Tourism center
-
కొండను కొంటారా? అమ్మకానికి సిద్ధంగా ఉంది!
కొండను కొంటారా?! ఖాళీ స్థలాలను కొనుక్కుంటారు. చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, భవంతులు కొనుక్కుంటారు. అంతేగాని, కొండలు గుట్టలు కొనుక్కుంటారేమిటి? అయినా, వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో కాదులెండి. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ డేల్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న 170 అడుగుల పొడవైన ‘కిల్న్సే క్రేగ్’ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు. దీని ధర 1.50 లక్షల పౌండ్లు (రూ.1.55 కోట్లు). యార్క్ డేల్స్లోని వార్ఫడేల్ ప్రాంతంలో సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరుపొందింది. చాలామంది పర్యాటకులు దీనిపైకెక్కి ఫొటోలు దిగుతుంటారు. దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ కొండ సహా దీని చుట్టూ ఉన్న 18.76 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వ్యవసాయ పర్యావరణ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నట్లు ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!) -
SleepTourism: నిద్రకు ప్రయాణం కట్టండి
తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్‌లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి. రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది. స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్‌వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా? అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్రూమ్ లేకపోవడం, గుర్గుర్మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్‌గా మారింది. మనిషికి కావలసింది ఆ రెండే ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి. లండన్‌లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్‌లో జెడ్వెల్ అనే హోటల్ ‘సౌండ్‌ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి. స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట. మంచి పరుపులు, మసాజ్‌లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్‌కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్‌లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్‌లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్‌లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. -
విశాఖలో 7 స్టార్ హోటల్ ఏర్పాటుకు ప్రణాళిక
ప్రపంచవ్యాప్తంగా హోటల్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒబెరాయ్ సంస్థ విశాఖలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముందుకొచ్చింది. రిసార్ట్‌తో పాటు స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. భీమిలి మండలం అన్నవరం సాగరతీరంలో ఒబెరాయ్ సంస్థకు స్థలాన్ని కేటాయించేందుకు పర్యాటక శాఖ సమాయత్తమవుతోంది. పాడేరులోనూ టూరిజం సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఈ ప్రముఖ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. సాక్షి, విశాఖపట్నం: పర్యాటక రంగంలో పరుగులు పెడుతున్న విశాఖపట్నం వైపు దిగ్గజ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. విదేశీ పర్యాటకులు విశాఖను సందర్శించేందుకు మొగ్గు చూపుతుండటంతో.. టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా హోటల్స్ రంగంలో దిగ్గజమైన ఒబెరాయ్ హోటల్ విశాఖలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజరామన్ శంకర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు చోట్ల తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. అన్నవరంలో 7 స్టార్ హోటల్ భీమిలి సమీపంలోని అన్నవరం సముద్రతీరంలో తమ హోటల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఒబెరాయ్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర, జిల్లా పర్యాటక శాఖ అధికారులతో ఆ సంస్థ ప్రతినిధులు సంప్రదింపులు జరిపారు. ఇటీవలే జిల్లా టూరిజం అధికారులతో కలిసి విశాఖపట్నం బీచ్ పరిసరాలను సందర్శించారు. బీచ్ ఒడ్డున టూరిజం శాఖకు ఎక్కడెక్కడ ఎంత మేర భూములున్నాయో వాటన్నింటినీ పరిశీలించారు. చివరిగా అన్నవరం సాగరతీరం ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులకు నచ్చడంతో.. ఆ స్థలంలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అన్నవరంలో పర్యాటక శాఖకు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. వీటిలో 40 ఎకరాలను ఒబెరాయ్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ 7 స్టార్ హోటల్ నిర్మించాలని సంస్థ భావిస్తోంది. వీటితో పాటు రిసార్టులు కూడా ఏర్పాటు చేయాలని సమాలోచనలు చేస్తోంది. పాడేరులో టూరిజం సెంటర్ విశాఖతో పాటు ఏజెన్సీ ప్రకృతి అందాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. పాడేరు రీజియన్ పరిధిలో టూరిజం సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. విశాఖ మన్యంలోని అందాలను తిలకించేందుకు ఆసక్తిగా వచ్చే దేశ, విదేశీ పర్యాటకులు.. ఆ ప్రాంతంలో ఏఏ వనరులు, వసతులు కావాలని కోరుకుంటారో.. వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో అందించేలా టూరిజం సెంటర్ ఉండబోతోంది. రిసార్టులు, హోటల్, టూరిజం ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలన్నీ వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఒబెరాయ్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఉమ్మడి విశాఖ పట్నంలో రూ.300కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఒబెరాయ్ సంస్థ సిద్ధమవుతోంది. (క్లిక్: తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు) ఒబెరాయ్ గ్రూప్స్ అంటే.? భారత్‌కు చెందిన ఒబెరాయ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటళ్లను విస్తరించిన సంస్థ. 5 స్టార్ లేదా 7 స్టార్ హోటల్స్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతోంది. ఐదు దేశాల్లోని 20కిపైగా నగరాల్లో హోటళ్లను, 2 క్రూయిజ్ షిప్‌లను ఒబెరాయ్ సంస్థ నిర్వహిస్తోంది. 1934 నుంచి హోటల్స్ రంగంలో సేవలందిస్తూ అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. భారత్‌లో ముంబయి, గుర్గావ్, చెన్నై, భువనేశ్వర్, కోచ్చి, ఆగ్రా, జైపూర్, ఉదయ్‌పూర్, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే హోటళ్లను నడుపుతోంది. తాజాగా విశాఖలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో మరోసారి ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన కోసం నగరానికి రానున్నట్లు పర్యాటక శాఖ ప్రతినిధులు తెలిపారు. (క్లిక్: ఏపీకి పెట్టుబడులు రావడం పవన్‌కు ఇష్టం లేనట్లే ఉంది!) -
పర్యాటకులను ఆకట్టుకునేలా సరికొత్త నినాదం... మీకిదే.. మా ఆహ్వానం..
సాక్షి, హైదరాబాద్: ‘రండి.. హైదరాబాద్‌ను సందర్శించండి’ నగరం కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ టూర్లను నిర్వహిస్తున్న పర్యాటక సంస్థలు సరికొత్త నినాదంతో పర్యాటక ప్రియులను ఆకట్టుకొనేందుకు ప్రణాళికలను రూపొందించాయి. వారం రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక స్థలాలను సందర్శించేందు కు అనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు.. రెండేళ్లపాటు కోవిడ్ కారణంగా నిలిచిపోయిన జాతీయ, అంతర్జాతీయ రాకపోకలను మార్చి నుంచి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన నేపథ్యంలో వివిధ సంస్థలు, నగరానికి చెందిన పలువురు టూర్ ఆపరేటర్లు, నిర్వాహక సంస్థలు, ఇంటాక్ తదితర సంస్థలతో జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రానున్న రోజుల్లో పర్యాటకుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉందని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముచ్చింతల్‌లో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహం, యాదాద్రి, రామప్ప ఆలయం తదితర క్షేత్రాలను సందర్శించేందుకు జాతీయ స్థాయి పర్యాటకులతో పాటు, విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో నగరానికి రావచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకులను ఆకట్టుకొనేందుకు హైదరాబాద్ నుంచి అడ్వెంచర్ టూర్లు, హైదరాబాద్ విహంగ వీక్షణం కోసం బర్డ్ ఐ టూర్ వంటివి నిర్వహించాలని ఆపరేటర్లు కేంద్ర, రాష్ట్రాల పర్యాటక సంస్థలను కోరారు. నేరుగా విమానాలు నడపండి.. జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నతాధికారి ప్రదీప్ పాణికర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు నేరుగా విమానాలను నడిపేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి రోజుకు 60 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. వారిలో 10 వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లే విమానాలు పరిమితంగా ఉన్నాయి. గతంలో చికాగోకు డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించారు. కానీ కోవిడ్ కారణంగా ఆ సర్వీసు నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే వాటిలో చాలా వరకు కనెక్టింగ్ ఫ్లైట్లే ఎక్కువ. ఈ క్రమంలో ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ తదితర దేశాలకు హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలను నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌తో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పైస్‌జైట్, ఇండిగో, ఏఐఆర్, తదితర అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలతో త్వరలో ‘హైదరాబాద్ ఏవియేషన్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. (చదవండి: ప్రైవేటుతో మౌలిక వసతుల ప్రగతి) -
దత్తత తీసుకుందాం రండి..!
కరోనా మహమ్మారి మీతో పాటు మమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..అది మీ శరీరంలో ప్రవేశించి ప్రాణాలు తీస్తుంది. మమ్మల్ని ఆకలితో అలమటించేటట్లు చేస్తోంది... కొందరు దాతలు పేదలకు భోజనాలు పెడుతున్నారు.. అలాంటి దాతలే ముందుకొచ్చి మమ్మల్ని దత్తత తీసుకొని మా ఆకలి తీర్చండి.. ఇదీ ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాల వేదన.. ఆరిలోవ (విశాఖ తూర్పు) ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణులను దత్తత ఇస్తున్నారు.. జూ అధికారులు ఇక్కడ జంతువులు, పక్షుల ఆకలి తీర్చడానికి వాటిని దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులకు అవకాశం కల్పిస్తున్నారు. వాటిని మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరంలేదు. దత్తత తీసుకొన్నవారు వాటిని జూలోనే ఉంచి ఆహారం మాత్రమే అందిస్తారు. ఖర్చు మాత్రమే మనం జూ అధికారులకు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బులతో వన్యప్రాణులకు వారే ఆహారం సరఫరా చేస్తుంటారు.. రెండేళ్లు నుంచి ఆకలి బాధలు.. జూ పార్కు నగరంలో ప్రధానమైన పర్యాటక కేంద్రం. సాధారణ రోజుల్లో 3,000 పైగా సందర్శకులు వెళుతుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య 4,000 దాటుతుంది. దీని ప్రకారం రోజులో రూ 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఆదాయం లభిస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి ఆ ఆదాయానికి గండిపడింది. 2020 మార్చి 23 నుంచి అక్టోబర్ వరకు లాక్డౌన్లో భాగంగా జూ పార్కు మూసేశారు. దానివల్ల సుమారు రూ.4 కోట్లు ఆదాయం కోల్పోయింది. 2021లో మళ్లీ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దానివల్ల మరింత ఆదాయం కోల్పోయింది. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ వన్యప్రాణులకు జూ అధికారులు ఆహారం అందిస్తారు. ఆదాయం రాకపోవడంతో గతంలో ఆదా చేసిన డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. జూ నిధి ఖాళీ అవుతోందని జూ అధికారులు ఆందోళనలో పడ్డారు. దాతలు ఆదుకోకపోతే ఇక్కడ వన్యప్రాణుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.. ఎంతైనా ఇవ్వవచ్చు.. ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. వాటి కోసం ఒక రోజుకు, నెల రోజులకు, ఏడాదికి వాటికయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయ పన్నులో మినహాయింపు ఉంటుంది. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. సింహం, పులికి పశు మాంసం, చికెన్ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పండ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పండ్ల ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పండ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికి వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.. జూలో 810కు పైగా వన్యప్రాణులు జూలో ప్రస్తుతం 90 జాతులకు చెందిన 810కు పైగా వన్యప్రాణులున్నాయి. వాటిలో ఏనుగులు, జీబ్రాలు, పులులు, సింహాలు, జింకలు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, నీటి ఏనుగులు, కోతులు, చింపాంజీలు, ఖడ్గమృగం, అడవి కుక్కలు, కణుజులు, అడవిదున్నలు, పాములు, మొసళ్లతో పాటు నెమళ్లు, నిప్పుకోళ్లు, ఈమూలు, హంసలు, మరికొన్ని రంగురంగుల పక్షులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆహారం కోసం రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు సహకరించాలని జూ అధికారులు జంతు ప్రేమికులను కోరుతున్నారు. వ్యక్తులు, స్వచ్ఛంద సంఘాలతో పాటు కొన్ని పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఇవ్వడానికి ఇప్పటికే ముందుకొచ్చాయి. మరింత ఎక్కువమంది ఇక్కడ వన్యప్రాణుల దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని జూ అధికారులు కోరుతున్నారు.. ఖడ్గమృగాన్ని మూడేళ్లు దత్తత తీసుకున్న ఐఓసీఎల్ జూలో నకుల్ అని పిలవబడే ఇండియన్ ఖడ్గమృగాన్ని (మగది) ఐఓసీఎల్ ప్రతినిధులు మూడేళ్లు పాటు దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. దీనికోసం జూ క్యూరేటర్ నందనీ సలారియాతో ఐఓసీఎల్ ప్రతినిధులు వరుసగా మూడేళ్లు పాటు దత్తత తీసుకొన్నట్లు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న ఒక ఏడాదికి సరిపడగా రూ.3 లక్షలు చెక్కును ఐవోసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ జూ క్యూరేటర్ నందనీ సలారియాకు అందజేశారు. ఒక జంతువు/పక్షికి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం.. ► ఏనుగుకు ఒక రోజుకు–రూ.1200 ► ఖడ్గమృగానికి ఒక రోజుకు–820 ► నీటి ఏనుగుకు ఒక రోజుకు–600 ► సింహానికి ఒక రోజుకు–600 ► పెద్ద పులికి ఒక రోజుకు రూ.600 ► జిరాఫీకి ఒక రోజుకు రూ.500 ► చిరుత పులికి ఒక రోజుకు రూ400 ► ఎలుగుబంటి ఒక రోజుకు రూ.300 ► చింపాంజీకి ఒక రోజుకు రూ.210 ► అడవి దున్నకు ఒక రోజుకు రూ.200 ► జీబ్రా రెండింటికి ఒక రోజుకు రూ.330 ► తోడేళ్లు రెండింటికి ఒక రోజుకు రూ.300 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 ► చుక్కల దుప్పి ఒక రోజుకు రూ.100 ► రింగ్‌టైల్డ్ లెమూర్కు ఒక రోజుకు రూ.100 ► మొసలి/ఘరియల్ రెండింటికి ఒక రోజుకు రూ.150 ► హంసలు రెండింటికి రెండు రోజులకు రూ.100 ► నక్షిత్ర తాబేళ్లు పదింటికి ఐదు రోజులకు రూ.150 ► సారస్ కొంగ/నిప్పుకోడి/ పాములకు నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 గుడ్లగూబలు నాలుగింటికి ఒక రోజుకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 మకావ్‌లు నాలుగింటికి మూడు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 పీజియన్/నెమళ్లు నాలుగింటికి నాలుగు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 రామ చిలుకలు/ఆఫ్రికన్ చిలుకలకు ఐదు రోజులకు రూ.100 ► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 లవ్ బర్డ్స్ పదింటికి ఐదు రోజులకు రూ.100 దాతలు ముందుకు రావాలి... కరోనా కారణంగా రెండేళ్లగా జూ ఆదాయం తగ్గిపోయింది. సందర్శకులు జూకి రావడం మానేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి. సంచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి వాటి ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలి. వాటిని దత్తత తీసుకోవడానికి చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను మినహాయింపు ఉంది. ఈ దత్తత పద్దతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు దత్తత తీసుకొన్నారు. ఇటీవల ఐవోసీఎల్సంస్థ ముందుకొచ్చి ఖడ్గమృగాన్ని మూడేళ్లు పాటు దత్తత తీసుకొంది. స్పందించిన దాతలు 9440810160, 0891–2552081 ఫోన్ నంబర్లకు సంప్రదించాలి. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
స్వేచ్ఛా విగ్రహం కంటే ఐక్యతా విగ్రహమే ఘనం
అహ్మదాబాద్: అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కేవాడియాలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్ ప్రాంతాలను కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా 8 రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ రైళ్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలిందని వివరించారు. దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి–చందోడ్, చందోడ్–కేవాడియా బ్రాడ్‌గేజ్ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్–కేవాడియా సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. కేవాడియా అనేది ఇకపై మారుమూల చిన్న పట్టణం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారబోతోందని స్పష్టం చేశారు. పర్యావరణ హిత రైల్వే ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు కేవాడియా రైల్వే స్టేషన్ ఒక ఉదాహరణ అని చెప్పారు. మోదీ ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్–కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైల్లో ప్రత్యేక ఏమిటంటే ఇందులో విస్టాడోమ్ కోచ్‌లు ఉన్నాయి. కోచ్ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు. -
రాష్ట్రపతిగా ప్రణబనాదం
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా, ఉత్తేజంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ఉరిమే ఉత్సాహంతో పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ఇంచుమించుగా అంతటి పేరు తెచ్చుకొని రాష్ట్రపతి భవన్‌కు పునరుజ్జీవనం తీసుకువచ్చారు. 2012–2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. కేంద్రం అడుగులకి మడుగులు ఒత్తకుండా అన్నివైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం రాష్ట్రపతిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాగా పనికివచ్చింది. తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆచితూచి అడుగులు పార్లమెంటు ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్టపతి దగ్గరకి వస్తే ఆయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అన్న అంశాలన్నీ నిశితంగా పరిశీలించేవారు. భూసేకరణ, పునరావాస చట్టంపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వివిధ అంశాలపై ఆర్డినెన్స్‌లు ఎక్కువగా తీసుకువస్తోందని దాదా ఆగ్రహించారు. ప్రజలకు చేరువగా భారతీయ చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదని కాపాడుతూనే రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకి చేరువ కావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, సృజనాత్మకత ఉన్నవారికి రాష్ట్రపతి భవన్ తలుపులు బార్లా తెరిచారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్రపతి భవన్లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయం కల్పించారు. రాష్ట్రపతి భవన్‌కు ఎక్కువ మంది అతిథులు వచ్చేలా చర్యలు చేపట్టారు. క్షమాభిక్ష పిటిషన్లు ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఖాతాలో ఎక్కువగా తిరస్కరణలే ఉన్నాయి. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు పర్యాటక ప్రాంతంగా.. భారత్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రపతి భవన్‌ను నిలపడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, మ్యూజియం సందర్శించడానికి ప్రజలకు అనుమతులు ఇచ్చారు. ప్రణబ్ హయాంలో భారీగా ప్రజలు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. 2017లో జరిగిన ఉద్యానోత్సవ్కి 7 లక్షల మంది వరకు హాజరవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’ ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే రాష్ట్రపతి భవన్ మొదటిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది. 2014 జూలై 1న ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ విరమణ చేసినప్పుడు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజల మనిషి అయిన ప్రణబ్ ట్విట్టర్లో ‘సిటిజన్ ముఖర్జీ’పేరును వాడారు. కొత్త మ్యూజియం రాష్ట్రపతి భవన్లో గుర్రపు శాలలు ఉండే ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఇందులో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ఫొటోలను ఉంచారు. పురాతన ఆయుధాలు, ఫర్నీచర్ కూడా ఈ మ్యూజియంలో కనువిందు చేస్తాయి. -
టూరిజం రంగంలో దూసుకుపోతున్న ఏపీ
-
పర్యాటక కేంద్రంగా అన్నవరం
* టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం * బడ్జెట్ హోటల్ నిర్మాణానికి టూరిజం శాఖకు రూ.3.41 కోట్లు మంజూరు * ప్రజాప్రతినిధులతో అధికారుల సమావేశం అన్నవరం : సత్యదేవుని సన్నిధి.. అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రూ.3.41 కోట్లతో నాలుగెకరాల్లో అన్ని సౌకర్యాలతో బడ్జెట్ హోటల్ నిర్మించేందుకు పర్యాటక శాఖకు పచ్చజెండా ఊపింది. నిధులు కూడా విడుదల చేసింది. దీంతోపాటు అన్నవరాన్ని ఆలయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో దేవస్థానంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను సంబంధిత అధికారులు నోట్ చేసుకుని వాటిపై తమ అభిప్రాయాలు, వాటికి అయ్యే వ్యయం తదితర అంశాలతో నివేదిక సమర్పించాలని, సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా ప్రణాళిక అధికారి విజయలక్ష్మి ఆదేశించారు. సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, దేవస్థానం ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు, పర్యాటక శాఖ డీఎం టి.బాపూజీ, పంచాయతీరాజ్ ఈఈ ఏబీవీ ప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ సతీష్‌బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సీహెచ్ అప్పారావు, దేవస్థానం ఈఈ ప్రసాదరావు, తుని ఆర్టీసీ డీఎం వైవీఎన్ మూర్తి, శంఖవరం ఎంపీడీఓ శర్మ, ఎంపీపీ బద్ది మణి, వైస్ ఎంపీపీ బొమ్మిడి సత్యనారాయణ, అన్నవరం సర్పంచ్ రాజాల గంగాభవాని, ఉప సర్పంచ్ బండారు రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవీ ప్రజాప్రతినిధుల సూచనలు * అన్నవరం మెయిన్‌రోడ్, రైల్వేస్టేషన్ రోడ్లను విస్తరించాలి. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. * పర్యాటకులకు రెస్ట్‌హౌస్ ఏర్పాటు చేయాలి.పంపా తీరంలో మొక్కలు పెంచి, సందర్శకులు కూర్చోవడానికి వీలుగా బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయాలి. * గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలి. కొండ దిగువన సులభ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలి. డ్రైన్ల వ్యవస్థను మెరుగుపరచాలి. * అన్నవరానికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలి. * రైల్వేస్టేషన్ రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంపై బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలి. * గ్రామంలోని కోనేరు, రిజర్వ్ చెరువులను అభివృద్ధి చేయాలి. * అన్నవరం బస్ కాంప్లెక్స్ పక్కన ఉన్న స్థలాన్ని ఆర్టీసీ లేదా ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. పర్యాటక కేంద్రం చేయాలని.. అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు, సమస్యలు తెలుసుకున్నాం. వారి అభిప్రాయాలతో అధికారులను నివేదిక ఇవ్వమని చెప్పాం. ఆ నివేదిక ఇచ్చాక కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకుంటారు. - విజయలక్ష్మి, జిల్లా ప్రణాళిక అధికారి మౌలిక వసతులు కల్పిస్తాం పర్యాటకాభివృద్ధిలో భాగంగా అన్నవరంలో మౌలిక వసతులు కల్పించాలని ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఆయా శాఖల అధికారులతో చర్చించి చర్యలు చేపడతాం. - విశ్వేశ్వరరావు, ఆర్డీఓ, పెద్దాపురం గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి అన్నవరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలి. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులివ్వాలి. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి. - గంగాభవాని, సర్పంచ్, అన్నవరం పర్యాటకులకు కూడా సేవలందిస్తాం సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సేవలందిస్తున్నాం. అలాగే పర్యాటకులకు కూడా సేవలందిస్తాం. టూరిజం శాఖకు పంపా నదికి దగ్గరలో కొండమీద స్థలమివ్వడానికి గతంలోనే అంగీకరించాం. పర్యాటకాభివృద్ధికి మేం ఏంచేయాలో చెబితే దానిపై దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటాం. - జగన్నాథరావు, ఇన్‌ఛార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం బడ్జెట్ హోటల్ నిర్మాణం అన్నవరంలో నాలుగు ఎకరాల్లో రూ.3.41 కోట్లతో బడ్జెట్ హోటల్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం. ఇందుకు తగిన స్థలం కోసం అన్వేషిస్తున్నాం. అన్నవరం దేవస్థానం స్థలం ఇస్తే అందులోనే హోటల్ నిర్మిస్తాం. 60 గదులు, 20 మందికి సరిపడా నాలుగు డార్మెట్రీలు, ఒక క్యాంటిన్, స్విమ్మింగ్పూల్వంటివి ఇందులో ఉంటాయి. క్యాంటిన్లో ఆహార పదార్థాల ధరలు, హోటల్లో రూము అద్దెలు అందరికీ అందుబాటులో ఉంటాయి. - బాపూజీ, డీఎం, పర్యాటక శాఖ బోట్ షికార్ ఏర్పాటు చేయాలి పంపా నదిలో టూరిజం శాఖ బోట్ షికార్ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు దీనిని నిర్వహిస్తున్నారు. పంపా నది ఒడ్డున ఉన్న ఆక్రమణలను కూడా తొలగించాలి. - బలువు రాంబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ నేత టూరిస్ట్ బస్సుల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలి ఏటా అన్నవరానికి సుమారు 600 టూరిస్ట్ బస్సులలో భక్తులు వస్తున్నారు. ఆ బస్సులను రోడ్లమీదే నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆ బస్సులను నిలపడానికి పార్కింగ్ స్థలం కేటాయించాలి. ఘాట్‌రోడ్‌ను అందంగా రూపొందించాలి. - ఈర్లు శ్రీనివాస్, వార్డు సభ్యుడు, అన్నవరం -
తెలంగాణ తిరుమల.. చిలుకూరు బాలాజీ
కలియుగదైవమైన వేంకటేశ్వరస్వామి మూడుచోట్ల ప్రత్యక్షంగా వెలిసినట్టు ప్రతీతి. అందులో ఒకటి చిత్తూరు జిల్లా తిరుమల, రెండోది తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల కాగా, మూడోది తెలంగాణ ప్రాంతంలోని చిలుకూరులో అని పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణ తిరుమలగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందింది. వీఐపీ దర్శనాలు, టిక్కెట్లు, హుండీలులేని దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఒకే దేవాలయ ప్రాంగణంలో అటు వేంకటేశ్వరస్వామి ఇటు శివుడు పూజలందుకుంటూ విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిరోజు 20 వేలు, సెలవు రోజుల్లో 30 వేల నుంచి 50 వేల వరకు భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉస్మాన్‌సాగర్ ఒడ్డున దేవాలయం ఉండడంతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.. ఆలయ ప్రశస్తి గురించి మరికొంత ఈ వారం సండే స్పెషల్... - మొయినాబాద్ *వీసాల దేవుడు * ఐదు వందల సంవత్సరాల చరిత్ర * వీఐపీ దర్శనాలు, టిక్కెట్లు, హుండీలులేని దేవాలయంగా ప్రసిద్ధి * అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి ప్రాచుర్యం పొందిందిలా... రాష్ట్రంలో ఏ దేవాలయానికి వెళ్లినా భక్తులు వారి స్థాయికి తగ్గట్టు పూజలకు, కొబ్బరికాయకొట్టటానికి, దర్శనానికి తప్పనిసరి టిక్కెట్లు కొనుక్కుని సేవలను పొందటం అందరికీ తెలిసిందే. మొదట్లో చిలుకూరు బాలాజీ దేవాలయంలో హుండీ మాత్రమే ఉండగా 2001 సంవత్సరం నుంచి అదీ తొలగించారు. దేవుని వద్ద అంతా సమానమే అనే నినాదంతో ఎలాంటి టిక్కెట్లు, హూండీలు, ప్రత్యేక దర్శనాలు లేకుండా మార్పు చేశారు. ఈ విషయం అందరికీ కొత్తగా అనిపించి ఆనోటా ఈనోట రాష్ట్రవ్యాప్తంగా పాకి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగింది. మొదటిసారి దర్శించుకున్నప్పుడు 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలు కోరుకోవటం, అది తీరాక వచ్చి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునే పద్ధతి ఇక్కడ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు చిలుకూరు బాలాజీ ఆలయం లాగానే నడపాలంటూ ఉద్యమాలు సైతం నడిచాయంటే ఇక్కడి నిర్వహణ విధానం భక్తులకు ఎంతగా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 29.2.2008న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవాలయంగా ప్రకటించించింది. ఆలయ పూజారి సౌందరరాజన్‌ను చైర్మన్‌గా, మరోపూజారి గోపాలకృష్ణను కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ నిర్వహణకు భక్తుల నుంచి బ్యాంకు అకౌంట్లద్వారా నిత్యపూజానిధిని తీసుకునే వీలును కల్పించింది. ప్రపంచవ్యాప్తంగా.. గతంలో ఐటీ రంగం ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో వీసాలురాక ఎంతో మంది ఇంజినీరంగ్ పూర్తిచేసిన విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. కోరిన కోర్కెలు వెంటనే తీర్చె చిలుకూరు బాలాజీ దేవాలయం విశిష్టతను తెలుసుకుని ఎక్కువశాతం మంది త్వరగా వీసాలు రావాలంటూ కోరుకోవటంతో వెంటనే వచ్చాయనేది భక్తుల నమ్మకం. అలా ఉద్యోగాలు పొంది ఇతర దేశాల నుంచి వచ్చి సైతం మొక్కులు తీర్చుకున్నారు. అమెరికాలో ఎక్కువశాతం ఉద్యోగాలు సంపాదించిన వారిలో చిలుకూరు బాలాజీ భక్తులే కావటంతో ఇక్కడి స్వామివారికి వీసాల దేవుడిగా పేరొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అమెరికాలోని ప్రముఖ పత్రికవాల్స్ట్రీట్ జర్నల్ చిలుకూరు బాలాజీ విశిష్టతను ప్రముఖంగా ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం కల్పించింది. ఇటీవల అమెరికాలో ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగాలు పోతున్న సమయంలో సైతంవారంతా ప్రతి ఇంట్లో చిలుకూరు బాలాజీ ఫొటోలు పెట్టుకుని తమ ఉద్యోగాలను నిలపాలంటూ పూజలు చేస్తున్న విషయాన్ని సైతం అదే పత్రిక ప్రచురించింది. సామాజిక దృక్పథం భక్తుల నుంచి ఆదాయాన్ని ఆశించకుండా సమాజానికి ఎలాంటి మంచి సందేశాన్ని ఇద్దాం, భక్తుల ఇబ్బందులకు ఆధ్యాత్మికతను జోడించి ఎలా ఉపశమనం కలిగిద్దామనే ఉద్దేశంతో చిలుకూరు దేవాలయ పూజారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు నివారణోపాయంగా ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటు ప్రతి ఒక్కరూ ఖాధీ వస్త్రాలను దరించాలని విన్నపం చేశారు. ప్రతి శనివారం దేవాలయానికి వచ్చే భక్తులు ఖాధీ వస్త్రాలు మాత్రమే దరించి రావాలనే సూచనతో వారిలో నైతిక స్థైర్యాన్ని నింపారు. ప్లాస్టిక్ వాడకంతో సమాజానికి ఎంత కీడు జరుగుతుందో తెలియజెప్పాలనే ఉద్దేశంతో దేవాలయం వద్ద ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిరోధించి చేనేతబ్యాగులను ప్రవేశపెట్టారు. అమెరికాలో ఉద్యోగాలు పోతున్న వారిని కాపాడాలని, యేటా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఐదేళ్లుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అభివృద్ధి ఇలా.. దేవాలయం చుట్టూ గతంలోనే రూ.26 లక్షలతో సీసీ రోడ్లు నిర్మంచగా ఇటీవల రూ.8 లక్షలతో దేవాలయం ముందు భాగంలో సైతం రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంచినీటి ఇబ్బందిని తీర్చటానికి ఎక్కడికక్కడ కులాయిలు ఏర్పాటు చేశారు. ఓ దాత సాయంతో దేవాలయానికి ముఖద్వారం లేని లోటును సైతం తీర్చారు. దేవాలయం ముందుభాగంలో రావి చెట్టుకింద ఫ్లోరింగ్ పనులను చేపట్టి భక్తులు సేదతీరటానికి అనుకూలంగా చేశారు. దేవాలయం లోపల క్యూలైన్ల ఏర్పాటు, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పర్యాటకశాఖ నిధుల నుంచి రూ.72లక్షలు వెచ్చించి హోటల్, గదులను నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాల కూడా కొనసాగుతోంది. ఆలయ చరిత్ర పూర్వం చిలుకూరు గ్రామంలో గున్నాల మాదవరెడ్డి అనే వేంకటేశ్వరస్వామి అపర భక్తుడు ఉండేవారు. యేటా క్రమం తప్పకుండా స్వామివారి దర్శనానికి తిరుమలకు కాలినడకన వెళ్లేవారు. అదేక్రమంలో వృద్ధాప్యంలో సైతం తిరుమలకు బయలుదేరిన ఆయన గ్రామపొలిమేరలకు రాగానే సొమ్మసిల్లి పడిపోయారు. తిరుమలకు రాలేక పోతున్నానంటూ మదనపడుతున్న ఆయన అవస్థను గమనించిన వేంకటేశ్వరస్వామి లీలగావచ్చి ఈవయస్సులో అంతదూరం రావాల్సిన అవసరం లేదని నీపక్కనే ఉన్న పుట్టలోనే నేను ఉన్నానని బయటకు తీసి దర్శించుకోవాలని తెలిపారు. వెంటనే తేరుకున్న ఆ భక్తుడు గ్రామంలోకి వెళ్లి మనుషులను తీసుకొచ్చి పుట్టను తవ్వటం ప్రారంభించారు. గునపంతో తవ్వుతుండగా అది స్వామి గుండెల్లో దిగి రక్తం రావడంతో తవ్వటం ఆపి పాలతో పుట్టను కరిగించి విగ్రహాన్ని బయటకు తీసి చిన్న దేవాలయం నిర్మించి పూజలు చేశారు. పుట్టను తవ్వే క్రమంలో గునపంతో తగిలిన గాయం స్వామి విగ్రహానికి ఛాతిపై ఇప్పటికీ కనిపిస్తుంది. అలా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్య పూజలందుకుంటూ భక్తుల కొంగుబంగారంగా మారాడు. ఇక్కడ ఏకశిలలోనే శ్రీదేవి, భూదేవి, వే ంకటేశ్వరస్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. కాలక్రమంలో గోల్కొండ సామ్రాజ్యంలో మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు దేవాలయానికి అవసరమైనపలు నిర్మాణాలను చేపట్టారు. అప్పటి సినీనటి భానుమతి, మార్వాడీలు అద్దాలమహల్, కోనేరులను కట్టించి దేవాలయానికి మరింత శోభను తెచ్చారు. కార్తీక వైభవం కార్తీక మాసం పురస్కరిం చుకుని చిలుకూరు బాలాజీ దేవాల యానికి శని వారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాం గణంలో కార్తీక దీపాలు వెలిగిం చారు. 11, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు మహాద్వార దర్శనమే ఏర్పాటు చేశారు. భక్తులకు స్వామివారి తీర్థప్రసాదలు అందించారు. కార్తీక మాసంలో భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినదానితో సమానమని, అందుకే ప్రతి ఒక్కరూ సమీపంలోని ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించాలని ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులకు సూచించారు. రెండు వత్తులతోనే కార్తీక దీపాలు వెలిగించాలని అవి రెండు జీవాత్మ, పరమాత్మగా జ్యోతి రూపంలో వెలుగుతాయని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులచే 108 వ్యాక్యాల రామనామ సంకీర్తనలు పారాయణం చేయిస్తున్నామన్నారు. సౌకర్యాలు.. భక్తులకోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గతంలో రాత్రి సమయంలో ఆలయం వద్ద నిద్రించేందుకు తగిన సౌకర్యాలు ఉండేవి కావు. ప్రస్తుతం పర్యాటక శాఖ ప్రత్యేకంగా భవనం నిర్మించింది. ఇందులో ఐదు గదులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గదికి 24 గంటలకు రూ. 1050 చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు రెస్టారెంట్ సైతం అందుబాటులో ఉంది. భక్తులకోసం ప్రత్యేకంగా త్వరలో బాత్రూంలు, టాయిలెట్స్ నిర్మించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. రవాణా సౌకర్యం... చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకునేందుకు నగరం నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మెహిదీపట్నం నుంచి ప్రతి ఐదు నిమిషాలకో బస్సు(288D) బయలుదేరుతుంది. ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి సైతం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. లంగర్‌హౌస్ నుంచి ఆటోల్లోనూ చిలుకూరుకు చేరుకోవచ్చు. దేవుళ్లతో వ్యాపారం సరికాదు దేవాలయాలన్నీ ప్రస్తుతం వ్యాపార కేంద్రాలుగా మారాయి. కొబ్బరికాయ కొట్టాలన్నా, దేవుణ్ని దర్శించుకోవాలన్నా టిక్కెట్లు కొనాల్సిన పరిస్థితి ఉంది. దేవుళ్లతో వ్యాపారం చేయడం సరికాదు. వీటికి భిన్నంగా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని నడుపుతున్నాం. దీనికోసం అనేక ఉద్యమాలు చేశాం. చిలుకూరులో భక్తులకు భక్తే లభిస్తుంది. అన్ని దేవాలయాలు ఇలాగే కొనసాగాలన్నది మా తాపత్రయం. - ఎంవీ.సౌందరరాజన్, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ భక్తులంతా సమానమే.. భగవంతుని సన్నిధిలోకి వచ్చిన భక్తులందరికీ మనశ్శాంతి కలగాలి. ఆయనకు అందరూ సమానమే. అలాంటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకం దర్శనాలు, సేవలు కల్పించాల్సిన పనిలేదు. చిలుకూరులో కొనసాగుతున్న ఈ పద్ధతి అందరికీ నచ్చింది. అందుకే రోజురోజుకూ భక్తుల రాక పెరుగుతోంది. ఇక్కడ టిక్కెట్లు, హుండీలు, కానుకలు లేకుండా అందరికీ సమానంగా స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నాం. - గోపాలకృష్ణ, ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ ఉపాధి పొందుతున్నాం.. బాలాజీ దేవాలయం అభివృద్ధి చెందాకా వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. కొబ్బరి కాయలు, పుస్తకాలు, గాజులు, బొమ్మలు, హోటళ్లు వంటివి ఏర్పాటు చేసుకుని చాలామందిమి ఇక్కడ బతుకుతున్నాం. 15 సంవత్సరాలుగా మాకు ఇక్కడే ఉపాధి దొరుకుతోంది. -చంద్రకళ, చిరువ్యాపారి -
కొల్లేరుకు కొత్త అందాలు!
►పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ►అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ►జల రవాణాను పునరుద్ధరిస్తే బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వ వైభవం సాక్షి, ఏలూరు : పచ్చని ప్రకృతి నడుమ విదేశీ పక్షుల విడిదికి ఆలవాలమైన కొల్లేటి సరస్సు కొత్త కళను సంతరించుకోనుంది. పర్యాటక అభివృద్ధితో జిల్లాకే తలమానికంగా నిలవనుంది. కొల్లేరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం చేసిన ప్రకటనతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అతిపెద్ద సరస్సు.. పక్షుల సొగసు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 673 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. వందలాది రకాల స్వదేశీ, విదేశీ పక్షులు ఇక్క కనువిందు చేస్తాయి. ఈ సరస్సు వల్ల జిల్లాకు ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. సైబీరియా, ఫిజీ దీవుల నుంచి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి పెలికాన్ (గూడ) పక్షులు ఏటా కొల్లేరు సరస్సుకు వస్తుంటాయి. ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతారుు. పిల్లలకు మూడు నెలలు వయసు రాగానే సైబీరి యూకు పయనమవుతాయి. పెలికాన్లతోపాటు ఎర్రకాళ్ల కొంగ, నత్తగుళ్ల కొంగ, చుక్క పరద, తోక పరద, ఈల పరద, ఉల్లంకి వంటి అనేక పక్షులు కొల్లేరులో సందడి చేస్తున్నాయి. పర్యాటకాభివృద్ధికి శ్రీకారం ఈ పక్షులను చూసేందుకు పర్యాట కులు ఇప్పటికే పెద్దసంఖ్యలో వస్తున్నారు. శని, ఆదివారాల్లో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులో ఆటపాక వద్ద గల పక్షుల సంరక్షణ కేంద్రానికి స్థానిక పర్యాటకులు వెళుతుంటారు. ఆటపాక తరహాలోనే ఏలూరు మండలంలోని మాధవరంలోనూ మరో పక్షుల విడిది కేంద్రాన్ని అటవీ శాఖ ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం నిధులు సమకూరిస్తే రిసార్టులు నిర్మించడంతోపాటు, బోటుషికారు ఏర్పాటు చేయనున్నారు. సహజ సౌందర్యాన్ని కోల్పోయి... ప్రస్తుతం కొల్లేరు సరస్సు ఆక్రమణలకు గురై సహజ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. సరస్సును చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. నీరు కలుషితం అవుతోంది. రోడ్లు ఛిద్రమయ్యాయి. తాజాగా కొల్లేరును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆక్రమంగా తవ్విన చెరువులను ధ్వంసం చేసే పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇదంతా పర్యాటకాభివృద్ధిలో భాగంగా కనిపిస్తోంది. బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వవైభవం! జల రవాణాను పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో బకింగ్‌హామ్ కెనాల్‌కు పూర్వవైభవం వచ్చే అవకాశం ఏర్పడనుంది. కొన్నేళ్ల క్రితం జాతీయ నౌకాయాన శాఖ పర్యవేక్షణలో 100 మీటర్ల వెడల్పుగల బకింగ్‌హామ్ కాలువలో సరుకుల రవాణా సాగేది. ఏలూరులోని తమ్మిలేరును దాటుకుని, తూర్పు లాకుల ద్వారా ఏలూరు కాలువ నుంచి తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా విజ్జేశ్వరం లాకులను చేరుకుని, అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఈస్ట్రన్ కెనాల్ నుంచి కాకినాడ సముద్రం వరకూ ఈ జలమార్గ ప్రయాణం సాగేది. నరసాపురం, భీమవరం ప్రాం తాల్లోని కాలువలు కూడా దీనికి అనుసంధానమై ఉండేవి. బకింగ్‌హామ్ కెనాల్లో జలరవాణా ముమ్మరంగా జరిగే రోజుల్లో తాడేపల్లిగూడెం వార్ఫురోడ్లో ఉన్న పాయింట్‌ను ప్లీట్ అని పిలిచేవారు. ఇక్కడి నుంచి 120 పడవలు చెన్నైకు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు సరుకులను చేరవేసేవి. యద్దనపూడి వెంకటసుబ్బారావు పడవల యజమానిగా ఉండేవారు. కాలక్రమేణా జలమార్గం మూతపడింది. 2008లో దశలవారీగా బకింగ్‌హామ్ కాలువలో జలరవాణా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటు ఉంటే విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాకినాడ వరకు జల రవాణా మళ్లీ ఊపిరిపోసుకుం టుంది. జిల్లాలో దాదాపు 82 కిలోమీటర్ల పొడవున గల జలరవాణా బకింగ్‌హామ్ కెనాల్ మార్గానికి అనుసంధానంగా ఉండేది. ప్రస్తుతం కాలువ మార్గం కుచించుకుపోయింది. పంట పొలాలు, రోడ్ల విస్తరణ వంటి పనులు కాలువ వెడల్పును తగ్గించేశాయి. జలరవాణా పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తే ఈ అవాంతరాలను తప్పించడం పెద్ద కష్టం కాదు. -
సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 40 మంది పర్యాటకులతో అగస్త్య లాంచీ గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకుసాగర్ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి బయల్దేరింది. ఈ సందర్భంగా సాగర్ రైట్ బ్యాంక్ లాంచీస్టేషన్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండాయని, పర్యాటకుల విజ్ఞప్తి మేరకు లాంచీ ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కృష్ణా నదిలో 110 కిలోమీటర్లు దూరాన్ని 5.30 గంటల్లో చేరుకోవచ్చని, అగస్త్య లాంచీ గ ంటకు 20 కిలోమీటర్లు వేగంతో నదిలో ప్రయాణిస్తుందన్నారు. రెండు రోజుల ప్రయాణానికి పర్యాటక సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. లాంచీలో పర్యాటకులతో పాటు సాగర్ పర్యాటక సంస్థ డీవీఎం జోయల్, మార్కెటింగ్ మేనేజర్ మనోహర్ తదితరులు వెళ్లారు. ప్యాకేజీ వివరాలివీ...లాంచీ ప్రయాణం (మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే)..హైదరాబాద్ నుంచి పర్యాటక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ నుంచి ముందుగా సాగర్‌కు చేరుకోవాలి. అక్కడ నుంచి లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ రెండు రోజులూ భోజన, లాడ్జింగ్ వసతి పర్యాటక శాఖ కల్పిస్తుంది. శ్రీశైలం మల్లన్న దర్శనం, నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం కూడా చూపిస్తారు. పెద్దలకు రూ. 3150, పిల్లలకు రూ. 2520 చార్జిగా నిర్ణయించారు. నాగార్జునసాగర్ నుంచి అయితే..రెండు రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పెద్దలకు చార్జీ రూ. 2500, పిల్లలకు రూ. 2000. ఈ రెండు రోజులూ భోజన, లాడ్జింగ్ వసతి పర్యాటక సంస్థ ఏర్పాటు చేస్తుంది. శ్రీశైలం మల్లన్న దర్శనం, నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం కూడా చూపిస్తారు. కేవలం అప్ అయితే...నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో కేవలం అప్ మాత్రమే వెళితే ఎవరికైనా రూ. 600 చార్జ్ చేస్తారు. వీరిని శ్రీశైలంలో దింపుతారు.