సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ చెప్పారు. అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగే గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్–2023కి అనుబంధంగా డీసీఐలో ఈ నెల 28న రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లను ఎండీ దివాకర్ పరిశీలించారు. డీసీఐ పురోగతికి తీసుకుంటున్న చర్యలు, సమ్మిట్‌కు సంబంధించిన విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
జలరవాణాపై సంప్రదింపులు
ప్రస్తుతం జీడీపీ విలువలో 80 శాతం వరకూ మారి టైమ్ ట్రేడ్ జరుగుతోంది. డ్రెడ్జింగ్ చేయకుండా ఏ పోర్టు అభివృద్ధి జరగదు. అందుకే ప్రధాని కూడా దేశీయ జలమార్గాల (ఇన్‌లాండ్ వాటర్ వేస్)పై దృష్టి సారించారు. ప్రస్తుతం 110 నదులుండగా కేవలం 4 నదుల్లో జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్ పనుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పూడికతో నిండిపోయిన డ్యామ్‌లు, రిజర్వాయర్లలోనూ డ్రెడ్జ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం చిన్నచిన్న డ్రెడ్జర్లు అవసరం అవుతాయి. దీనిపైనా సమాలోచనలు చేస్తున్నాం.
డ్రెడ్జ్ చేస్తే.. వాటర్ క్యాచ్‌మెంట్ ఏరియా పెరుగుతుందని ఇందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాం. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపాం. ఏ ప్రభుత్వమైనా డ్యామ్‌లు, రిజర్వాయర్ల డ్రెడ్జింగ్ పనుల్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అప్పగిస్తే కొత్త డ్రెడ్జర్లు తీసుకుంటాం.
దేశంలో డ్రెడ్జింగ్ కోసం 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకూ డిమాండ్ ఉంది. కానీ.. డీసీఐలో ప్రస్తుతం 59 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న10 టీఎస్‌హెచ్ డ్రెడ్జర్లు, 6 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న 2 కట్టర్ సీఎస్ డ్రెడ్జర్లు, ఒక బీహెచ్‌వో డ్రెడ్జర్ ఉన్నాయి. 12 వేల టన్నుల హోపర్ కెపాసిటీ డ్రెడ్జర్ కోసం ఆర్డర్ చేశాం. 2025 డిసెంబర్ నాటికి ఇది రానుంది.
రూ.12 వేల కోట్ల వరకూ ఎంవోయూలు
2021లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.14 వేల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నాం. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల వరకూ వస్తాయని భావి స్తున్నాం. ఇందుకోసం 28న డీసీఐలో నిర్వహించే రోడ్‌షోలో షిప్ బిల్డర్స్, షిప్ ఆపరేటర్స్,పోర్టులు, రెగ్యులేటరీస్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం.
ఏపీలో 4 పోర్టుల రాకతో అపార అవకాశాలు
ఏపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని చురుగ్గా నిర్వహిస్తోంది. కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అపారమైన అవకాశాలు కలగనున్నాయి. ఈ నాలుగు పోర్టుల్లో కనీసం 150 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మచిలీపట్నంలో పనులు చేపడుతున్నాం. మిగిలిన పోర్టుల్లోనూ పనుల కోసం మరిన్ని డ్రెడ్జర్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
Comments
Please login to add a commentAdd a comment