బకింగ్ హామ్ కాలువ
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదితో బకింగ్ హామ్ కాలువను పునరుద్ధరించటం ద్వారా అనుసంధానించి జల రవాణా చేపట్టాలన్న ప్రణాళిక పట్టాలెక్కేలా లేదు. మహా రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. నాలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ అద్భుత ప్రాజెక్టు ద్వారా సరుకు రవాణా ఖర్చును నాలుగో వంతుకు తగ్గించే గొప్ప అవకాశం చేజారిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
నదుల అనుసంధానం ద్వారా జల రవాణాకు ఊతమివ్వనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాతి క్రమంలో దీనిపై మౌనం దాల్చడమే ఇందుకు కారణం. డీపీఆర్ తయారీ కసరత్తు వరకు హడావుడిగా జరిగినా, ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో అడుగు ముందుకు పడలేదు. జలరవాణాకు, ముఖ్యంగా గోదావరి నదిలో కారిడార్ ఏర్పాటుకు విఘాతం లేని విధంగా, నదిపై నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పుడు దానితో ప్రమేయం లేకుండా పనులు జరుగుతున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు చేపడితే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో ఊరించిన జలరవాణా ప్రాజెక్టు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏంటీ ప్రాజెక్టు..
గోదావరి నదిలో సరుకు రవాణాకు వీలుగా ప్రత్యేక కారిడార్ ఏర్పాటును 2015లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర మీదుగా చెన్నై వరకు సరుకులు తరలించేలా ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి ప్రవహిస్తోంది. దీనిని అతిపురాతన బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా అతిపెద్ద ఓడ రేవు ఉన్న చెన్నైతో అనుసంధానిస్తే సరుకు రవాణాలో సరికొత్త విప్లవం వస్తుందని గడ్కరీ యోచించారు. నిపుణులతో సర్వే చేయించారు.
బ్రిటిష్ పాలనలో కాకినాడ నుంచి తమిళ నాడులోని విల్లుపురం వరకు 796 కి.మీ. మేర బకింగ్‌హామ్ కెనాల్‌ను నిర్మించారు. అప్పట్లో ఈ కాలువను సరుకు రవాణాకు ముమ్మరంగా వాడారు. స్వాతంత్య్రానంతరం దీని ప్రాభవం క్రమంగా తగ్గిపోయింది. తాజాగా దీన్ని పునరుద్ధరించటం ద్వారా పులికాట్ సరస్సుకు అనుసంధానించి పుదుచ్చేరి వరకు విస్తరించాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది.
గోదావరిని ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం (గోదావరి చివరి బ్యారేజీ) నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ (గుంటూరు జిల్లా దుగ్గిరాల) ద్వారా (ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద) బకింగ్‌హామ్ కెనాల్‌కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఈ మేరకు ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడ ఎలా అనుసంధానించాలో వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆ అంశం మరుగున పడిపోవడం సందేహాలకు తావిస్తోంది.
సందేహాలకు తావిస్తున్న వంతెనల నిర్మాణం
పడవలు నడవాలంటే నదిలో ఎప్పుడూ నీటి నిల్వ ఉండాలి. కానీ గోదావరిలో భద్రాచలం సహా చాలా ప్రాంతాల్లో వేసవిలో నీళ్లు ఇంకిపోతుంటాయి. అందువల్ల జల రవాణాకు వీలుగా ప్రత్యేకంగా కారిడార్‌ను నిర్ధారించి ఛానెల్ ఏర్పాటు ద్వారా అన్ని సమయాల్లో నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నది దాటేందుకు నిర్మించే వంతెనలు పడవల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా ప్రత్యేక డిజైన్‌ను ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆ డిజైన్‌తో సంబంధం లేకుండా పలుచోట్ల వంతెనల పనులు జరుగుతుండటం ఈ ప్రాజెక్టుపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
జల రవాణాతో ఎంతో ఆదా..
ప్రస్తుతం సరుకు రవాణా సింహభాగం రోడ్డు మార్గాన జరుగుతోంది. రైల్వే లైన్ అందుబాటులో ఉన్న చోట ఎక్కువగా రైళ్ల ద్వారా సాగుతోంది. రోడ్డు మార్గాన సరుకు రవాణాకు నాలుగు రూపాయలు ఖర్చయితే, రైలు మార్గాన తరలించేందుకు మూడు రూపాయలు వ్యయం అవుతుంది. అదే జల రవాణా ద్వారా అయితే అర్ధ రూపాయితో సరిపోతుందన్నది నిపుణుల మాట.
ఇటీవల ఆ ఊసెత్తని గడ్కరీ..
గతంలో జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రారంభం కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంలో గడ్కరీ గోదావరి ఇన్‌లాండ్ వాటర్ వే గురించి మాట్లాడారు. నాటి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో దీనిపై చర్చించారు. కానీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం దీని ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ‘గతంలో ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ గత నాలుగైదేళ్లుగా దీనిపై ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేవు. మేం మా పని చేసుకుపోతున్నాం. వంతెనలకు ప్రత్యేక డిజైన్ విషయంలో కూడా ఎలాంటి సూచనలు అందలేదు..’ అని జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment