చక్కటి వ్యవహార శైలి అలవడే అవకాశం
భావోద్వేగాలపై నియంత్రణ
చిన్నారుల నిద్రపై పరిశోధనలో వెల్లడైన పలు ఆసక్తికర అంశాలు
న్యూఢిల్లీ: నిద్ర. అలసిన శరీరాన్ని అమాంతం ఆక్రమించి మరోలోకానికి తీసుకెళ్లే అదృశ్యదేవత. అలాంటి నిద్రాదేవత ఆవాహన చిన్నారుల్లో రోజూ ఒకేసమయంలో జరిగితే ఒనగూరే ప్రయోజనాలు అంతాఇంతా కాదని తాజా పరిశోధనాలో వెల్లడైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ మేరకు ఆరేళ్ల వయసు చిన్నారులపై ఒక విస్తృతస్థాయి, సుదీర్ఘ పరిశోధన చేశారు.
పుట్టినప్పటి నుంచి రెండున్నరేళ్ల వయసు వచ్చే వరకు కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులు శ్రద్ధాసక్తులతో పెంచేలా ఆ పేరెంట్స్‌కు శిక్షణనిచ్చారు. చిన్నారి వేర్వేరు సందర్భాలకు తగ్గ భావోద్వేగాలు, శారీరక అవసరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి ఆలనాపాలనా బాధ్యతలను చక్కగా నెరవేర్చేలా చూశారు. మారాంచేసినపుడు గారాబం చేయకుండా పరిస్థితిని చక్కగా విడమరిచి చెప్పేలా తల్లిదండ్రులకు తగు తరీ్ఫదునిచ్చారు. అలసపోయి నిద్రలోకి జారుకునేటపుడు నిద్రకు అనువైన వాతావరణం ఉండేలా చూడడం, దీపాలన్నీ ఆర్పేసి చిన్నారులను వీపుపై తడుతూ బుజ్జిగించి పడుకోబెట్టడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు.
పరిశోధనలో ఏం తేలింది?
ఇలా చేయడం వల్ల చిన్నారులు రోజూ ఒకే సమయానికి పడుకోగలిగారు. నిద్రసమయం కూడా దాదా పు వారి వయసుకు తగ్గట్లు ఉండేది. దీంతో చిన్నారులు తమ దైనందిన జీవితంలో చవిచూసిన భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడం పరిశోధకులు గమనించారు. ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సాధ్యమైంది. ‘‘స్థిరమైన నిద్రాకాలం అనేది పిల్లల ఎదుగుదలకూ ఎంతో తోడ్పడింది. నిద్రసరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వీరిలో తలెత్తలేదు’’అని పరిశోధకులు చెప్పారు. సంబంధిత వివరాలు డెవలప్‌మెంటల్ అండ్ బిహేవియర్ పిడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఇతర చిన్నారుల్లో ఇబ్బందులు
పరిశోధనకు ఎంచుకున్న పిల్లలతో పోలిస్తే అస్తమానం అస్తవ్యస్త్య సమయాల్లో నిద్రించే పిల్లల్లో భావోద్వేగాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో కీలక పరిశోధకుడు అద్వా డాడ్జీ చెప్పారు. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీలో బిహేవియర్ హెల్త్ విభాగంలో సేవలందిస్తున్నారు. పరిశోధకులు పిల్లలు రోజు ఏ సమయానికి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, గాఢనిద్ర వివరాలు తెల్సుకునేందుకు వాళ్ల మణికట్టుకు మానిటర్‌లను అమర్చారు.
ఎలాంటి ప్రయోగాలు చేశారు?
ఒకేసమయంలో నిద్రించే పిల్లలకు ఒక పెద్ద బొమ్మల సమూహం నుంచి ఒకేఒక్క బొమ్మను తీసుకుని ఆడుకోవాలని సూచించారు. ప్రతి బొమ్మను విడివిడిగా ఒక చిన్న పెట్టెలో తాళం వేసి దాచారు. ఆ పెట్టెల తాళంచెవులను ఇచ్చి తెరచి తీసి ఆడుకోవాలని సూచించారు. ఏ తాళంచెవికి ఏ పెట్టే తెరచుకుంటుందో కనిపెట్టేందుకు.. ఒకేసమయంలో నిద్రించే పిల్లలు మాత్రం శ్రద్ధగా ఒక్కో పెట్టెను తాళంచెవితో తెరచే ప్రయత్నంచేశారు.
నిద్రానియమంలేని పిల్లలు మాత్రం ఒక్కో పెట్టెను తెరిచే ఓపికలేక ఆవేశంతో ఆ తాళం చెవులను విసిరిపారేశారు. మరో ప్రయోగంలో రెండు రకాల పిల్లలను ఒకచోటచేర్చి కలిసి ఆడుకోండని సూచించారు. ఈ సందర్భంలోనూ నిద్రనియంత్రణ ఉన్న పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంచేశారు. కొందరు పిల్లలను వారంలో ప్రతి రోజూ ఒక 20 నిమిషాలు ముందుగా లేదా 20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయేలా చేశారు. ఇంకొందరిని వారంరోజులపాటు ఏకంగా రెండు గంటలు ముందుగా లేదంటే ఆలస్యంగా నిద్రపోనిచ్చారు. 20 నిమిషాల తేడాతో నిద్రించిన పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment