ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న సుధాకర్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆయన పంపించారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సుధాకర్‌రెడ్డి పార్టీలో ఇమడలేక, జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవటం లేదన్న మనస్తాపంతో ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పార్టీకి రాజీనామా చేసిన పొంగులేటి వెనువెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి సుమారు అర్ధగంట సేపు సమావేశమయ్యారు. అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. అనేక సందర్భాల్లో చేతిదాకా వచ్చిన టికెట్ చేజారినా.. దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఆయన పార్టీలోని పరిణామాలపై అంతర్లీనంగా మధనపడ్డారు తప్ప పార్టీ మారేందుకు ప్రయత్నించలేదు.
1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్‌రెడ్డి ఎన్నికల్లో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత ఖమ్మం లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆయన పార్టీ పరంగా తీవ్రస్థాయిలో ప్రయత్నం చేసినా ఫలించలేదు. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేశారు. టికెట్ తనకు దక్కుతుందని భావించిన తరుణంలో ఈ స్థానాన్ని ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీకి కేటాయించి కాంగ్రెస్ మద్దతు పలికింది.
అయినా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తన విన్నపాన్ని పరిగణనలోకి తీసుకొని ఖమ్మం స్థానం తనకు కేటాయిస్తుందని చివరి నిమిషం వరకు ఎదురుచూసి టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నం చేసిన సుధాకర్‌రెడ్డి ఖమ్మం లోక్‌సభ సైతం చేజారటంతో తీవ్ర కలత చెందినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తనను కాదని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరికి టికెట్ కేటాయించటంతో కినుక వహించిన పొంగులేటి.. ఆమె నామినేషన్ దాఖలు ప్రక్రియ, ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి హాజరుకాలేదు.
వి.హన్మంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, మల్లు భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్ వంటి నేతలు హాజరైన సుధాకర్‌రెడ్డి రాకపోవటం ఆ సమయంలోనే పార్టీ వర్గాల్లో అనుమానాలు రేకెత్తాయి. గతంలో కొత్తగూడెం, సత్తుపల్లి శాసనసభ స్థానాలకు, హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా, గాంధీ కుటుంబానికి వీర వీధేయుడిగా పేరొందిన సుధాకరెడ్డి పార్టీ మారాల్సిన పరిస్థితులు కలగటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2008నుంచి ఇప్పటి వరకు రెండు పర్యాయాలు శాసనమండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటికి ఈ నెలలో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. మరోసారి శాసనమండలి సభ్యత్వం కోసం తీవ్ర ప్రయత్నం చేసిన కాంగ్రెస్ శాసనమండలిలో ఒకే ఒక స్థానం లభించే అవకాశం ఉండటం, అది సైతం చివరి సమయంలో చేజారింది.
దీంతో మరింత ఆవేదనకు గురైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదని భావించి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో అనేక మంది ముఖ్యమంత్రులకు సన్నిహితుడన్న పేరుంది. ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అ«ధ్యక్షుడిగా, ఏఐసీసీ కార్యదర్శిగా, పలు రాష్ట్రాల ఇన్‌చార్జిగా, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, సీఎల్పీ ఉపనేతగా ఆయన పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment