సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఓ వైపు ఓటమి, మరోవైపు నేతలు వరుసపెట్టి పార్టీనీ వీడటంతో ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ అయిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఆ పార్టీ సీనియర్, ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా హస‍్తాన్ని వీడనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఘోర ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఏఐసీసీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యాలు కూడా చేశారు. అంతేకాకుండా గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మొండి చేయి ఎదురు కావడంతో పాటు, కాంగ్రెస్‌లో తగిన గుర్తింపు లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. కొద్దిరోజుల క్రితం పొంగులేటి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు పొంగులేటి కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ...ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం విదితమే. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment