Polavaram design
-
నదుల అనుసంధానంపై చర్చించాలి
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానంపై అఖిలపక్షంతో చర్చించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. నేడు (బుధవారం) ఢిల్లీలో జాతీయ జలవనరుల సంస్థ నిర్వహించనున్న సమావేశంలో ప్రభుత్వం తీసుకోబోయే వైఖరిని ముందే ప్రజలకు చెప్పాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నక్క జిత్తులను, కుటిలత్వాన్ని బయటపెట్టేలా వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని టీఆర్ఎస్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పోలవరం డిజైన్‌ను మార్చేందుకు ఒత్తిడి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 40 ఏళ్ల నీటి లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటుండగా.. గోదావరి నదిపై మాత్రం 110 ఏళ్ల నీటి లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటుందని తెలిపారు. నీటి లెక్కల ప్రామాణికతలను సమీక్షించేలా ఒత్తిడి చేయాలన్నారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో ప్రభుత్వం అయోమయంతో ఉందన్నారు. పాసు పుస్తకాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, కంది రైతుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. -
జలరవాణాకు వీలుగా ప్రాజెక్టుల డిజైన్
* కొత్త నమూనాలు సిద్ధం చేయాలని సర్కారు ఆదేశం * గోదావరి నదిలో నిర్మించే అన్ని నిర్మాణాలపై పునఃసమీక్ష * పోలవరం డిజైన్‌పై కేంద్రానికి తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జలరవాణాను విస్తరించాలన్న లక్ష్యంతో భారీ ప్రాజెక్టును కేంద్రం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో దానికి రూపురేఖలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గోదావరి నది తెలంగాణకు ప్రధాన జలరవాణా మార్గం కానున్నందున దీనిపై నిర్మాణంలో ఉన్న, కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టుల డిజైన్ మార్చాలని నిర్ణయించింది. అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్‌తో గోదావరి న దిని జలరవాణాతో అనుసంధానించనున్నందున రెండు రాష్ట్రాల వైపు ఉన్న ప్రాజెక్టుల డిజైన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జలరవాణా ఏర్పడితే నిరంతరాయంగా పడవలు వచ్చిపోయేందుకు మార్గం అవసరం. అందుకు తగ్గట్టుగానే నీటి ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణం ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత-చేవెళ్ల, దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్సీ వరద నీటి కాలువ, దుమ్ముగూడెం ప్రాజెక్టుల డిజైన్‌ను మార్చబోతోంది. ఇక గోదావరిలో భారీ వంతెనల నిర్మాణం జరగనున్నందున వాటి డిజైన్‌ను కూడా పునఃసమీక్షించాలని రోడ్లు భవనాల శాఖను ఆదేశించింది. పోలవరం డిజైన్‌ను మార్చేలా ఆదేశించండి ఏపీ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను కూడా ఇందుకు వీలుగా మార్చేలా ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి తాజాగా లేఖ రాశారు. వాస్తవానికి గోదావరి నది లో జలరవాణాకు ఎలాంటి అడ్డంకులు ఉండొద్దని ఇప్పటికే గడ్కారీ కేంద్ర ప్రభు త్వ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు ఎంతో ప్రాధాన్యమిస్తున్న ఆయన.. గోదావరి నదిలో ఆ రాష్ట్రం నుంచి వాణిజ్య ఓడలు చెన్నై వరకు వెళ్లేలా ప్రత్యేక మార్గం ఉండాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇప్పిం చారు. దీంతో తెలంగాణ అభ్యర్థనలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. తుమ్మల లేఖ రాయడంతో వెంటనే ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా మాట్లాడారు. జలరవాణా అంశం ప్రస్తుతం పరిశ్రమలు-మౌలిక వసతుల శాఖ పరిధిలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాన్ని ఆ శాఖ పరిధిలోకి తెచ్చారు. అంతకుముం దు రోడ్లు భవనాలు-పోర్టుల శాఖగా ఉండేది. తెలంగాణలో ఓడరేవులు లేకపోవడంతో ఏడాదిగా దాన్ని పట్టించుకోలేదు. తాజాగా కేంద్రం జలరవాణాను తెరపైకి తేవడంతో దానికి సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే సమాచారం నేరుగా పరిశ్రమల శాఖకు చేరుతోంది. రవాణాతో తమకు సంబంధం లేదంటూ ఆ శాఖ స్పందించడం లేదు. దీంతో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించే బాధ్యతను రోడ్లు భవనాల శాఖకే అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
'పోలవరం డిజైన్ మార్చటం జరిగే పనికాదు'
న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చటం జరిగే పనికాదని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కొత్త సమస్యలు సృష్టించేందుకే పోలవరంపై రగడ చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, పోలవరం ఆర్డినెన్స్ అంశాలు రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నాయని సుజనా చౌదరి తెలిపారు. దీనిపై ఇప్పుడు కొత్తగా గొడవ చేయాల్సిన పనిలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాజధానిపై నిర్ణయం తీసుకుంది బీజేపీ,టీడీపీలు కాదని సుజనా చౌదరి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైల్వే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి తగ్గట్టుగా ఉందన్నారు. కాగా వచ్చే రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
నిమ్స్‌లో ఎమ్మెల్యే రాజయ్య దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: పోలవరం డిజైన్ మార్చడంతో పాటు ముంపునకు గురయ్యే మండలాలను ఖమ్మంజిల్లాలోనే ఉంచాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్గ ప్రతినిధి బృందం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రాజయ్య వద్దకు మంగళవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ నేతృత్వం లోని ప్రతినిధి బృందం వచ్చింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఉమ్మడిగా కలిసి పోరాటం చేద్దామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోరారని పేర్కొని, రాజయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచటానికి అన్ని రకాల పోరాటాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రులు నాయిని, ఈటెల మీడియాతో చెప్పారు. -
పోలవరం డిజైన్ మార్చేవరకు పోరాటం: తమ్మినేని
హైదరాబాద్: పోలవరం డిజైన్ మార్చేవరకు పోరాటం చేస్తామని తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రంలో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం దిశగా పనిచేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత అభివృద్దిపై, ప్రజాహక్కులపై పార్టీ దృష్టిసారిస్తుందన్నారు. రైతులకు జూన్ 15 వరకు పంటరుణాలు ఇచ్చి ఎరువుల కొరత లేకుండా చూడాలని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి తమ్మినేని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొటామని.. తమ పార్టీ తరపున సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.