సర్వేషురూ
సర్వేషురూ
Published Tue, May 9 2017 2:09 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
ఉంగుటూరు : జిల్లాలో జల రవాణా అభివృద్ధి దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు ప్రధాన కాలువను విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన భూములను గుర్తించేందుకు ఉంగుటూరు మండలం బాదంపూడి, ఉప్పాకపాడు వద్ద సర్వే పనులకు మంగళవారం శ్రీకారం చుడుతున్నారు. ఈ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కాలువ అధికారులు ఉంగుటూరు రానున్నారు. ఇందుకు అవసరమైన రికార్డులను స్థానిక అధికారులు సిద్ధం చేశారు. సర్వే
పనులకు ఏలూరు ఆర్డీఓ చక్రధరరావు కో–ఆరి్డనేటర్‌గా వ్యవహరిస్తారు.
విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకూ..
జిల్లాలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ ప్రారంభమయ్యే నిడదవోలు మండలం విజ్జేశ్వరం నుంచి ఏలూరు వరకు ఎంత భూమిని సేకరించాలనే విషయంపై అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. భూముల సర్వే చేపట్టాలంటూ 8 మంది తహసీల్దార్‌లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వారు గ్రామాల వారీగా భూసేకరణ జాబితాను వీఆర్వోలకు అందజేశారు. స్థల సేకరణకు రంగం సిద్ధం చేశారు.
ఆలయాల తరలింపు
జల రవాణా అభివృద్ధి పనుల్లో భాగంగా కాలువ గట్లపై ఉన్న ఆలయాలను తొలగించి మరోచోట నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. శ్మశాన వాటికలను తొలగించాల్సి వస్తే మరోచోట స్థలాలను చూపిస్తామని చెబుతున్నారు.
గట్టు నుంచి 120 మీటర్లు
జల రవాణా కోసం కాలువ గట్టు నుంచి 120 మీటర్ల వరకు కాలువను వెడల్పు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎక్కడెక్కడ ఎంతెంత భూముల్ని సేకరించాలనే విషయాన్ని నిర్థారించేందుకు సర్వే పనులు చేపడుతున్నారు. ఇది పూర్తయిన అనంతరం భూములను సేకరించి అప్పగించేందుకు తహసీల్దార్లు సంసిద్ధంగా ఉన్నారు. స్థల సేకరణలో భాగంగా ఎనిమిది మండలాల్లో కాలువ గట్ల వెంబడి ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. దీనివల్ల తలనొప్పులు తప్పవని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
మార్కింగ్ వేస్తారు
జల రవాణా అభివృద్ధి పనుల కోసం మంగళవారం ఉంగుటూరు మండలం బాదంపూడి, వెల్లమిల్లిలో సర్వే మొదలవుతుంది. సర్వే చేసి మార్కింగ్ వేయనున్నారు.
–వైకేవీ అప్పారావు, తహసీల్దార్, ఉంగుటూరు
జిల్లాలోని 8 మండలాల పరిధిలో
2,547 ఎకరాల 13 సెంట్ల భూమిని జల రవాణా అభివృద్ధి పనుల కోసం సేకరించనున్నారు.
మండలం సేకరించనున్న భూమి
(ఎకరాల్లో)
ఏలూరు 150.5
దెందులూరు 349.19
భీమడోలు 448.47
ఉంగుటూరు 403.31
పెంటపాడు 152.60
తాడేపల్లిగూడెం 467.98
నిడదవోలు 470.57 సెంట్లు
కొవ్వూరు 104.94 సెంట్లు
మొత్తం 2,547.13
Advertisement
Advertisement