కొల్లేరుకు కొత్త అందాలు!
►పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
►అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన
►జల రవాణాను పునరుద్ధరిస్తే బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వ వైభవం
సాక్షి, ఏలూరు : పచ్చని ప్రకృతి నడుమ విదేశీ పక్షుల విడిదికి ఆలవాలమైన కొల్లేటి సరస్సు కొత్త కళను సంతరించుకోనుంది. పర్యాటక అభివృద్ధితో జిల్లాకే తలమానికంగా నిలవనుంది. కొల్లేరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం చేసిన ప్రకటనతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
అతిపెద్ద సరస్సు.. పక్షుల సొగసు
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 673 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. వందలాది రకాల స్వదేశీ, విదేశీ పక్షులు ఇక్క కనువిందు చేస్తాయి. ఈ సరస్సు వల్ల జిల్లాకు ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి పెలికాన్ (గూడ) పక్షులు ఏటా కొల్లేరు సరస్సుకు వస్తుంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతారుు. పిల్లలకు మూడు నెలలు వయసు రాగానే సైబీరి యూకు పయనమవుతాయి. పెలికాన్లతోపాటు ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, చుక్క పరద, తోక పరద, ఈల పరద, ఉల్లంకి వంటి అనేక పక్షులు కొల్లేరులో సందడి చేస్తున్నాయి.
పర్యాటకాభివృద్ధికి శ్రీకారం
ఈ పక్షులను చూసేందుకు పర్యాట కులు ఇప్పటికే పెద్దసంఖ్యలో వస్తున్నారు. శని, ఆదివారాల్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులో ఆటపాక వద్ద గల పక్షుల సంరక్షణ కేంద్రానికి స్థానిక పర్యాటకులు వెళుతుంటారు. ఆటపాక తరహాలోనే ఏలూరు మండలంలోని మాధవరంలోనూ మరో పక్షుల విడిది కేంద్రాన్ని అటవీ శాఖ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం నిధులు సమకూరిస్తే రిసార్టులు నిర్మించడంతోపాటు, బోటుషికారు ఏర్పాటు చేయనున్నారు.
సహజ సౌందర్యాన్ని కోల్పోయి...
ప్రస్తుతం కొల్లేరు సరస్సు ఆక్రమణలకు గురై సహజ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. సరస్సును చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. నీరు కలుషితం అవుతోంది. రోడ్లు ఛిద్రమయ్యాయి. తాజాగా కొల్లేరును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్రమంగా తవ్విన చెరువులను ధ్వంసం చేసే పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇదంతా పర్యాటకాభివృద్ధిలో భాగంగా కనిపిస్తోంది.
బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వవైభవం!
జల రవాణాను పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఏర్పడనుంది. కొన్నేళ్ల క్రితం జాతీయ నౌకాయాన శాఖ పర్యవేక్షణలో 100 మీటర్ల వెడల్పుగల బకింగ్‌హామ్ కాలువలో సరుకుల రవాణా సాగేది. ఏలూరులోని తమ్మిలేరును దాటుకుని, తూర్పు లాకుల ద్వారా ఏలూరు కాలువ నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా విజ్జేశ్వరం లాకులను చేరుకుని, అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఈస్ట్రన్ కెనాల్ నుంచి కాకినాడ సముద్రం వరకూ ఈ జలమార్గ ప్రయాణం సాగేది.
నరసాపురం, భీమవరం ప్రాం తాల్లోని కాలువలు కూడా దీనికి అనుసంధానమై ఉండేవి. బకింగ్‌హామ్ కెనాల్‌లో జలరవాణా ముమ్మరంగా జరిగే రోజుల్లో తాడేపల్లిగూడెం వార్ఫురోడ్‌లో ఉన్న పాయింట్‌ను ప్లీట్ అని పిలిచేవారు. ఇక్కడి నుంచి 120 పడవలు చెన్నైకు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు సరుకులను చేరవేసేవి. యద్దనపూడి వెంకటసుబ్బారావు పడవల యజమానిగా ఉండేవారు. కాలక్రమేణా జలమార్గం మూతపడింది. 2008లో దశలవారీగా బకింగ్‌హామ్ కాలువలో జలరవాణా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
దానికి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు ఉంటే విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాకినాడ వరకు జల రవాణా మళ్లీ ఊపిరిపోసుకుం టుంది. జిల్లాలో దాదాపు 82 కిలోమీటర్ల పొడవున గల జలరవాణా బకింగ్‌హామ్ కెనాల్ మార్గానికి అనుసంధానంగా ఉండేది. ప్రస్తుతం కాలువ మార్గం కుచించుకుపోయింది. పంట పొలాలు, రోడ్ల విస్తరణ వంటి పనులు కాలువ వెడల్పును తగ్గించేశాయి. జలరవాణా పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తే ఈ అవాంతరాలను తప్పించడం పెద్ద కష్టం కాదు.