సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ బుధవారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
భూ సేకరణ సరైన సమయంలో కాకపోవడం, పనులు ప్రారంభం కాకపోవడంతో కాంట్రాక్ట్ రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుంది. అదే ఖర్చుతో.. గోదావరి ఫేజ్ 2 స్కీమ్ ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని జలమండలి అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment