెందిన చున్ను కుమార్ (3 పాయింట్లు) అద్భుత ప్రదర్శనతో తొలిస్థానంలో నిలిచాడు. లక్ష్మీ (12 పాయింట్లు), ఉమా చౌహాన్ (13, మధ్యప్రదేశ్) తర్వాతి స్థానాలను సాధించారు. జూనియర్స్ విభాగంలో గౌతమ్ 15 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్ మిలన్ యాదవ్ (6), తమిళనాడు సెయిలర్లు చిత్రేశ్ (13), అనికేత్ రాజారామ్ (14) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 130 మంది సెయిలర్లు పాల్గొన్నారు. తెలంగాణలోని 15 జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు బరిలో దిగారు.
Comments
Please login to add a commentAdd a comment