నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో భాగంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తం 40 మంది పర్యాటకులతో అగస్త్య లాంచీ గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకుసాగర్ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలానికి బయల్దేరింది. ఈ సందర్భంగా సాగర్ రైట్ బ్యాంక్ లాంచీస్టేషన్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు పూర్తిగా నిండాయని, పర్యాటకుల విజ్ఞప్తి మేరకు లాంచీ ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కృష్ణా నదిలో 110 కిలోమీటర్లు దూరాన్ని 5.30 గంటల్లో చేరుకోవచ్చని, అగస్త్య లాంచీ గ ంటకు 20 కిలోమీటర్లు వేగంతో నదిలో ప్రయాణిస్తుందన్నారు.
రెండు రోజుల ప్రయాణానికి పర్యాటక సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. లాంచీలో పర్యాటకులతో పాటు సాగర్ పర్యాటక సంస్థ డీవీఎం జోయల్, మార్కెటింగ్ మేనేజర్ మనోహర్ తదితరులు వెళ్లారు. ప్యాకేజీ వివరాలివీ...లాంచీ ప్రయాణం (మంగళ, గురు, శనివారాల్లో మాత్రమే)..హైదరాబాద్ నుంచి పర్యాటక సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ నుంచి ముందుగా సాగర్‌కు చేరుకోవాలి. అక్కడ నుంచి లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ రెండు రోజులూ భోజన, లాడ్జింగ్ వసతి పర్యాటక శాఖ కల్పిస్తుంది. శ్రీశైలం మల్లన్న దర్శనం, నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం కూడా చూపిస్తారు.
పెద్దలకు రూ. 3150, పిల్లలకు రూ. 2520 చార్జిగా నిర్ణయించారు. నాగార్జునసాగర్ నుంచి అయితే..రెండు రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పెద్దలకు చార్జీ రూ. 2500, పిల్లలకు రూ. 2000. ఈ రెండు రోజులూ భోజన, లాడ్జింగ్ వసతి పర్యాటక సంస్థ ఏర్పాటు చేస్తుంది. శ్రీశైలం మల్లన్న దర్శనం, నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం కూడా చూపిస్తారు. కేవలం అప్ అయితే...నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో కేవలం అప్ మాత్రమే వెళితే ఎవరికైనా రూ. 600 చార్జ్ చేస్తారు. వీరిని శ్రీశైలంలో దింపుతారు.