పునరుద్ధరిస్తే బకింగే
పునరుద్ధరిస్తే బకింగే
Published Thu, Sep 1 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
తాడేపల్లిగూడెం : హైడ్రాలిక్ హారన్ల శబ్దాల్ని భరించలేక చెవులు మూసుకోనక్కర్లేదు. సరంగుల హైలెస్సో .. హైలెస్సా పాటలు, కాలువ గట్లపై మోకులతో పడవల్ని లాక్కెళ్లడం లాంటి దృశ్యాలు కనిపించకపోవచ్చు. కానీ.. గలగలాపారే నీటిపై సరుకులను రవాణా చేసే భారీ పడవలు రానున్న రోజుల్లో ఏలూరు ప్రధాన కాలువలో షికారు చేయనున్నాయి. ట్రాఫిక్ స్తంభనలు, రహదారి దగ్బంధనాలు వంటి గొడవ లేకుండానే వెయ్యి మెట్రిక్ టన్నుల వరకు సరుకులను అతి తక్కువ ధరకు సాఫీగా గమ్యస్థానాలకు చేర్చవచ్చు. బ్రిటిష్ కాలంలో జల రవాణాలో ప్రధాన భూమిక పోషించిన బకింగ్‌హాం కెనాల్ రవాణా వ్యవస్థ తిరిగి ఊపిరి పోసుకుంటోంది. ఇది సాకారమైతే రవాణా ఖర్చులు దాదాపుగా 60 శాతం తగ్గుతాయి.
సరుకుల తరలింపు, నీటి పారుదల, పర్యాటక అభివృద్ధి లక్ష్యాలుగా బకింగ్‌హామ్ కెనాల్ జల రవాణా వ్యవస్థ పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోణంలో.. జాతీయ నాలుగో జలమార్గంగా 2004 జూన్‌లో చిగురులు తొడిగిన కేంద్ర ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చబోతోంది. జాతీయ జలమార్గాల సంస్థ చైర్మన్ అమితాబ్ తివారీ చొరవతో జల రవాణా పునరుద్ధరణకు సంబంధించి దశలవారీగా సర్వేలు జరిగాయి. బకింగ్‌హాం కెనాల్‌లో జలరవాణా పునరుద్ధరణకు రూ.3,200 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ముక్త్యాల–విజయవాడ–కాకినాడ మార్గంలో తొలిదశ పనులకు త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ కేంద్రానికి నివేదిక సమర్పించారు. కృష్ణా జిల్లాలో 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ముక్త్యాల కాలువను అభివృద్ధి చేసేందుకు మరో నాలుగు రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. గుంటూరు జిల్లాలో చామర్రు కాలువ అభివృద్ధికి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రెండు జలమార్గాలకు రూ.69.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
కాలువ కథ ఇదీ
జాతీయ నౌకాయాన శాఖ అధీనంలో గల బకింగ్‌హాం కాలువలో బ్రిటిష్ పాలనా కాలంలో పడవల ద్వారా సరుకుల రవాణా సాగేది. అప్పట్లో ఈ కాలువ 100 మీటర్ల వెడల్పున ఉండేది. ఆ కాలంలో జిల్లాలోని తాడేపల్లిగూడెంలో 120 పడవలతో కూడిన ఫ్లీట్ పాయింట్ ఉండేది. ఇక్కడి నుంచి పడవల్లో చెన్నైకు, ఇటు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ వరకు సరుకులను చేరవేసేవారు. రోడ్డు రవాణా పెరగడంతో జలమార్గాన్ని విస్మరించారు. సునామీ వంటి ప్రకృతి వైపరీ త్యాలు తలెత్తిన నేపథ్యంలో బకింగ్‌హాం కాలువ విలువ తెలిసివచ్చింది. దీంతో ఈ కాలువను రవాణా నిమిత్తం పునరుద్ధరించడానికి 2008లో జాతీయ జల రవాణా మార్గాల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి సర్వే చేపట్టారు. అనంతరం ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఆధ్వర్యంలో కాలువ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. తొలి దశలో తమిళనాడులోని బకింగ్‌హామ్ కాలువలో 50 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేశారు. ఆధునికీకరించిన కాలువ మార్గంలో షోలింగనల్లూరు వద్ద కల్పకం కార్గో షిప్పింగ్ చానల్‌ను ఈ ఏడాది జనవరి 25న ప్రారంభించారు. దశలవారీగా బకింగ్‌హాం కాలువలో జలరవాణా పునరుద్ధరించడానికి కార్యాచరణ రూపొందించారు. ఆ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అవి పూర్తయితే విజయవాడ నుంచి కాకినాడ మధ్య ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ధవళేశ్వరం మీదుగా కాకినాడ వరకు జల రవాణా మళ్లీ ఊపిరిపోసుకుంటుంది.
అడ్డంకులున్నాయ్
బకింగ్‌హాం జలరవాణా మార్గం కృష్ణా జిల్లా పెదగంజాం నుంచి ఏలూరులోని తూర్పులాకుల మీదుగా ఏలూరు గోదావరి కెనాల్‌తో అనుసంధానం అవుతుంది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు, విజ్జేశ్వరం, ధవళేశ్వరం మీదుగా కాకినాడలో సముద్రతీర ప్రాంత సంగమం వరకు వెళుతుంది. జిల్లాలో ఏలూరు నుంచి విజ్జేశ్వరం వరకు గల ఏలూరు ప్రధాన కాలువ పలుచోట్ల ఆక్రమణలకు గురై బక్కచిక్కింది. ఏలూరులో మంచినీటి పథకాల నిర్మాణాలు, ఉంగుటూరు ప్రాంతంలో కాలువ గట్లపై ఆక్రమణలు, తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆలోచన రహితంగా తక్కువ ఎత్తులో నిర్మించిన వంతెనలు, పట్టణంలో ఆలయాలు, కాలువ గట్ల ఆక్రమణ వంటివి జరిగాయి. పెంటపాడు మండలం నవాబ్‌పాలెంలోని బౌ వంతెన వద్ద ఇదే పరిస్థితి ఉంది. పట్టణంలోని శివాలయం వద్ద నిర్మించిన వంతెన జల రవాణాకు ప్రతిబంధకంగా ఉంది. నందమూరు వద్ద ఎర్రకాలువ, ఏలూరు కాలువ విడిపోయే చోట నావిగేషన్‌కు ఇబ్బందులు ఉన్నాయి. పరిశ్రమలు వంటివి ఈ గట్టుపై లేనందువల్ల ఆక్రమణలు తొలగించడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ వంతెనలు వంటి నిర్మాణాలను విస్తరించాల్సి ఉంది. జల రవాణాకు అనుమతించే పడవలు, ఇతర యంత్ర రవాణా సా«ధనాలకు అనుగుణంగా డిజైన్స్ మార్చాల్సి ఉంది.
Advertisement
Advertisement