Buckingham Canal
-
జల రవాణా ప్రాజెక్టు పట్టాలెక్కేనా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదితో బకింగ్ హామ్ కాలువను పునరుద్ధరించటం ద్వారా అనుసంధానించి జల రవాణా చేపట్టాలన్న ప్రణాళిక పట్టాలెక్కేలా లేదు. మహా రాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.. నాలుగు రాష్ట్రాలతో ముడిపడిన ఈ అద్భుత ప్రాజెక్టు ద్వారా సరుకు రవాణా ఖర్చును నాలుగో వంతుకు తగ్గించే గొప్ప అవకాశం చేజారిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. నదుల అనుసంధానం ద్వారా జల రవాణాకు ఊతమివ్వనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాతి క్రమంలో దీనిపై మౌనం దాల్చడమే ఇందుకు కారణం. డీపీఆర్ తయారీ కసరత్తు వరకు హడావుడిగా జరిగినా, ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో అడుగు ముందుకు పడలేదు. జలరవాణాకు, ముఖ్యంగా గోదావరి నదిలో కారిడార్ ఏర్పాటుకు విఘాతం లేని విధంగా, నదిపై నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పుడు దానితో ప్రమేయం లేకుండా పనులు జరుగుతున్నాయి. వీటివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు చేపడితే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కేంద్రం జోక్యం చేసుకోకపోవడంతో ఊరించిన జలరవాణా ప్రాజెక్టు అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంటీ ప్రాజెక్టు.. గోదావరి నదిలో సరుకు రవాణాకు వీలుగా ప్రత్యేక కారిడార్ ఏర్పాటును 2015లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. తన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర మీదుగా చెన్నై వరకు సరుకులు తరలించేలా ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు గోదావరి ప్రవహిస్తోంది. దీనిని అతిపురాతన బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా అతిపెద్ద ఓడ రేవు ఉన్న చెన్నైతో అనుసంధానిస్తే సరుకు రవాణాలో సరికొత్త విప్లవం వస్తుందని గడ్కరీ యోచించారు. నిపుణులతో సర్వే చేయించారు. బ్రిటిష్ పాలనలో కాకినాడ నుంచి తమిళ నాడులోని విల్లుపురం వరకు 796 కి.మీ. మేర బకింగ్‌హామ్ కెనాల్‌ను నిర్మించారు. అప్పట్లో ఈ కాలువను సరుకు రవాణాకు ముమ్మరంగా వాడారు. స్వాతంత్య్రానంతరం దీని ప్రాభవం క్రమంగా తగ్గిపోయింది. తాజాగా దీన్ని పునరుద్ధరించటం ద్వారా పులికాట్ సరస్సుకు అనుసంధానించి పుదుచ్చేరి వరకు విస్తరించాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది. గోదావరిని ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం (గోదావరి చివరి బ్యారేజీ) నుంచి కృష్ణా కెనాల్ ద్వారా కృష్ణా నదికి, అక్కడి నుంచి కొమ్ముమూరు కెనాల్ (గుంటూరు జిల్లా దుగ్గిరాల) ద్వారా (ప్రకాశం జిల్లా పెదగంజాం వద్ద) బకింగ్‌హామ్ కెనాల్‌కు అనుసంధానించాలన్నది ప్రతిపాదన. ఈ మేరకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడ ఎలా అనుసంధానించాలో వివరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. కానీ ఇప్పుడు ఆ అంశం మరుగున పడిపోవడం సందేహాలకు తావిస్తోంది. సందేహాలకు తావిస్తున్న వంతెనల నిర్మాణం పడవలు నడవాలంటే నదిలో ఎప్పుడూ నీటి నిల్వ ఉండాలి. కానీ గోదావరిలో భద్రాచలం సహా చాలా ప్రాంతాల్లో వేసవిలో నీళ్లు ఇంకిపోతుంటాయి. అందువల్ల జల రవాణాకు వీలుగా ప్రత్యేకంగా కారిడార్‌ను నిర్ధారించి ఛానెల్ ఏర్పాటు ద్వారా అన్ని సమయాల్లో నిర్ధారిత పరిమాణంలో నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నది దాటేందుకు నిర్మించే వంతెనలు పడవల రాకపోకలకు ఆటంకం కలిగించకుండా ప్రత్యేక డిజైన్‌ను ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు ఆ డిజైన్‌తో సంబంధం లేకుండా పలుచోట్ల వంతెనల పనులు జరుగుతుండటం ఈ ప్రాజెక్టుపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. జల రవాణాతో ఎంతో ఆదా.. ప్రస్తుతం సరుకు రవాణా సింహభాగం రోడ్డు మార్గాన జరుగుతోంది. రైల్వే లైన్ అందుబాటులో ఉన్న చోట ఎక్కువగా రైళ్ల ద్వారా సాగుతోంది. రోడ్డు మార్గాన సరుకు రవాణాకు నాలుగు రూపాయలు ఖర్చయితే, రైలు మార్గాన తరలించేందుకు మూడు రూపాయలు వ్యయం అవుతుంది. అదే జల రవాణా ద్వారా అయితే అర్ధ రూపాయితో సరిపోతుందన్నది నిపుణుల మాట. ఇటీవల ఆ ఊసెత్తని గడ్కరీ.. గతంలో జాతీయ రహదారుల విస్తరణ పనుల ప్రారంభం కోసం తెలంగాణకు వచ్చిన సందర్భంలో గడ్కరీ గోదావరి ఇన్లాండ్ వాటర్ వే గురించి మాట్లాడారు. నాటి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో దీనిపై చర్చించారు. కానీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం దీని ప్రస్తావన తేకపోవడం గమనార్హం. ‘గతంలో ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ గత నాలుగైదేళ్లుగా దీనిపై ఎలాంటి ఆదేశాలు, సూచనలు లేవు. మేం మా పని చేసుకుపోతున్నాం. వంతెనలకు ప్రత్యేక డిజైన్ విషయంలో కూడా ఎలాంటి సూచనలు అందలేదు..’ అని జాతీయ రహదారుల విభాగం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
నాడు కక్కుర్తి.. నేడు హైడ్రామా.. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పాలి‘ట్రిక్స్’
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.. ఆ పార్టీ అధినేత దగ్గర నుంచి పార్టీ నాయకుల వరకూ ఒకటే తీరు. నాడేమో కాసుల కోసం కక్కుర్తి పడి..కావల్సిన వారికి కాంట్రాక్ట్ అప్పజెప్పి..పనులు వేగంగా జరుగుతున్నాయని ఆర్భాటంగా ప్రచారాలు చేసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారలేదు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా కొత్తపట్నం వంతెనపై క్షుద్ర రాజకీయానికి తెరతీశారు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..బకింగ్‌హామ్ కెనాల్ సాక్షిగా ఆయన చేస్తున్న డ్రామా పలు విమర్శలకు తావిస్తోంది. సాక్షి, ఒంగోలు: ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు కడుపుమంట పుడుతోంది. అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. నాడు కమీషన్లకు కక్కుర్తిపడి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి బకింగ్ హాం కెనాల్ బ్రిడ్జి కాంట్రాక్టు పనులు అప్పగించారు.. పనులు వేగంగా జరుగుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు... ఇతని రాజకీయ డ్రామాలు తెలుసుకున్న ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెట్టారు.. దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ప్రజలపై ఉన్న కోపమో, బాలినేనిపై అక్కసో తెలియదు గానీ పేదల ఇళ్లు దగ్గర నుంచి ఎన్నో పనులకు అడ్డుపడుతూనే ఉన్నారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో జనార్దన్ హైదరాబాద్‌కు, బెంగళూరుకు పరిమితమయ్యారు తప్ప, వారి ఇబ్బందిని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఎమ్మెల్యే బాలినేని మాత్రం నిత్యం ప్రజలతో ఉంటూ జీజీహెచ్‌లో వంద పడకలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఆక్సిజన్, మందులు, భోజనం ఉచితంగా అందించడమే కాక, నగర ప్రజలందరికీ నిత్యవసర వస్తువులు అందిస్తూ వారితో మమేకమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక దామచర్ల జనార్దన్ అండ్ కో బాలినేనిపై ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ మరో రాజకీయ డ్రామాకు తెరతీశారు. అసలు బ్రిడ్జి నిర్మాణం విషయానికొస్తే జనార్దన్ జేబులు నింపుకోవడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప, ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని కొత్తపట్నంతోపాటు, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్న పరిస్థితి. బ్రిడ్జి పనులు చేస్తున్నది తాను అప్పగించి.. తమ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్ అయినప్పటికీ బాలినేనిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ విఫలమయ్యారు. తాజాగా మరోసారి బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్ ప్రస్తుతం సైతం పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ వద్ద కమీషన్లకు దామచర్ల జనార్దన్ కక్కుర్తి పడ్డా..బాలినేని మాత్రం బ్రిడ్జి వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ వచ్చారు తప్ప, కాంట్రాక్టర్‌ను ఎక్కడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయని గ్రహించిన బాలినేని పనులు వేగవంతం చేయాలని, లేదంటే చర్యలు తప్పవంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. దీన్ని గమనించిన జనార్దన్ త్వరలో పనులు పూర్తవుతాయని తెలుసుకుని రాజకీయ డ్రామాకు తెరతీశారు. బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టి తన ఆందోళన కారణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే కలరింగ్ ఇచ్చుకునే కుయుక్తులకు పథక రచన చేస్తున్నారు. చదవండి: (పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు) కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు సక్రమంగా పనులు జరగలేదని తెలిసినా బ్రిడ్జిని రాజకీయంగా తన రాజకీయ డ్రామాకు వాడుకునే ప్రయత్నం చేస్తుండటంపై ప్రజలు సైతం ఛీ కొడుతున్నారు. సొంత పార్టీలో ఉన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ఏవో ఉద్యమాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆపార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తుండటం గమనార్హం. బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసి ఈనెల 20వ తేదీన ట్రయల్‌రన్ నిర్వహించేందుకు ఆర్అండ్బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈనెల 20 తరువాత వాహనాల రాకపోకలను బ్రిడ్జిపై అనుమతించి చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే వాటిని అతి త్వరలోనే పూర్తి చేస్తామంటూ అధికారులు చెబుతుండటం విశేషం. బ్రిడ్జి పనులు పూర్తయ్యే సమయంలో జనార్దన్ చేస్తున్న రాజకీయ డ్రామాలు ప్రజలందరికీ తెలుసని, చీప్ పాలిటిక్స్ చేస్తూ జనార్దన్ ప్రజల్లో మరింత చులకనవుతారని గుర్తించాలని పలువురు హెచ్చరిస్తున్నారు. కరోనాతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నా వారి ప్రాణాలు పోతున్నా కనీసం స్పందించని జనార్దన్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లు చూపించే కుయుక్తులకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆటంకాలు కలిగించకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలా.. ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌హాం కెనాల్‌పై వంతెన నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ వద్ద మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్ కమీషన్లు దండుకొని రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారు. 2016లో మంజూరైన బ్రిడ్జి పనులు టీడీపీ ప్రభుత్వంలో మూడున్నర సంవత్సరాలపాటు కమీషన్ల కోసం కాలయాపన చేస్తూ నిర్మాణ పనులను నిర్వీర్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులతో ప్రారంభమైన పనులు, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమును రద్దు చేసిన సంగతి తెలిసి కూడా జనార్దన్ ప్రజలను మభ్యపెట్టే పనులు చేపట్టడం ఏదో సానుభూతి పొందాలని తప్ప ప్రజలకు మేలు చేద్దామని కాదు. నిర్మాణ పనులు పూర్తవుతున్న బ్రిడ్జి వద్దకు వెళ్లి ఏదో నిరసన వ్యక్తం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఆయన హడావుడి చేసినందు వల్ల పనులు వేగంగా జరిగాయని బిల్డప్ ఇచ్చుకోవాలని చూస్తున్నాడు. అయితే నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ట్రయల్ రన్ పూర్తి చేసి అనంతరం బ్రిడ్జిపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగిస్తాం. – బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, ఒంగోలు -
దొంగతనం చేశావంటూ వేధింపులు.. దాంతో
తాడేపల్లి రూరల్: ఓ విద్యార్థినిని తోటి విద్యార్థులు దొంగతనం చేశావంటూ వేధింపులకు గురిచేయడం, ఆ విషయం కళాశాలలో ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని శనివారం సీతానగరం అమరావతి కరకట్ట వెంట ఉన్న బకింగ్ హామ్ కెనాల్లో దూకేందుకు యత్నించింది. అది గమనించిన మంగళగిరి హోంగార్డు డేనీ అలియాస్ దానయ్య ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్ పడవలరేవులో నివాసముంటూ లారీ డ్రైవర్‌గా పనిచేసే నాదెండ్ల రమేష్ పెద్దకుమార్తె సుమలత విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. కళాశాలలో శుక్రవారం వేరే విద్యార్థిది ఫోన్ పోవడంతో, సుమలతే తీసిందంటూ తోటి విద్యార్థులు ఆమెను అవమానించి ఆపై అసభ్యంగా మాట్లాడారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్‌కు సుమలత తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ‘కాలేజీకి వెళితే తోటి విద్యార్థులు చులకనగా చూస్తారు, వెళ్లకపోతే అమ్మానాన్న తిడతారు, అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా’ అని విద్యార్థిని పోలీసులకు తెలిపింది. జరిగిన ఘటనపై తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించి, విద్యార్థినిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
‘నీటి’ మీద రాతేనా!
జలరవాణాకు కేంద్రం నీళ్లొదిలిందా..? ఇప్పటివరకూ చేసిన ప్రతిపాదనలన్నీ నీటి మీద రాతలేనా..? అంటే ప్రస్తుత పరిణామాలను బట్టి అవుననే సమాధానమే వస్తోంది. గతంలో దీనిపై సర్వే కూడా పూర్తిచేసిన అధికారులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి): జలరవాణా మార్గం అభివృద్ధిని కేంద్రం పక్కన పెట్టేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది జలరవాణా కోసం జిల్లాలో కాలువల తవ్వకం జరగాల్సి ఉన్నా, ఆ ఊసే లేకుండా పోయింది. దాదాపుగా రెండేళ్ల క్రితం దీని కోసం జిల్లాలో సర్వే సంస్థలు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేసి ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలో మార్కింగ్ ప్రక్రియను పూర్తిచేశాయి. కాకినాడ, చెన్నై మధ్య బకింగ్‌హాం కాలువ పరిధిలోని ఉప కాలువలను విస్తరించి, వంతెనలను కొన్నింటిని తొలగించి, మరికొన్నింటిని ఎత్తు పెంచి జలరవాణాను పునరుద్ధరించాలనేది కేంద్రం ఉద్దేశం. 2017 నవంబరు 29 నాటికే దీనికోసం సర్వే పూర్తయ్యింది. నివేదికలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరుల శాఖ ద్వారా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి వెళ్లాయి. అయితే ఆ తర్వాత ఇంతవరకూ ఆ పనుల్లో కదలిక లేదు. గతంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దీనిపై నానా హడావుడి చేసింది. జలరవాణాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రచారం చేసింది. కానీ ఇప్పటివరకూ పురోగతి లేదు. జలరవాణా ఫైలు మూలకు చేరినట్టు ఆ శాఖ అధికారుల సమాచారం. అవగాహన కార్యక్రమాలతో సరి! జిల్లాలో ఏలూరు నుంచి విజ్జేశ్వరం వరకు ఎనిమిది మండలాలు, 37 గ్రామాల పరిధిలో జలరవాణా విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. కాలువల తవ్వకం, వెడల్పు కోసం 2547.13 ఎకరాల భూ సేకరణ చేయాలని తలంచారు. ఐడీఎల్ ఏజెన్సీ ద్వారా పులిచింతల ప్రాజెక్టు డివిజన్ –02 అధికారుల పర్యవేక్షణలో సర్వే కూడా పూర్తిచేశారు. ఏయే రైతుల భూమి సేకరించాల్సి ఉంటుంది? రైతులు ఎంత పరిహారం కోరుతున్నారు? వంటి అంశాలపై అవగాహనకు వచ్చారు. ప్రభుత్వ భూములు మినహా. ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి 1550 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనావేశారు. రైతులతోనూ అవగాహన సదస్సులు నిర్వహించారు. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ అంశం మరుగున పడింది. భూసేకరణకు రూ.700 కోట్లు జిల్లాలో కాలువల తవ్వకం, వెడల్పు కోసం భూసేకరణకు సుమారు రూ.700 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అధికారులు అంచనావేశారు. రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను జలరవాణా కోసం ఉచితంగా ఇవ్వడానికి అప్పట్లో ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2018 మేలో కాలువల విస్తరణ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నా, ఆ జాడ లేకుండా పోయింది. ఆరా తీస్తే జలరవాణాను కేంద్రం పక్కన పెట్టిందని, జలరవాణా ప్రతిపాదనలకు అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో కేంద్రం నిధులు లేవని చేతులెత్తేసిందని ప్రచారం జరిగింది. ఆ పనుల ఊసేలేదు జాతీయ జలరవాణా పనుల గురించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ లేవు. గతంలో భూసేకరణ నిమిత్తం చేసిన మార్కింగ్‌ల తర్వాత ఏ పనీ జరుగలేదు. కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలను ఇస్తే తదనంతర పనులపై దృష్టిసారిస్తాం. – సత్యదేవ, ఇరిగేషన్ డీఈ, తాడేపల్లిగూడెం మెరుగైన నిర్ణయం ఉంటుంది జలరవాణాపై రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన నిర్ణయం తీసుకుంటుంది. ప్రతిపాదనలను మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో అధ్యయనం చేసి ఎలా ముందుకెళ్లాలో మార్గదర్శకాలు ఇస్తుంది. – కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం -
పునరుద్ధరిస్తే బ‘కింగే’!
సాక్షి, ఒంగోలు: శతాబ్దాల చరిత్ర గల బకింగ్‌హాం కెనాల్ బ్రిటీష్ పాలకుల కాలంలో ఒక వెలుగు వెలిగింది. బంగాళాఖాతం సమద్ర తీరంలో లాంచీలు, బోట్లు, పడవలు ముమ్మరంగా తిరిగేవి. తీరం వెంబడి కళకళలాడుతూ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందేది. ఆ వైభవం కాలక్రమేణా మసకబారింది. అప్పటి పరిస్థితులు మళ్లీ తిరిగి రావాలంటే బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్ధరించాలి. అప్పుడే తిరిగి జలరవాణాకు మార్గం సుగమం అవుతుంది. బకింగ్‌హాంలో జలరవాణా ప్రారంభమైతే రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. పోర్టుల అనుసంధానంతో విశాఖ–చెన్నై కోస్తా కారిడార్‌కు కూడా లాభం చేకూరుతుంది. విశాఖ–చెన్నై కోస్తా కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాంతో పాటు బకింగ్‌హాం కెనాల్‌ను కూడా అభివృద్ధి చేస్తే అన్ని విధాల సముద్ర తీర ప్రాంతం ఎంతగానో అభివృద్ధికి నోచుకుంటుంది. తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి. మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. ఉపరితల రవాణాతో పోలిస్తే జలరవాణాకు ఖర్చు నామమాత్రం కావడంతో రవాణా ఖర్చు తగ్గి ఆదాయ వనరులు మరింతగా పెరుగుతాయి. మొత్తంగా జలరవాణా మరింత అభివృద్ది సాధించి తద్వారా త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి చెందటానికి దోహద పడుతుంది. కుచించుకుపోయిన కాలువ... చెన్నై నుంచి కాకినాడ వరకు ఉన్న బకింగ్‌హాం కాలువ దాదాపు కుచించుకుపోయింది. సరాసరి 100 మీటర్లు ఉండాల్సిన కాలువ ప్రస్తుతం 10 మీటర్లు కూడా లేదంటే కాలువ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతుంది. శిథిలావస్థకు చేరి ఆక్రమణ దారుల కబంధ హస్తాల్లో బకింగ్‌హామ్ చిక్కుకు పోయింది. ప్రకాశం జిల్లా పరిధిలోని సింగరాయకొండ, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లితో పాటు కందుకూరు పరిధిలో పెద్దపట్టపుపాలెం, కరేడు, చాకిచర్ల, గుండ్లూరు పరిధిలో మూర్తింపేట, ఆవులవారిపాలెం, మొండివారిపాలెంతోపాటు చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో అనేక మంది కాలువను ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేశారు. బకింగ్‌హాం కెనాల్ పొడవు 427 కి.మీ.. బకింగ్‌హామ్ కెనాల్ పొడవు 427 కి.మీ. కృష్ణా, గోదావరి డెల్టాలను కలుపుతూ ఈ కాలువ కొనసాగుతుంది. కొన్ని చోట్ల సముద్రానికి మూడు మైళ్ల దూరంలోనూ, ఎక్కువభాగం అరకిలోమీటర్ దూరంలోనూ ఉండడం విశేషం. కొంత భాగం పులికాట్ సరస్సు పరిధిలోనూ ఉంది. బకింగ్‌హామ్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాలువ. 1806లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కో క్రైన్స్ అనే వ్యక్తి ఈ కాలువను లీజుకు తీసుకున్నాడు. దీంతో కొంత కాలం ఆయన పేరుమీదే కోక్రైన్స్ కెనాల్ అని పిలిచారు. లీజుకు తీసుకున్న ఆయన ఓడల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. 1837లో బ్రిటీష్ ప్రభుత్వం దీనిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ కాలువ పనులను అప్పటి గవర్నర్ డ్యూక్ బకింగ్‌హాం పర్యవేక్షణలో జరగడంతో ఈ కాలువకు బకింగ్‌హాం కెనాల్ అని పేరు వచ్చింది. బంగాళాఖాతం తీరానికి ఒక కిలో మీటర్ దూరంలో ఆంధ్రాలోని కాకినాడ నుంచి చెన్నైలోని విల్లీపురం వరకు కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ ఆంధ్ర ప్రదేశ్‌లో 262 కిలో మీటర్లు, తమిళనాడులో 165 కిలో మీటర్లు పొడవు ఉంది. జోరుగా జల రవాణా... సముద్ర కెరటాల ఆధారంగా వచ్చే పోటు.. పాటు ద్వారా నౌకల ప్రయాణం సులువుగా ఉంటుంది. కాలువ మధ్య, మధ్యలో పటిష్టమైన భారీ కొయ్య చెక్కలతో తయారు చేసిన గేట్లు ఏర్పాటు చేశారు. ఈ పోటు, పాటు ద్వారా వచ్చే అలలు ఉధృతికి నౌకలు, పడవలు వేగంగా వెళ్లేవి. తద్వారా ఇంధనం ఆదా ఎక్కువగా అయ్యేది. మొదటగా కాకినాడ పోర్టు నుంచి వివిధ వస్తువుల రవాణా తక్కువ ఖర్చుతో చెన్నైకి చేరవేసేవారు. రోజుకు 12.5 మిలియన్ టన్నుల సరుకు రవాణా అయ్యేది. శ్రీహరికోట నుంచి మద్రాసుకు వంట చెరుకును పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు. కాలువ ఒడ్డున మద్రాసు నుంచి కాకినాడ వరకు 50కి పైగా ట్రావెల్ బంగ్లాలు నిర్మించారు. కాలువ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. తీరం పొడవునా దాదాపు 150 మందికి పైగా ఇన్స్పెక్టర్లు కాలువ ప్రవాహ వేగాన్ని సమీక్షిస్తూ ప్రతి రోజూ బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవారు. కాలువ మధ్యలోని గేట్లు వద్ద మరికొంతమంది సిబ్బంది కూడా విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆ బకింగ్‌హాం కాలువ సిబ్బందిని ప్రస్తుతం నీటిపారుదల శాఖలో విలీనం చేశారు. కోల్పోయిన ప్రాభవం... క్రమంగా రైల్వే వ్యవస్థ రావడంతో బకింగ్‌హాం కెనాల్ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఆతరువాత ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో బకింగ్‌హాం కెనాల్ పూర్తిగా శిథిలావస్థకు చేరి గత వైభవ చిహ్నానికి ప్రతీకగా నిలిచింది. క్రమేణ కాలువ కొన్ని చోట్ల కనుమరుగై మరి కొన్ని చోట్ల కుంచించుకుపోయింది. 1960, 1970 దశకాల్లో వచ్చిన తుఫాన్లు కాలువను పాక్షికంగా దెబ్బతీశాయి. 2004 సునామీతో కాలువ పూర్తిగా దెబ్బతింది. సునామీ ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా బకింగ్ హామ్ కెనాల్ ఉపయోగపడిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. పునరుద్ధరిస్తే ఎంతో మేలు... బకింగ్‌హామ్ కెనాల్‌ను పునరుద్ధరిస్తే నేటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపయోగాలు ఉన్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే డీజిల్ రేట్లు పెరిగాయి. ఉపరితల రవాణా భారంగా మారింది. ట్రాఫిక్ ఇబ్బందులు సైతం ఇబ్బడి ముబ్బడిగా తలెత్తుతున్నాయి. బకింగ్‌హాం కెనాల్‌ను పునరుద్దరిస్తే రవాణా ఖర్చు తగ్గడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు సగానికి సగం తగ్గుతాయి. మరోవైపు సునామీ లాంటి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా బకింగ్ హామ్ కెనాల్ ఉపయోగపడుతుంది. 70 ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు బకింగ్‌హాం కెనాల్‌ను 70 ఏళ్లుగా పట్టించుకున్న వారే లేకుండా పోయారు. కాలువలో జల రవాణా లేకపోవడంతో అభివృద్ధి కోసం ఎలాంటి నిధుల కేటాయింపులు ఇవ్వడం లేదు. కాలువలోని లాకుల గేట్ల వద్ద ఉన్న పరిమిత సిబ్బందితో కలపను కాపాడుతున్నాం. లాకుల వద్ద ఉన్న క్వార్టర్స్ శిథిలమయ్యాయి. కాలువ నాలుగింతలకు పైగా ఆక్రమణకు గురైంది. ఆక్రమణలు తొలగించే విషయంపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. సిబ్బంది పదవీ విరమణ చేస్తే కొత్తవారిని నియమించే వీలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – శివరామ్‌ప్రసాద్, బకింగ్‌హాం కెనాల్ డీఈ -
బకింగ్హమ్ కెనాల్ లో ముగ్గురి గల్లంతు
తాడేపల్లి: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి మండలం సీఎం నివాసానికి వెళ్లే దారిలో ఉన్న బకింగ్ హమ్ కెనాల్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు కెనాల్ లో చేపలు పట్టడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికలు గమనించి యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బకింగ్హాంకు విముక్తి లభించేనా ?
అనుమానంగా ఆక్రమణల తొలగింపు నాలుగు నెలల క్రితమే సర్వే పూర్తి తదుపరి చర్యలు కరువు కాలువ భూముల్లో జోరుగా రొయ్యల సాగు జలరవాణా పరంగా ఓ వెలుగు వెలిగిన బకింగ్‌హాం కాలువకు పూర్వవైభవం రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. కాలువకు మహర్దశ పట్టించి జల రవాణాను పునరుద్ధరిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం తడబడుతోంది. సర్వేల పేరుతో కాలయాపన చేస్తుండటంతో కాలువ ఆక్రమణ దారుల కబంద హస్తాల్లో చిక్కుకుపోయింది. ఓ వైపు ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు, పాలకులు చెబుతున్నా మరోవైపు కాలువ భూముల్లో రొయ్యల సాగు జోరుగా సాగుతోంది. వాకాడు: బకింగ్‌హాం కాలువ రోజురోజుకూ బక్కచిక్కిపోతోంది. ఆధునికీకరణ పేరుతో కేంద్రప్రభుత్వం చేపట్టిన సర్వే పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆక్రమణల జోలికి వెళ్లకపోవడం పాలకుల చిత్తశుద్ధిని శంకిస్తోంది. ఒకప్పుడు జల రవాణాలో కీలకప్రాత పోషించిన ఈ కాలువ ఆ తర్వాత కాలంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై ఆక్రమణల్లో చిక్కుకుపోయింది. బ్రిటిష్ దొర బకింగ్ హామ్ జలరవాణా కోసం 1896లో కాకినాడ నుంచి చెన్నై వరకు ఆ కాలువను నిర్మించారు. బకింగ్‌హాం కాలువకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు గోదావరి కాలువగా, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి విజయవాడ వరకు ఏలూరు కాలువగా, విజయవాడ నుంచి పెదగంజాం లాకుల వరకు కొమ్మమూరు కాలవగా, పెద్ద గంజాం నుంచి రాష్ట్ర సరిహద్దు తడ వరకు బకింగ్‌హామ్ కాలువ, ఉప్పు కాలవగా పిలుస్తారు. 100 మీటర్ల వెడల్పు ఉండాల్సిన ఈ కాలవ ప్రస్తుతం 10 మీటర్లకు కుంచించుకుపోయింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కాలువను ఆధునికీకరించి జలరవాణాను పునరుద్ధరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సర్వే బృందాలు ఎనిమిది నెలలుగా అత్యాధునిక గ్లోబల్ జీపీఎస్ టెక్నాలజీతో సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ప్రక్రియ ఏప్రిల్‌లో ముగిసింది. కాలువకు సంబంధించిన వేలాది ఎకరాల భూమి ఆక్రమణలో ఉన్నట్లు సర్వేలో తేలినట్లు సమాచారం. అనేక అవాంతరాల తర్వాత.. బకింగ్‌హాం కాలువ పునరుద్ధరణకు అనేక సార్లు ప్రయత్నాలు జరిగాయి. దేశీయ జలమార్గాలను పునరుద్ధరించాలని ఇన్లాండ్ వాటర్ హౌస్ అథారిటీ ‘ఇవ్వా’ చేసిన ప్రతిపాదనలను అమలుచేయాలని 1994లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. సర్వే బాధ్యతలను రైట్స్ ఇండియా సంస్థకు అప్పగించాయి. అయితే అప్పట్లో సర్వేప్రక్రియ కాగితాలను దాటలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు సర్వే చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు గత ఏడాది కావలి మండలం చెన్నాయపాళెం వద్ద సర్వే ప్రారంభించాయి. ఆరంభంలో నత్తనడకన సాగిన సర్వే తర్వాత వేగం పుంజుకుంది. కావలి నుంచి ఊటుకూరు వరకు ఓ బిట్‌గా, కుడిపాళెంలోని పెన్నానది తీరం నుంచి ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వరకు మరోబిట్గా, కృష్ణపట్నం నుంచి తడ వరకు మూడో బిట్‌గా విడగొట్టి సర్వే పూర్తి చేశారు. సర్వే నివేదికలతో ఆక్రమణల వివరాలను మొదట విజయవాడలోని హెడ్ ఆఫీస్‌కి పంపి అక్కడ పరిశీలన అనంతరం ఆయా మండలాల రెవిన్యూ అధికారులకు పంపాలి. అయితే సర్వే పూర్తయి నాలుగు నెలలు దాటుతున్నా ఆక్రమణల వివరాలు బయటకు రాకపోవడం, ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వకపోవడం, కనీసం హద్దు రాళ్లు కూడా నాటకపోవడం పాలకుల చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు వాకాడు మండలంలోని బకింగ్హాంకాలువ భూముల్లో వెనామీ రొయ్యల సాగు ఇష్టారాజ్యంగా సాగుతోంది. సర్వే అలైన్మెంట్ పూర్తి చేశాం: వీరకుమార్, డీఈ, బకింగ్‌హాం కెనాల్ నాలుగు నెలల క్రితమే సర్వే అలైన్మెంట్ పూర్తి చేశాం. దానికి సంబంధించిన నివేదికలను విజయవాడకు పంపాం. అక్కడ ఆమోదం లభించిన తర్వాత మిగిలిన దశ పనులు ప్రారంభమవుతాయి. -
బకింగ్‌హాం కెనాల్లో రైల్వే ఉద్యోగి గల్లంతు
దుగ్గిరాల/తెనాలి రూరల్: తెనాలి పట్టణానికి చెందిన ఓ రైల్వే ఉద్యోగి దుగ్గిరాల లాకు వద్ద కృష్ణా పశ్చమ ప్రధాన కాలువలో సోమవారం గల్లంతయ్యాడు. ఆదివారం నిర్వహించుకున్న మీలాదున్ నబీకి సంబంధించిన పూలను నీటిలో నిమజ్జనం చేసే ప్రయత్నంలో కాలుజారి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి గంగానమ్మపేటలోని సాయి అపార్ట్మెంటులో నివాసం ఉంటున్న పట్టణానికి చెందిన షేక్ ఫరీద్‌బాషా (34) రైల్వే డ్రైవర్‌గా విజయవాడలో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై విజయవాడవెళ్తూ, మార్గంమధ్యలో దుగ్గిరాల పాతలాకు వద్ద ఆగాడు. లాకు తూముల వద్ద కాలువ కట్టపై బైక్, అతని బ్యాగు ఉంచి కాలువ ఒడ్డుకు వెళ్లాడు. పూలు కాలువలో వదులుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలోపడి గల్లంతయ్యాడు. కాలువ నీటిలో మునిగిపోతూ రక్షించండంటూ ఆర్తనాదాలు చేశాడని, సమీపంలో పురుషులు ఎవ్వరూ లేకపోవడంతో రక్షించలేకపోయారని స్థానిక మహిళలు చెప్పారు. విషయం తెలిసిన ఏఎస్ఐ సుభాని, సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మోటారుసైకిల్, బ్యాగును స్వాధీనపరచుకుని, కాలువ వెంట కొంతదూరం గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. బ్యాగ్‌లో రెండు సెల్ఫోన్లు, యూనిఫాం దుస్తులు, డ్యూటీకి సంబంధించిన మూడు పుస్తకాలు, రెండు పేపర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లో ఉన్న నంబర్ల ఆధారంగా తెనాలిలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అపార్టుమెంటులో నివాసం ఉంటున్న పలువురు దుగ్గిరాల చేరుకున్నారు. కాలువ వెంట గాలింపు చర్యలు ప్రారంభించారు. తోటి ఉద్యోగి కాలువలో గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న పలువురు రైల్వే ఉద్యోగులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కేసునమోదు చేసి విచారిస్తున్నట్లు దుగ్గిరాల ఏఎస్ఐ సుభాని తెలిపారు. గల్లంతైన ఫరీద్బాషాకు భార్య హర్షదున్నీసా, మూడేళ్ల కుమారుడు తాజ్‌బాషా ఉండగా, తల్లిదండ్రులు షేక్ ఖాదర్‌వలి, నజీరున్నీసాలతో కలసి గంగానమ్మపేటలోని సాయి అపార్టుమెంటులో నివాసం ఉంటున్నట్లు బంధువులు చెప్పారు. -
కొల్లేరుకు కొత్త అందాలు!
►పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ►అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ►జల రవాణాను పునరుద్ధరిస్తే బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వ వైభవం సాక్షి, ఏలూరు : పచ్చని ప్రకృతి నడుమ విదేశీ పక్షుల విడిదికి ఆలవాలమైన కొల్లేటి సరస్సు కొత్త కళను సంతరించుకోనుంది. పర్యాటక అభివృద్ధితో జిల్లాకే తలమానికంగా నిలవనుంది. కొల్లేరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం చేసిన ప్రకటనతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అతిపెద్ద సరస్సు.. పక్షుల సొగసు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 673 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. వందలాది రకాల స్వదేశీ, విదేశీ పక్షులు ఇక్క కనువిందు చేస్తాయి. ఈ సరస్సు వల్ల జిల్లాకు ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి పెలికాన్ (గూడ) పక్షులు ఏటా కొల్లేరు సరస్సుకు వస్తుంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతారుు. పిల్లలకు మూడు నెలలు వయసు రాగానే సైబీరి యూకు పయనమవుతాయి. పెలికాన్లతోపాటు ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, చుక్క పరద, తోక పరద, ఈల పరద, ఉల్లంకి వంటి అనేక పక్షులు కొల్లేరులో సందడి చేస్తున్నాయి. పర్యాటకాభివృద్ధికి శ్రీకారం ఈ పక్షులను చూసేందుకు పర్యాట కులు ఇప్పటికే పెద్దసంఖ్యలో వస్తున్నారు. శని, ఆదివారాల్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులో ఆటపాక వద్ద గల పక్షుల సంరక్షణ కేంద్రానికి స్థానిక పర్యాటకులు వెళుతుంటారు. ఆటపాక తరహాలోనే ఏలూరు మండలంలోని మాధవరంలోనూ మరో పక్షుల విడిది కేంద్రాన్ని అటవీ శాఖ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం నిధులు సమకూరిస్తే రిసార్టులు నిర్మించడంతోపాటు, బోటుషికారు ఏర్పాటు చేయనున్నారు. సహజ సౌందర్యాన్ని కోల్పోయి... ప్రస్తుతం కొల్లేరు సరస్సు ఆక్రమణలకు గురై సహజ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. సరస్సును చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. నీరు కలుషితం అవుతోంది. రోడ్లు ఛిద్రమయ్యాయి. తాజాగా కొల్లేరును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్రమంగా తవ్విన చెరువులను ధ్వంసం చేసే పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇదంతా పర్యాటకాభివృద్ధిలో భాగంగా కనిపిస్తోంది. బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వవైభవం! జల రవాణాను పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఏర్పడనుంది. కొన్నేళ్ల క్రితం జాతీయ నౌకాయాన శాఖ పర్యవేక్షణలో 100 మీటర్ల వెడల్పుగల బకింగ్‌హామ్ కాలువలో సరుకుల రవాణా సాగేది. ఏలూరులోని తమ్మిలేరును దాటుకుని, తూర్పు లాకుల ద్వారా ఏలూరు కాలువ నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా విజ్జేశ్వరం లాకులను చేరుకుని, అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఈస్ట్రన్ కెనాల్ నుంచి కాకినాడ సముద్రం వరకూ ఈ జలమార్గ ప్రయాణం సాగేది. నరసాపురం, భీమవరం ప్రాం తాల్లోని కాలువలు కూడా దీనికి అనుసంధానమై ఉండేవి. బకింగ్‌హామ్ కెనాల్లో జలరవాణా ముమ్మరంగా జరిగే రోజుల్లో తాడేపల్లిగూడెం వార్ఫురోడ్లో ఉన్న పాయింట్‌ను ప్లీట్ అని పిలిచేవారు. ఇక్కడి నుంచి 120 పడవలు చెన్నైకు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు సరుకులను చేరవేసేవి. యద్దనపూడి వెంకటసుబ్బారావు పడవల యజమానిగా ఉండేవారు. కాలక్రమేణా జలమార్గం మూతపడింది. 2008లో దశలవారీగా బకింగ్‌హామ్ కాలువలో జలరవాణా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు ఉంటే విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాకినాడ వరకు జల రవాణా మళ్లీ ఊపిరిపోసుకుం టుంది. జిల్లాలో దాదాపు 82 కిలోమీటర్ల పొడవున గల జలరవాణా బకింగ్‌హామ్ కెనాల్ మార్గానికి అనుసంధానంగా ఉండేది. ప్రస్తుతం కాలువ మార్గం కుచించుకుపోయింది. పంట పొలాలు, రోడ్ల విస్తరణ వంటి పనులు కాలువ వెడల్పును తగ్గించేశాయి. జలరవాణా పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తే ఈ అవాంతరాలను తప్పించడం పెద్ద కష్టం కాదు. -
జల రవాణాకు కదలిక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అర్ధశతాబ్దం క్రితం ఆగిపోయిన జల రవాణా వ్యవస్థకు మళ్లీ ప్రాణం పోసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. భారత్ జల రవాణా సంస్థ (ఐడబ్ల్యూఏఐ) సహకారంతో రాష్ట్రంలో జల రవాణా అభివృద్ధికి కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకూ జాతీయ జల రవాణా మార్గం-4 ను పునరుద్ధరించడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. దీని కోసం ఇటీవల విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులు హాజరు కాకపోవడంతో మళ్లీ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు *2,100 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. జలరవాణా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నైపుణ్యం కలిగిన కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని ఉన్నతాధికారుల పరిశీలనకు పంపించనున్నారు. పాండిచ్చేరి నుంచి కాకినాడకు జలరవాణా మార్గం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల పరిధిలో ఉంది. ఇందులో ఎక్కువ భాగం రాష్ట్రంలోనే ఉండటం విశేషం. ప్రకాశం జిల్లాలో నల్లమడ లాకుల నుంచి పెదగంజాం వరకూ కొమ్మమూరు కాల్వ 38 కిలోమీటర్లు ఉంది. ఇది కృష్ణానది జలాలను తీసుకువచ్చే కాలువ. అక్కడి నుంచి పెదగంజాం మీదుగా సముద్రపు ఒడ్డున ఉప్పునీటి కాల్వగా బకింగ్‌హామ్ కెనాల్ ఉంది. పాకల, కరేడు మీదుగా ఇది నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు వరకూ వెళ్తుంది. కొమ్మమూరు కాల్వ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండగా, బకింగ్‌హామ్ కెనాల్ మాత్రం అవసాన దశకు చేరుకుంది. సముద్రపు ఆటుపోటు ద్వారా వచ్చే నీటితో ఉన్న ఈ కాల్వపై పలుచోట్ల ఓడ వచ్చినపుడు తీయడానికి వీలుగా లాకులు, దీన్ని ఆపరేట్ చేయడానికి లస్కర్ల వ్యవస్థ ఉంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించకపోవడంతో ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో 43 కిలోమీటర్ల మేర ఉన్న బకింగ్‌హామ్ కాల్వను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. 2008 నవంబర్లోనే రైట్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ జలరవాణా వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేసింది. కాకినాడ - పాండిచ్చేరి మధ్య సుమారు 1,095 కిలోమీటర్ల పొడవునా జలరవాణా వ్యవస్థ ఏర్పాటుకు కాలువలు, నదులు అనుకూలంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా వెళ్లింది. అప్పట్లోనే *1,516 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రాథమికంగా *62 కోట్లను జలరవాణాకు కేటాయించి, 2013 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించింది. కానీ తర్వాత జలరవాణా మార్గం అభివృద్ధి మరుగునపడింది. రాష్ట్రంలో పోర్టుల అనుసంధానం, కోస్తా కారిడార్ ఏర్పాటు నేపథ్యంలో జలరవాణా మళ్లీ తెరపైకి వచ్చింది. కాకినాడ-పాండిచ్చేరి జలరవాణా మార్గం వల్ల ఏటా 11 మిలియన్ టన్నుల కార్గో రవాణా అయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆరేళ్ల క్రితం సర్వే చేసిన వెప్కాస్ అనే సంస్థ తెలియజేసింది. మూడు రాష్ట్రాల మధ్య బియ్యం, బొగ్గు, ఆహార పదార్థాలు, సిమెంట్, ఎరువులు, అటవీ ఉత్పత్తులు, ఉప్పు తదితర వాటిని రవాణా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటన్నింటినీ రైళ్లలో రవాణా చేయడం వల్ల భారమవుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మళ్లీ జలరవాణా అందుబాటులోకి రావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.