నిడదవోలు టు ఏలూరు
నిడదవోలు టు ఏలూరు
Published Fri, Oct 28 2016 2:59 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
తాడేపల్లిగూడెం : జిల్లాలో ప్రధాన జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దేశీయ జల మార్గ విధానం (ఇన్‌ల్యాండ్ వాటర్ వే పాలసీ)లో భాగంగా నిడదవోలు–ఏలూరు మధ్య 74 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి ప్రధాన కాలువను ఆధునికీకరించాలని ఇప్పటికే నిర్ణయిం చారు. కాలువ వెడల్పు పెంచేందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందనే దానిపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. సర్వే, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రయాణించే రవాణా ఓడలను నిలిపేందుకు, సరుకుల ఎగుమతి, దిగుమతులకు వీలుగా తాడేపల్లిగూడెం, ఏలూరులో ఫ్లీట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. కృష్ణా జిల్లా పరిధిలో కాలువ విస్తరణ అవసరమైన భూముల కోసం ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. మన జిల్లాలోనూ సర్వే, భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేసి వచ్చే వేసవి నాటికి కాలువ విస్తరణ చేపట్టాలనే ప్రణాళికతో యంత్రాంగం ముందుకు వెళుతోంది.
కాలువ గర్భం 25 మీటర్లు.. వెడల్పు 40 మీటర్లు
ఏలూరు కాలువ గర్భం 25 మీటర్లు, ఉపరి తలంపై కాలువ వెడల్పు 40 మీటర్లు ఉం డేలా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువకు రెండు వైపులా కలిపి మరో 20 మీటర్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ దృష్ట్యా ఎక్కడ ఎంత భూమిని సేకరించాలనే దానిపై 35 గ్రామాల్లో సర్వే పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు కాలువ వెంబడి మార్కింగ్ ఇవ్వగానే, రెవెన్యూ అధికారులు భూమిని సేకరించే పని చేపడతారు. అనంతరం కాలువ ఆధునికీకరణ పనులు మొదలవుతాయి.
గూడెంలో ఇబ్బంది లేదు
గతంలో బకింగ్‌హాం కెనాల్‌లో జలరవాణా మార్గంతో జిల్లాలోని ఏలూరు ప్రధాన కాలువ అనుసంధానమై ఉండేది. అప్పట్లో తాడేపల్లిగూడెంలో ఫ్లీట్ పాయింట్ (ఓడలు నిలిపే స్థలం) ఉండేది. యద్దనపూడి వెంకట సుబ్బారావు, ఆయన తనయుడు సూర్యనారాయణమూర్తి దీనిని నిర్వహించేవారు. దీనికి అనుబంధంగా నిడదవోలులో వార్ఫ్ వద్ద దిగుమతులు కొనసాగేవి. మద్రాసు ప్రాంతం నుంచి వచ్చే సరుకులను నిడదవోలులో దింపి, పడవల ద్వారా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేవారు. ఆ తరువాత పెద్దఫ్లీట్ పాయింట్‌గా ఉన్న తాడేపల్లిగూడెం నుంచి సరుకుల రవాణా సాగేది. ఇందుకోసం ప్రస్తుత రైల్వే గూడ్స్‌షెడ్, ఏలూరు కాలువకు మధ్య నీటిపారుదల శాఖ అప్పట్లో భూమిని సేకరించింది. ఇప్పటికీ ఆ భూమి మొత్తం ఆ శాఖ అధీనంలోనే ఉంది. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసే ఫ్లీట్ పాయింట్‌కు ఈ స్థలం సరిపోతుందని భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడ భూసేకరణ విషయంలో పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఉండదంటున్నారు. ఏలూరులో మాత్రం కాలువ వెంబడి విస్తరణ పనులు, ఫ్లీట్ పాయింట్ ఏర్పాటుకు సరిపడే స్థలం అందుబాటులో లేదు. ఈ దృష్ట్యా అక్కడి కాలువను బైపాస్ (ఉపమార్గం) తరహాలో నిర్మించాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement