Sailing regatta Championship
-
అద్భుత దృశ్యం.. సముద్రంపై రెక్కలు విచ్చుకున్న ‘పడవలు’
రోమ్: సముద్రంపై రెక్కలు విప్పుకుని వాలినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది కదా. అయితే, ఇవి పక్షలు కాదు.. తెరచాప పడవలు. ఆదివారం ఇటలీలోని ట్రీస్టెలో ఏడ్రియాటిక్ సముద్ర తీరం వెంట జరుగుతున్న 54వ బార్కొలానా పడవపందెంలో భాగంగా ఈ అద్భుతం దృశ్యం ఆవిషృతమైంది. 2022, అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బార్కొలానా వీక్ పేరుతో ఈ పోటీలు నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పడవ పోటీగా ఇది 2018లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది ఈ పడవల పందెం. ప్రస్తుతం వారం రోజుల పాటు అట్టహాసంగా సాగిన ఈ తెరచాప పడవల పరుగు పందెం 54వ ఎడిషన్. ఇందులో 2,689 పడవలు పాలుపంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా ట్రీస్టే గల్ఫ్ ప్రాంతంలో అక్టోబర్ రెండో ఆదివారం నిర్వహిస్తారు. పడవల ఆకృతిని బట్టి విభజించి పోటీలు చేపడతారు. తొలిసారి 1969లో ఈ తెరచాప పడల పోటీలు నిర్వహించగా అందులో 51 బోట్లు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఆదరణ పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెయిలర్స్ ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించారు. ఇదీ చదవండి: అత్యంత ఎత్తైన వృక్షం... ఫలించిన మూడేళ్ల నిరీక్షణ -
జైకిరణ్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: మాన్సూన్ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో షేక్‌పేట్ మోడల్ స్కూల్ విద్యార్థి బి. జైకిరణ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హుస్సేన్‌సాగర్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో జైకిరణ్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఆదివారం ఓపెన్ కేటగిరీలో జరిగిన చివరి రెండు రేసుల్లో విజేతగా నిలిచిన చున్నుకుమార్ (త్రిష్ణ సెయిలింగ్ క్లబ్) 48 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. ఎన్ఎస్ఎస్ భోపాల్‌కు చెందిన ఉమా చౌహాన్ 53 పాయింట్లతో రజతాన్ని గెలుచుకుంది. కాంస్యాన్ని సాధించిన హైదరాబాద్ యాట్ క్లబ్ సెయిలర్ జైకిరణ్ 71 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. చివరి రోజు పోటీల్లో కిరణ్ అంచనాలకు తగ్గట్లు రాణించాడు. బాలికల విభాగంలో ఉమా చౌహాన్ (53 పాయింట్లు) పసిడి పతకాన్ని గెలుచుకుంది. రితిక (104 పాయింట్లు), సంచిత పంత్ (120 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. మొత్తం 111 మంది సెయిలర్లు తలపడిన ఈ టోర్నీలో ఆప్టిమిస్ట్ గ్రీన్ ఫ్లీట్ బాలికల కేటగిరీలో సీహెచ్ జ్ఞాపిక ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల కార్యదర్శి బి. వెంకటేశం ముఖ్య అతిథిగా విచ్చేశారు. -
విజేతలు లలిత, గౌతమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ యాటింగ్ క్లబ్ సెయిలర్లు మజ్జి లలిత, గౌతమ్ కంకట్ల సత్తా చాటారు. హుస్సేన్‌సాగర్‌లో జరిగిన ఈ టోర్నీలో లలిత ‘తెలంగాణ స్టేట్ సెయిలింగ్ సబ్ జూనియర్ చాంపియన్’ ట్రోఫీని అందుకుంది. ఓపెన్ కేటగిరీలోనూ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని గెలుచుకుంది. మరోవైపు జూనియర్స్, ఓపెన్ జూనియర్స్ కేటగిరీల్లో గౌతమ్ చాంపియన్‌గా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. బాలికల సబ్ జూనియర్స్ కేటగిరీలో తొలి మూడు స్థానాలను తెలంగాణ అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. 49 పాయింట్లతో లలిత స్వర్ణాన్ని గెలుచుకోగా... మహబూబీ (53), లక్ష్మి నూకరత్నం (56) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. ఓపెన్ విభాగంలో కర్ణాటకకు చెందిన చున్నుకుమార్ 19 పాయింట్లతో విజేతగా నిలిచాడు. లలిత (49) రన్నరప్‌గా నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమా చౌహాన్ 52 పాయింట్లతో మూడోస్థానాన్ని దక్కించుకుంది. బాలుర జూనియర్స్ విభాగంలో 29 పాయింట్లతో గౌతమ్, సంజయ్ రెడ్డి (47), టి. అజయ్ (52) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. ఓపెన్ జూనియర్స్ విభాగంలో గౌతమ్ (29), రామ్ మిలన్ యాదవ్ (31, మధ్యప్రదేశ్) స్వర్ణ, రజతాలను గెలుచుకోగా... సతీశ్ యాదవ్ (32, మధ్యప్రదేశ్) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. -
లక్ష్మి శుభారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ సెయిలింగ్ రెగెట్టా చాంపియన్‌షిప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్‌లో జరుగుతోన్న ఈ పోటీల్లో హైదరాబాద్ యాటింగ్ క్లబ్ (వైసీహెచ్) సెయిలర్లు లక్ష్మీ నూకరత్నం, మజ్జి లలిత, గౌతమ్ కంకట్ల ఆకట్టుకున్నారు. 48 మంది సెయిలర్లు తలపడిన సబ్ జూనియర్ విభాగం తొలిరేసులో హైదరాబాద్ అమ్మాయిలు లక్ష్మి, లలిత మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. 12 పాయింట్లు సాధించిన లక్ష్మి అగ్రస్థానాన్ని, 20 పాయింట్లతో లలిత రెండోస్థానాన్ని దక్కించుకున్నారు. తుంగర మహబూబీ 25 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. ఓపెన్ కేటగిరీలో కర్ణాటకకు చెందిన చున్ను కుమార్ (3 పాయింట్లు) అద్భుత ప్రదర్శనతో తొలిస్థానంలో నిలిచాడు. లక్ష్మీ (12 పాయింట్లు), ఉమా చౌహాన్ (13, మధ్యప్రదేశ్) తర్వాతి స్థానాలను సాధించారు. జూనియర్స్ విభాగంలో గౌతమ్ 15 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్ మిలన్ యాదవ్ (6), తమిళనాడు సెయిలర్లు చిత్రేశ్ (13), అనికేత్ రాజారామ్ (14) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 130 మంది సెయిలర్లు పాల్గొన్నారు. తెలంగాణలోని 15 జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు బరిలో దిగారు.