విజయవాడలోని ఏలూరు కాలువలో వెంకటరమణారావు మృతదేహం లభ్యం
ఒత్తిళ్ల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యుల వాంగ్మూలం
సైబర్ నేరగాళ్లకు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపినట్లు గుర్తించిన పోలీసులు
పెనమలూరు/నరసాపురం/కోనేరుసెంటర్(మచిలీపట్నం)/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యం ఘటన చివరికి విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని విజయవాడలోని మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో మంగళవారం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఈ నెల 15వ తేదీన ఎంపీడీవో అదృశ్యం కాగా... ఆయన సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సిగ్నల్ ఆధారంగా మధురానగర్ వంతెన వద్ద నుంచి ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేశారు.
ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ వంతెనకు 200 మీటర్ల దూరంలో పిచ్చిమొక్కల అడుగుభాగాన కుళ్లిపోయిన దశలో వెంకటరమణారావు మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరులో వెంకటరమణారావు అంత్యక్రియలు నిర్వహించారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. కాగా, ఒత్తిళ్ల వల్లే వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు శవపంచనామా సందర్భంగా తెలిపారు. మాధవాయిపాలెం ఫెర్రీ సొమ్ము రూ.55లక్షల బకాయి కారణంగా మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నరసాపురం ఎంపీడీవో కుటుంబానికి న్యాయం చేస్తాం: పవన్
నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు మరణం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచి్చన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.
అన్‌నోన్ నంబర్ల నుంచి ఫోన్లు.. సంబంధం లేని ఖాతాలకు డబ్బులు బదిలీ!
కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ తెలియకపోవడంతో ఆయన ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అన్ నోన్ నంబర్ల నుంచి వెంకటరమణారావుకు ఫోన్లు వచి్చనట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరికి, హైదరాబాద్‌కు చెందిన ఒకరికి, మరికొన్ని గుర్తుతెలియని ఖాతాలకు ఆన్‌లైన్‌లో ఎంపీడీవో డబ్బులు బదిలీ చేసినట్లు వెలుగుచూసింది.
అయితే, మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో రూ.55 లక్షలు బకాయి ఉండగా, తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిన వెంకటరమణ కొంత నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్‌లలో జమ చేశారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment