జలరవాణాకు వీలుగా ప్రాజెక్టుల డిజైన్
* కొత్త నమూనాలు సిద్ధం చేయాలని సర్కారు ఆదేశం
* గోదావరి నదిలో నిర్మించే అన్ని నిర్మాణాలపై పునఃసమీక్ష
* పోలవరం డిజైన్‌పై కేంద్రానికి తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జలరవాణాను విస్తరించాలన్న లక్ష్యంతో భారీ ప్రాజెక్టును కేంద్రం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో దానికి రూపురేఖలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గోదావరి నది తెలంగాణకు ప్రధాన జలరవాణా మార్గం కానున్నందున దీనిపై నిర్మాణంలో ఉన్న, కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టుల డిజైన్ మార్చాలని నిర్ణయించింది. అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో గోదావరి న దిని జలరవాణాతో అనుసంధానించనున్నందున రెండు రాష్ట్రాల వైపు ఉన్న ప్రాజెక్టుల డిజైన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జలరవాణా ఏర్పడితే నిరంతరాయంగా పడవలు వచ్చిపోయేందుకు మార్గం అవసరం.
అందుకు తగ్గట్టుగానే నీటి ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణం ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్సీ వరద నీటి కాలువ, దుమ్ముగూడెం ప్రాజెక్టుల డిజైన్‌ను మార్చబోతోంది. ఇక గోదావరిలో భారీ వంతెనల నిర్మాణం జరగనున్నందున వాటి డిజైన్‌ను కూడా పునఃసమీక్షించాలని రోడ్లు భవనాల శాఖను ఆదేశించింది.
పోలవరం డిజైన్‌ను మార్చేలా ఆదేశించండి
ఏపీ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను కూడా ఇందుకు వీలుగా మార్చేలా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి తాజాగా లేఖ రాశారు. వాస్తవానికి గోదావరి నది లో జలరవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండొద్దని ఇప్పటికే గడ్కారీ కేంద్ర ప్రభు త్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మహారాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్న ఆయన.. గోదావరి నదిలో ఆ రాష్ట్రం నుంచి వాణిజ్య ఓడలు చెన్నై వరకు వెళ్లేలా ప్రత్యేక మార్గం ఉండాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇప్పిం చారు. దీంతో తెలంగాణ అభ్యర్థనలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. తుమ్మల లేఖ రాయడంతో వెంటనే ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడారు. జలరవాణా అంశం ప్రస్తుతం పరిశ్రమలు-మౌలిక వసతుల శాఖ పరిధిలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని ఆ శాఖ పరిధిలోకి తెచ్చారు.
అంతకుముం దు రోడ్లు భవనాలు-పోర్టుల శాఖగా ఉండేది. తెలంగాణలో ఓడరేవులు లేకపోవడంతో ఏడాదిగా దాన్ని పట్టించుకోలేదు. తాజాగా కేంద్రం జలరవాణాను తెరపైకి తేవడంతో దానికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే సమాచారం నేరుగా పరిశ్రమల శాఖకు చేరుతోంది. రవాణాతో తమకు సంబంధం లేదంటూ ఆ శాఖ స్పందించడం లేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను రోడ్లు భవనాల శాఖకే అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.