eluru canal
-
ఎంపీడీవో అదృశ్యం విషాదాంతం
పెనమలూరు/నరసాపురం/కోనేరుసెంటర్(మచిలీపట్నం)/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యం ఘటన చివరికి విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని విజయవాడలోని మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో మంగళవారం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఈ నెల 15వ తేదీన ఎంపీడీవో అదృశ్యం కాగా... ఆయన సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సిగ్నల్ ఆధారంగా మధురానగర్ వంతెన వద్ద నుంచి ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేశారు.ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ వంతెనకు 200 మీటర్ల దూరంలో పిచ్చిమొక్కల అడుగుభాగాన కుళ్లిపోయిన దశలో వెంకటరమణారావు మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరులో వెంకటరమణారావు అంత్యక్రియలు నిర్వహించారు.పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. కాగా, ఒత్తిళ్ల వల్లే వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు శవపంచనామా సందర్భంగా తెలిపారు. మాధవాయిపాలెం ఫెర్రీ సొమ్ము రూ.55లక్షల బకాయి కారణంగా మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరసాపురం ఎంపీడీవో కుటుంబానికి న్యాయం చేస్తాం: పవన్ నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు మరణం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచి్చన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.అన్నోన్ నంబర్ల నుంచి ఫోన్లు.. సంబంధం లేని ఖాతాలకు డబ్బులు బదిలీ!కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ తెలియకపోవడంతో ఆయన ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అన్ నోన్ నంబర్ల నుంచి వెంకటరమణారావుకు ఫోన్లు వచి్చనట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరికి, హైదరాబాద్‌కు చెందిన ఒకరికి, మరికొన్ని గుర్తుతెలియని ఖాతాలకు ఆన్లైన్లో ఎంపీడీవో డబ్బులు బదిలీ చేసినట్లు వెలుగుచూసింది.అయితే, మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో రూ.55 లక్షలు బకాయి ఉండగా, తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిన వెంకటరమణ కొంత నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో జమ చేశారని చెప్పారు. -
వడివడి అడుగులు
తాడేపల్లిగూడెం : జిల్లాలోని ఏలూరు ప్రధాన కాలువ మీదుగా జల రవాణాను పునరుద్ధరించే ప్రక్రియ ఊపందుకుంటోంది. ఈ కాలువను విస్తరించేందుకు ఏ మేరకు భూములు అవసరమవుతాయనే దానిపై ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేసిన కేంద్ర జల రవాణా విభాగం భూసేకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఏలూరు కాలువ వెంబడి ఎక్కడెక్కడ ఎంత భూమిని సేకరించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చింది. భూసేకరణకు సంబంధించి శనివారం నుంచి సర్వే చేపట్టబోతోంది. 8 మండలాలు.. 37 గ్రామాల్లో.. ఏలూరు ప్రధాన కాలువను జల రవాణాకు వీలుగా వెడల్పు చేసేందుకు జిల్లాలో 8 మండలాల పరిధిలోని 37 గ్రామాల్లో 2,547.13 ఎకరాల భూమి వడివడి అడుగులు అవసరమవుతుందని నిర్థారించారు. రైతుల నుంచి ఆయా భూములను సేకరించనున్నారు. విజయవాడలోని జల రవాణా కార్యాలయ అధికారులు, సర్వే పనులు చేపట్టే ఎక్సెల్ కంపెనీ ప్రతినిధులు సర్వే కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో సమావేశమై కాలువకు సంబంధించిన వివరాలు, భూముల పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. ముందస్తుగా సమాచారం సేకరించి సర్వే అధికారులకు అప్పగించనున్నారు. సర్వేలో పాల్గొనేందుకు తహసీల్దార్లు, సర్వేయర్లను అందుబాటులో ఉండాలని ఇప్పటికే కోరారు. గ్రామాల వారీగా సేకరించే భూములిలా కొవ్వూరు మండలం : మద్దూరులో 104.94 ఎకరాలు నిడదవోలు మండలం : విజ్జేశ్వరంలో 52.83, గోపవరంలో 49.28, నిడదవోలులో 210.34, ఆట్లపాడులో 26.18, శెట్టిపేటలో 131.93 ఎకరాలు (మొత్తం 470.57 ఎకరాలు) తాడేపల్లిగూడెం మండలం : నందమూరులో 80.79, ఆరుళ్లలో 89.04, నవాబ్‌పాలెంలో 101.21, ఆరుగొలనులో 34.43, కుంచనపల్లిలో 0.11, తాడేపల్లిగూడెం పట్టణంలో 47.69, కడకట్లలో 60.15, తాడేపల్లిలో 54.57 ఎకరాలు (మొత్తం 467.98 ఎకరాలు) పెంటపాడు మండలం : ప్రత్తిపాడులో 102.28, దర్శిపర్రులో 50.32 ఎకరాలు (మొత్తం 152.60 ఎకరాలు) ఉంగుటూరు మండలం : బాదంపూడిలో 88.40, వెల్లమిల్లిలో 32.23, ఉంగుటూరులో 129.06, చేబ్రోలులో 38.52, చేబ్రోలు ఖండ్రికలో 35.61, కైకరంలో 79.49 ఎకరాలు (మొత్తం 403.31 ఎకరాలు) భీమడోలు మండలం : కొండ్రుపాడులో 50.16, పూళ్లలో 55.11, అంబర్‌పేటలో 44.58, భీమడోలులో 192.16, సూరప్పగూడెంలో 63.13, గుండుగొలనులో 43.34 ఎకరాలు (మొత్తం 448.47 ఎకరాలు) దెందులూరు మండలం : సింగవరంలో 95.86, కొమిరిపల్లిలో 4.04, పోతునూరులో 40.10, కొవ్వలిలో 4.52, దెందులూరులో 204.67 ఎకరాలు (మొత్తం 349.19 ఎకరాలు) ఏలూరు మండలం : మల్కాపురంలో 115.09, కొమడవోలులో 34.96 ఎకరాలు (మొత్తం 150.15 ఎకరాలు) -
సర్వేషురూ
ఉంగుటూరు : జిల్లాలో జల రవాణా అభివృద్ధి దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు ప్రధాన కాలువను విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన భూములను గుర్తించేందుకు ఉంగుటూరు మండలం బాదంపూడి, ఉప్పాకపాడు వద్ద సర్వే పనులకు మంగళవారం శ్రీకారం చుడుతున్నారు. ఈ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కాలువ అధికారులు ఉంగుటూరు రానున్నారు. ఇందుకు అవసరమైన రికార్డులను స్థానిక అధికారులు సిద్ధం చేశారు. సర్వే పనులకు ఏలూరు ఆర్డీఓ చక్రధరరావు కో–ఆరి్డనేటర్గా వ్యవహరిస్తారు. విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకూ.. జిల్లాలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ప్రారంభమయ్యే నిడదవోలు మండలం విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు ఎంత భూమిని సేకరించాలనే విషయంపై అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. భూముల సర్వే చేపట్టాలంటూ 8 మంది తహసీల్దార్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వారు గ్రామాల వారీగా భూసేకరణ జాబితాను వీఆర్వోలకు అందజేశారు. స్థల సేకరణకు రంగం సిద్ధం చేశారు. ఆలయాల తరలింపు జల రవాణా అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువ గట్లపై ఉన్న ఆలయాలను తొలగించి మరోచోట నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. శ్మశాన వాటికలను తొలగించాల్సి వస్తే మరోచోట స్థలాలను చూపిస్తామని చెబుతున్నారు. గట్టు నుంచి 120 మీటర్లు జల రవాణా కోసం కాలువ గట్టు నుంచి 120 మీటర్ల వరకు కాలువను వెడల్పు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎక్కడెక్కడ ఎంతెంత భూముల్ని సేకరించాలనే విషయాన్ని నిర్థారించేందుకు సర్వే పనులు చేపడుతున్నారు. ఇది పూర్తయిన అనంతరం భూములను సేకరించి అప్పగించేందుకు తహసీల్దార్లు సంసిద్ధంగా ఉన్నారు. స్థల సేకరణలో భాగంగా ఎనిమిది మండలాల్లో కాలువ గట్ల వెంబడి ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. దీనివల్ల తలనొప్పులు తప్పవని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. మార్కింగ్ వేస్తారు జల రవాణా అభివృద్ధి పనుల కోసం మంగళవారం ఉంగుటూరు మండలం బాదంపూడి, వెల్లమిల్లిలో సర్వే మొదలవుతుంది. సర్వే చేసి మార్కింగ్ వేయనున్నారు. –వైకేవీ అప్పారావు, తహసీల్దార్, ఉంగుటూరు జిల్లాలోని 8 మండలాల పరిధిలో 2,547 ఎకరాల 13 సెంట్ల భూమిని జల రవాణా అభివృద్ధి పనుల కోసం సేకరించనున్నారు. మండలం సేకరించనున్న భూమి (ఎకరాల్లో) ఏలూరు 150.5 దెందులూరు 349.19 భీమడోలు 448.47 ఉంగుటూరు 403.31 పెంటపాడు 152.60 తాడేపల్లిగూడెం 467.98 నిడదవోలు 470.57 సెంట్లు కొవ్వూరు 104.94 సెంట్లు మొత్తం 2,547.13 -
ప్రాణం తీసిన కాలువ స్నానం
భీమడోలు : గోదావరి కాలువలో సరదాగా స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది. మరో యువకుడి కోసం రాత్రి వరకూ గజ ఈతగాళ్లు గాలించినా ఫలితం దక్కలేదు. ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్మలు కాగా మరో యువకుడు సమీప బంధువు కుమారుడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న చేసిన ప్రయత్నాలు విఫలం కావడమంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. భీమడోలులో జాతీయ రహదారి పక్కన ఉన్న కనకదుర్గమ్మ ఆలయ సమీపంలోని స్నానాల రేవు వద్ద విషాద ఘటనలో ఏలూరు సత్యనారాయణపేటకు చెందిన మండాది దిలీప్‌కుమార్ (18) అనే యువకుడు మరణించాడు. వివరాలిలా ఉన్నాయి.. గుండుగొలనుకు చెందిన మండాది కృష్ణమోహన్ పిల్లల చదువుల కోసం 14 ఏళ్ల క్రితం ఏలూరుకు మ కాం మార్చారు. కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మోహనమురళీ బీటెక్ చదువుకుని భీమడోలులో ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్‌లో పనిచేస్తున్నాడు. రెండో కుమారుడు మండాది దిలీప్‌కుమార్ ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వారి సమీప బంధువు కుమారుడు 24 ఏళ్ల నేలపూడి మనోహర్ బీటెక్ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మోహనమురళీ రోజూ ఏలూరు నుంచి భీమడోలు వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దిలీప్‌కుమార్, మనోహర్ శనివారం బైక్‌పై భీమడోలులో మోహనమురళీ వద్దకు వచ్చారు. సరదాగా గడిపిన వారంతా భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద గల స్నానాల రేవుకు వచ్చి ఫొటోలు దిగారు. కాలువ ఉధృతంగా ప్రవహించడం గుర్తించని ముగ్గురూ స్నానానికి దిగారు. వారిలో మనోహర్ మొదటగా కాలువలో కొట్టుకుపోయాడు. అన్నదమ్ములు మోహనమురళీ, దిలీప్‌కుమార్ కాలువ గట్టువెంబడి కొట్టుకుపోతుండగా మోహనమురళీ బయటపడ్డాడు. అయినా తమ్ముడు దిలీప్‌కుమార్‌ను రక్షించేందుకు మరలా కాలువలో దూకాడు. వీరిద్దరూ కాలువలో కొట్టుకుపోతుండగా ఆలయం వద్ద పనిచేస్తున్న కందుల దుర్గతో పాటు మరో మహిళ కాపాడేందుకు కాలువలోకి చీరలు, తాళ్లు విసిరారు. వీటిద్వారా మోహనమురళీ గట్టుకు చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు. కొనసాగుతున్న గాలింపు సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఇక్కడకు చేరుకున్నారు. తన కళ్లెదుటే గల్లంతయిన ఇద్దరిని తలుచుకుంటూ మోహనమురళీ రోదించాడు. బోటు, గజ ఈతగాళ్ల సహాయంతో సీఐ ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ పీవీబీఎల్ పద్మావతి ఆధ్వర్యంలో ఎస్సై బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు. కాలువ అడుగున ఉన్న దిలీప్‌కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. గుండుగొలను, ఏలూరు, భీమడోలు ప్రాంతాల నుంచి బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దిలీప్‌కుమార్ మృతదేహం వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మనోహర్ మృతదేహం గాలింపునకు చీకటి అడ్డంకి కావడంతో గజఈతగాళ్లు వెనుదిరిగారు. -
నిడదవోలు టు ఏలూరు
తాడేపల్లిగూడెం : జిల్లాలో ప్రధాన జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దేశీయ జల మార్గ విధానం (ఇన్‌ల్యాండ్ వాటర్ వే పాలసీ)లో భాగంగా నిడదవోలు–ఏలూరు మధ్య 74 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గోదావరి ప్రధాన కాలువను ఆధునికీకరించాలని ఇప్పటికే నిర్ణయిం చారు. కాలువ వెడల్పు పెంచేందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందనే దానిపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. సర్వే, భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రయాణించే రవాణా ఓడలను నిలిపేందుకు, సరుకుల ఎగుమతి, దిగుమతులకు వీలుగా తాడేపల్లిగూడెం, ఏలూరులో ఫ్లీట్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. కృష్ణా జిల్లా పరిధిలో కాలువ విస్తరణ అవసరమైన భూముల కోసం ఇప్పటికే సర్వే పనులు మొదలయ్యాయి. మన జిల్లాలోనూ సర్వే, భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేసి వచ్చే వేసవి నాటికి కాలువ విస్తరణ చేపట్టాలనే ప్రణాళికతో యంత్రాంగం ముందుకు వెళుతోంది. కాలువ గర్భం 25 మీటర్లు.. వెడల్పు 40 మీటర్లు ఏలూరు కాలువ గర్భం 25 మీటర్లు, ఉపరి తలంపై కాలువ వెడల్పు 40 మీటర్లు ఉం డేలా ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాలువకు రెండు వైపులా కలిపి మరో 20 మీటర్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఈ దృష్ట్యా ఎక్కడ ఎంత భూమిని సేకరించాలనే దానిపై 35 గ్రామాల్లో సర్వే పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు కాలువ వెంబడి మార్కింగ్ ఇవ్వగానే, రెవెన్యూ అధికారులు భూమిని సేకరించే పని చేపడతారు. అనంతరం కాలువ ఆధునికీకరణ పనులు మొదలవుతాయి. గూడెంలో ఇబ్బంది లేదు గతంలో బకింగ్‌హాం కెనాల్లో జలరవాణా మార్గంతో జిల్లాలోని ఏలూరు ప్రధాన కాలువ అనుసంధానమై ఉండేది. అప్పట్లో తాడేపల్లిగూడెంలో ఫ్లీట్ పాయింట్ (ఓడలు నిలిపే స్థలం) ఉండేది. యద్దనపూడి వెంకట సుబ్బారావు, ఆయన తనయుడు సూర్యనారాయణమూర్తి దీనిని నిర్వహించేవారు. దీనికి అనుబంధంగా నిడదవోలులో వార్ఫ్ వద్ద దిగుమతులు కొనసాగేవి. మద్రాసు ప్రాంతం నుంచి వచ్చే సరుకులను నిడదవోలులో దింపి, పడవల ద్వారా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు రవాణా చేసేవారు. ఆ తరువాత పెద్దఫ్లీట్ పాయింట్‌గా ఉన్న తాడేపల్లిగూడెం నుంచి సరుకుల రవాణా సాగేది. ఇందుకోసం ప్రస్తుత రైల్వే గూడ్స్‌షెడ్, ఏలూరు కాలువకు మధ్య నీటిపారుదల శాఖ అప్పట్లో భూమిని సేకరించింది. ఇప్పటికీ ఆ భూమి మొత్తం ఆ శాఖ అధీనంలోనే ఉంది. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసే ఫ్లీట్ పాయింట్‌కు ఈ స్థలం సరిపోతుందని భావిస్తున్నారు. అందువల్ల ఇక్కడ భూసేకరణ విషయంలో పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఉండదంటున్నారు. ఏలూరులో మాత్రం కాలువ వెంబడి విస్తరణ పనులు, ఫ్లీట్ పాయింట్ ఏర్పాటుకు సరిపడే స్థలం అందుబాటులో లేదు. ఈ దృష్ట్యా అక్కడి కాలువను బైపాస్ (ఉపమార్గం) తరహాలో నిర్మించాల్సి ఉంటుంది. -
పునరుద్ధరిస్తే బకింగే
తాడేపల్లిగూడెం : హైడ్రాలిక్ హారన్ల శబ్దాల్ని భరించలేక చెవులు మూసుకోనక్కర్లేదు. సరంగుల హైలెస్సో .. హైలెస్సా పాటలు, కాలువ గట్లపై మోకులతో పడవల్ని లాక్కెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించకపోవచ్చు. కానీ.. గలగలాపారే నీటిపై సరుకులను రవాణా చేసే భారీ పడవలు రానున్న రోజుల్లో ఏలూరు ప్రధాన కాలువలో షికారు చేయనున్నాయి. ట్రాఫిక్ స్తంభనలు, రహదారి దగ్బంధనాలు వంటి గొడవ లేకుండానే వెయ్యి మెట్రిక్ టన్నుల వరకు సరుకులను అతి తక్కువ ధరకు సాఫీగా గమ్యస్థానాలకు చేర్చవచ్చు. బ్రిటిష్ కాలంలో జల రవాణాలో ప్రధాన భూమిక పోషించిన బకింగ్‌హాం కెనాల్ రవాణా వ్యవస్థ తిరిగి ఊపిరి పోసుకుంటోంది. ఇది సాకారమైతే రవాణా ఖర్చులు దాదాపుగా 60 శాతం తగ్గుతాయి. సరుకుల తరలింపు, నీటి పారుదల, పర్యాటక అభివృద్ధి లక్ష్యాలుగా బకింగ్‌హామ్ కెనాల్ జల రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోణంలో.. జాతీయ నాలుగో జలమార్గంగా 2004 జూన్‌లో చిగురులు తొడిగిన కేంద్ర ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చబోతోంది. జాతీయ జలమార్గాల సంస్థ చైర్మన్ అమితాబ్ తివారీ చొరవతో జల రవాణా పునరుద్ధరణకు సంబంధించి దశలవారీగా సర్వేలు జరిగాయి. బకింగ్‌హాం కెనాల్లో జలరవాణా పునరుద్ధరణకు రూ.3,200 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ముక్త్యాల–విజయవాడ–కాకినాడ మార్గంలో తొలిదశ పనులకు త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ కేంద్రానికి నివేదిక సమర్పించారు. కృష్ణా జిల్లాలో 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ముక్త్యాల కాలువను అభివృద్ధి చేసేందుకు మరో నాలుగు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. గుంటూరు జిల్లాలో చామర్రు కాలువ అభివృద్ధికి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రెండు జలమార్గాలకు రూ.69.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కాలువ కథ ఇదీ జాతీయ నౌకాయాన శాఖ అధీనంలో గల బకింగ్‌హాం కాలువలో బ్రిటిష్ పాలనా కాలంలో పడవల ద్వారా సరుకుల రవాణా సాగేది. అప్పట్లో ఈ కాలువ 100 మీటర్ల వెడల్పున ఉండేది. ఆ కాలంలో జిల్లాలోని తాడేపల్లిగూడెంలో 120 పడవలతో కూడిన ఫ్లీట్ పాయింట్ ఉండేది. ఇక్కడి నుంచి పడవల్లో చెన్నైకు, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ వరకు సరుకులను చేరవేసేవారు. రోడ్డు రవాణా పెరగడంతో జలమార్గాన్ని విస్మరించారు. సునామీ వంటి ప్రకృతి వైపరీ త్యాలు తలెత్తిన నేపథ్యంలో బకింగ్‌హాం కాలువ విలువ తెలిసివచ్చింది. దీంతో ఈ కాలువను రవాణా నిమిత్తం పునరుద్ధరించడానికి 2008లో జాతీయ జల రవాణా మార్గాల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి సర్వే చేపట్టారు. అనంతరం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఆధ్వర్యంలో కాలువ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో తమిళనాడులోని బకింగ్‌హామ్ కాలువలో 50 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేశారు. ఆధునికీకరించిన కాలువ మార్గంలో షోలింగనల్లూరు వద్ద కల్పకం కార్గో షిప్పింగ్ చానల్‌ను ఈ ఏడాది జనవరి 25న ప్రారంభించారు. దశలవారీగా బకింగ్‌హాం కాలువలో జలరవాణా పునరుద్ధరించడానికి కార్యాచరణ రూపొందించారు. ఆ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అవి పూర్తయితే విజయవాడ నుంచి కాకినాడ మధ్య ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ధవళేశ్వరం మీదుగా కాకినాడ వరకు జల రవాణా మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. అడ్డంకులున్నాయ్ బకింగ్‌హాం జలరవాణా మార్గం కృష్ణా జిల్లా పెదగంజాం నుంచి ఏలూరులోని తూర్పులాకుల మీదుగా ఏలూరు గోదావరి కెనాల్‌తో అనుసంధానం అవుతుంది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు, విజ్జేశ్వరం, ధవళేశ్వరం మీదుగా కాకినాడలో సముద్రతీర ప్రాంత సంగమం వరకు వెళుతుంది. జిల్లాలో ఏలూరు నుంచి విజ్జేశ్వరం వరకు గల ఏలూరు ప్రధాన కాలువ పలుచోట్ల ఆక్రమణలకు గురై బక్కచిక్కింది. ఏలూరులో మంచినీటి పథకాల నిర్మాణాలు, ఉంగుటూరు ప్రాంతంలో కాలువ గట్లపై ఆక్రమణలు, తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆలోచన రహితంగా తక్కువ ఎత్తులో నిర్మించిన వంతెనలు, పట్టణంలో ఆలయాలు, కాలువ గట్ల ఆక్రమణ వంటివి జరిగాయి. పెంటపాడు మండలం నవాబ్పాలెంలోని బౌ వంతెన వద్ద ఇదే పరిస్థితి ఉంది. పట్టణంలోని శివాలయం వద్ద నిర్మించిన వంతెన జల రవాణాకు ప్రతిబంధకంగా ఉంది. నందమూరు వద్ద ఎర్రకాలువ, ఏలూరు కాలువ విడిపోయే చోట నావిగేషన్‌కు ఇబ్బందులు ఉన్నాయి. పరిశ్రమలు వంటివి ఈ గట్టుపై లేనందువల్ల ఆక్రమణలు తొలగించడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ వంతెనలు వంటి నిర్మాణాలను విస్తరించాల్సి ఉంది. జల రవాణాకు అనుమతించే పడవలు, ఇతర యంత్ర రవాణా సా«ధనాలకు అనుగుణంగా డిజైన్స్ మార్చాల్సి ఉంది. -
దీప్తి మృతదేహం లభ్యం
గన్నవరం : మండలంలోని కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో ఆరు రోజుల క్రితం పడిపోయిన చౌటపల్లి దీప్తి మృతదేహం లభించింది. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ సమీపాన కాలువలో ఆమె మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23వ తేదీన తన ప్రియుడు నక్కా నాగరాజుతో ఘర్షణ నేపథ్యంలో దీప్తి కేసరపల్లి వద్ద ఏలూరు కాలువలో పడిపోయింది. అప్పటి నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా కేసరపల్లి నుంచి బుద్ధవరం వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాపులపాడు మండలం వీరవల్లి వద్ద కాలువలో మహిళ మృతదేహం తేలియాడుతుండగా... స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెళ్లి పరిశీలించారు. దుస్తుల ఆధారంగా మృతురాలు దీప్తిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె కాలువలో పడి ఆరు రోజులు కావడంతో మృతదేహం ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈస్ట్ జోన్ ఏసీపీ డి.విజయభాస్కర్, సీఐ అహ్మద్అలీ తదితరులు దీప్తి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏలూరు కాల్వగట్టుపై ఉద్రిక్తత
విజయవాడ: ఏలూరు కాల్వ గట్టుపై ఉద్రిక్తత చోటు చేసకుంది. సోమవారం కాల్వగట్టుపై ఉన్న శ్రీకృష్ణుడి గుడి తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న స్ధానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. గుడిని తొలగించేందుకు వీలులేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. -
స్నేహితుడ్ని కాపాడబోయి అనంతలోకాలకు..
పశ్చిమగోదావరి(తాడేపల్లిగూడెం): కాలువలో కొట్టుకు పోతున్న స్నేహితుడ్ని కాపాడబోయి ముగిపోయాడో బాలుడు. వివరాలు.. తాడేపల్లిగూడెంలోని శివాలయం వద్ద గోదావరి ఏలూరు కాలువలో ఈతకు దిగిన పి.ధనుంజయశర్మ(15) అనే బాలుడు ఈ సంఘటనలో గల్లంతయ్యాడు. ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు ఇచ్చిన బంద్‌తో స్కూల్ తెరుచుకోపోవటంతో ముగ్గురు స్నేహితులతో కలిసి ధనుంజయ్ సరదాగా ఈతకెళ్లాడు. ఈ క్రమంలోనే కాలువలోకి దిగిన మరో బాలుడు కొట్టుకుపోతుండగా రక్షించబోయి తాను మునిగిపోయాడు. మంగళవారం రాత్రి బాలుడి మృతదేహం మునిగిపోయిన చోటే తేలింది. ధనంజయ్ శర్మ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ప్రేమజంట మృతదేహాల వెలికితీత
అనకాపల్లి రూరల్: తుమ్మపాల సమీపంలోని ఏలేరు కాలువలో ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమికుల జంట మృతదేహాలను సోమవారం ఉదయం వెలికి తీశారు. తుమ్మపాల గ్రామానికి చెందిన కండెళ్ల అప్పారావు, చింతనిప్పుల అగ్రహారానికి చెందిన చందక దుర్గలక్ష్మి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పట్టణ, రూరల్ పోలీసులు ఇరువర్గాలు, పెద్దలు సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఆత్మహత్యకు పాల్పడిన చందక దుర్గలక్ష్మి తల్లిదండ్రులు చినతల్లి, రాములకు ఏకైక కుమార్తె. తండ్రి రాము కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడు. మృతుడు కండెళ్ల అప్పారావు తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్లకు పెద్దదిక్కుగా ఉండేవాడు. వీరిద్దరి ఆత్మహత్యతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.