తీర్థయాత్రలు తెలుసు. సరదా టూర్లు తెలుసు. స్నేహితులతో విహారాలు తెలుసు. కాని నిద్ర కోసమే టూరిజమ్ చేయడం నేటి ట్రెండ్. ఎక్కడికైనా వెళ్లి హాయిగా రెండు రోజులు నిద్ర పోవాలి అనుకునేవారు చేసేదే ‘స్లీప్ టూరిజమ్’. అంతే కాదు ఇంట్లో నిద్ర పట్టని వారు నిద్ర లేమితో బాధ పడేవారుతమ రిసార్ట్‌లకు వచ్చి హాయిగా నిద్ర పోయేలా యోగా, ఆహారం, మసాజ్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇండియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్. మీకూ నిద్ర కావాలా? ప్రయాణం కట్టండి.
రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కథ ఒకటి ఉంటుంది. దాని పేరు ‘సుఖాంతం’. అందులో 60 ఏళ్లకు చేరుకున్న ఒక గృహిణి తన బాల్యం నుంచి కంటి నిండా నిద్ర పోనివ్వని ఇంటి పనులు ఎన్ని చేసిందో, భార్యగా కోడలిగా తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నిద్రకు ఎలా ముఖం వాచిందో తలుచుకుంటూ ఆఖరుకు మంచి నిద్ర కోసం గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. ఆ కథకు చాలా పేరు వచ్చింది.
స్త్రీల నిద్రను ఇల్లు పట్టించుకోదు. వాళ్లు తెల్లారే లేవాలి. రాత్రి అందరూ నిద్ర పోయాక వంట గది సర్ది నిద్రకు ఉపక్రమించాలి. పగలు కాసేపు కునుకు తీద్దామన్నా పని మనిషి, పాలవాడు, పేపర్‌వాడు, అమేజాన్ నుంచి... స్విగ్గీనుంచి... అంటూ ఎవరో ఒకరు తలుపు కొడుతూనే ఉంటారు. స్త్రీలకు కంటి నిండా నిద్ర పోయే హక్కు లేదా?
అయితే కోవిడ్ వచ్చాక ప్రపంచ వ్యాప్తంతో పాటు భారతదేశంలో కూడా నిద్ర కరువు పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలలో భీతి, తెలియని ఆందోళన, పరుగు ఇవన్నీ చాలామందిని నిద్రకు దూరం చేశాయి. నీల్సన్ సంస్థ మన దేశంలోని 25 నగరాల్లో 5,600 మందిని సర్వే చేస్తే 93 శాతం మంది నిద్ర లేమితో బాధ పడుతున్నట్టు తెలిసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, భార్యాభర్తల్లో అనురాగం తగ్గిపోవడం, సౌకర్యమైన బెడ్‌రూమ్ లేకపోవడం, గుర్‌గుర్‌మంటూ తిరిగే ఫ్యాను, లేదా భార్యా/భర్త తీసే గురక, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండు, అన్నీ బాగున్నా కొందరిలో వచ్చే ‘నిద్రలేమి’ సమస్య... ఇవన్నీ నిద్రకు దూరం చేస్తాయి. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోయి హాయిగా నిద్ర పోతేనో అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రపంచమంతా ఒకేసారి వచ్చింది. అందుకే ఇప్పుడు ‘స్లీప్ టూరిజమ్’ ట్రెండ్‌గా మారింది.
మనిషికి కావలసింది ఆ రెండే
ఏ మనిషికైనా కావలసింది రెండు అవసరాలు. ఒకటి మంచి విశ్రాంతి. రెండు మంచి నిద్ర. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. మంచి నిద్ర వల్లే మంచి ఆరోగ్యం ఉంటుంది. నిద్ర పట్టకపోవడం కంటి నిండా నిద్ర లేదనే బాధ ఉండటం మంచిది కాదు. స్థలం మారిస్తే ఆరోగ్యం బాగుపడినట్టు స్థలం మారిస్తే మంచి నిద్ర పట్టొచ్చు. అంతే కాదు పోటీ ప్రపంచానికి దూరంగా ఒత్తిడి లేకుండా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు.
కాబట్టి ఈ కొత్త ట్రెండ్‌కు స్వాగతం చెప్పండి. మీకు నిద్రలేమి బాధ ఉంటే గనుక వెంటనే బ్యాగ్ సర్దుకోండి.
లండన్‌లో తొలి ‘స్లీప్ హోటల్’... 2000 సంవత్సరంలో లండన్‌లో జెడ్‌వెల్ అనే హోటల్ ‘సౌండ్‌ప్రూఫ్’ గదులతో తనను తాను ‘స్లీప్ హోటల్’గా ప్రమోట్ చేసుకుంది. ఆ తర్వాత పోర్చుగీసులో తొలి ‘స్లీప్ స్పా హోటల్’ అవిర్భవించింది. ఇప్పుడు అమెరికాలో హోటళ్లలో ‘స్లీప్ స్వీట్‌రూమ్స్’ ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ కేవలం నిద్ర కోసమే. గతంలో విహారాలు బాగా తిరిగి ఆ మూల ఈ మూల చూసి రావడానికి ఉద్దేశింపబడేవి.
స్లీప్ ట్రావెల్స్ మాత్రం కేవలం ఒక చోటుకు వెళ్లి హాయిగా నిద్ర పోవడమే పనిగా పెట్టుకునేది. రిసార్టులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు వీటి కోసం ఎలాగూ ఉన్నా భారతదేశంలో తమకు నచ్చిన చోటుకు వెళ్లి నిద్ర పోవడానికి ‘క్యారవాన్’లు అద్దెకు దొరుకుతున్నాయి. అంటే వాటిని బుక్ చేసుకొని అలా విహారానికి వెళుతూ ఏ చెరువు ఒడ్డునో అడవి మధ్యనో ఆదమరిచి నిద్రపోవచ్చన్నమాట.
మంచి పరుపులు, మసాజ్‌లు... మన దేశంలో ముఖ్యమైన ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఖరీదైన రిసార్ట్‌లు అన్నీ ఇప్పుడు స్లీప్ టూరిజమ్‌కు ఏర్పాట్లు చేశాయి. కొన్ని హోటళ్లు ‘స్లీప్ డాక్టర్ల’తో సెషన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. వాళ్లు గెస్ట్‌లతో మాట్లాడి వారి నిద్ర బాధకు విరుగుడు చెబుతారు. ఆయుర్వేద మసాజ్‌లు, గదిలో ఉండాల్సిన సువాసనలు, నిద్ర వచ్చేందుకు చేసే స్నానాలు, శాస్త్రీయమైన మంచి పరుపులు, అంతరాయం కలిగించని గదులు, నిద్రను కలిగించే ఆహారం... ఇవన్నీ ప్యాకేజ్‌లో భాగంగా ఇస్తున్నారు. ఇవాళ ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేస్తే ఎన్నో హోటళ్లు స్లీప్ ట్రావెల్ కోసం ఆహ్వానం పలుకుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment