
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధానంపై అఖిలపక్షంతో చర్చించాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు. నేడు (బుధవారం) ఢిల్లీలో జాతీయ జలవనరుల సంస్థ నిర్వహించనున్న సమావేశంలో ప్రభుత్వం తీసుకోబోయే వైఖరిని ముందే ప్రజలకు చెప్పాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నక్క జిత్తులను, కుటిలత్వాన్ని బయటపెట్టేలా వ్యవహరించాలని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని టీఆర్‌ఎస్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
పోలవరం డిజైన్‌ను మార్చేందుకు ఒత్తిడి చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 40 ఏళ్ల నీటి లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటుండగా.. గోదావరి నదిపై మాత్రం 110 ఏళ్ల నీటి లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటుందని తెలిపారు. నీటి లెక్కల ప్రామాణికతలను సమీక్షించేలా ఒత్తిడి చేయాలన్నారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో ప్రభుత్వం అయోమయంతో ఉందన్నారు. పాసు పుస్తకాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, కంది రైతుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.