తెలంగాణ తిరుమల.. చిలుకూరు బాలాజీ | Tirumala Telangana .. chilkur balaji | Sakshi
Sakshi News home page

తెలంగాణ తిరుమల.. చిలుకూరు బాలాజీ

Published Sun, Nov 2 2014 1:54 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM

తెలంగాణ తిరుమల.. చిలుకూరు బాలాజీ - Sakshi

తెలంగాణ తిరుమల.. చిలుకూరు బాలాజీ

కలియుగదైవమైన వేంకటేశ్వరస్వామి మూడుచోట్ల ప్రత్యక్షంగా వెలిసినట్టు ప్రతీతి. అందులో ఒకటి చిత్తూరు జిల్లా తిరుమల, రెండోది తూర్పుగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల కాగా, మూడోది తెలంగాణ ప్రాంతంలోని చిలుకూరులో అని పురాణాలు చెబుతున్నాయి.  తెలంగాణ తిరుమలగా పేరొందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల పైగా చరిత్ర ఉంది. దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందింది. వీఐపీ దర్శనాలు, టిక్కెట్లు, హుండీలులేని దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఒకే దేవాలయ ప్రాంగణంలో అటు వేంకటేశ్వరస్వామి ఇటు శివుడు పూజలందుకుంటూ విశిష్ట ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిరోజు 20 వేలు,  సెలవు రోజుల్లో 30 వేల నుంచి 50 వేల వరకు భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉస్మాన్‌సాగర్ ఒడ్డున దేవాలయం ఉండడంతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.. ఆలయ ప్రశస్తి గురించి మరికొంత ఈ వారం సండే స్పెషల్...        - మొయినాబాద్
 
*వీసాల దేవుడు
* ఐదు వందల సంవత్సరాల చరిత్ర
* వీఐపీ దర్శనాలు, టిక్కెట్లు, హుండీలులేని దేవాలయంగా ప్రసిద్ధి
* అనతికాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి

 
ప్రాచుర్యం పొందిందిలా...
రాష్ట్రంలో ఏ దేవాలయానికి వెళ్లినా భక్తులు వారి స్థాయికి తగ్గట్టు పూజలకు, కొబ్బరికాయకొట్టటానికి, దర్శనానికి తప్పనిసరి టిక్కెట్లు కొనుక్కుని సేవలను పొందటం అందరికీ తెలిసిందే. మొదట్లో చిలుకూరు బాలాజీ దేవాలయంలో హుండీ మాత్రమే ఉండగా 2001 సంవత్సరం నుంచి అదీ తొలగించారు. దేవుని వద్ద అంతా సమానమే అనే నినాదంతో ఎలాంటి టిక్కెట్లు, హూండీలు, ప్రత్యేక దర్శనాలు లేకుండా మార్పు చేశారు. ఈ విషయం అందరికీ కొత్తగా అనిపించి ఆనోటా ఈనోట రాష్ట్రవ్యాప్తంగా పాకి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగింది. మొదటిసారి దర్శించుకున్నప్పుడు 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలు కోరుకోవటం, అది తీరాక వచ్చి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునే పద్ధతి ఇక్కడ కొనసాగుతోంది.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు చిలుకూరు బాలాజీ ఆలయం లాగానే నడపాలంటూ ఉద్యమాలు సైతం నడిచాయంటే ఇక్కడి నిర్వహణ విధానం భక్తులకు ఎంతగా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం 29.2.2008న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవాలయంగా ప్రకటించించింది. ఆలయ పూజారి సౌందరరాజన్‌ను చైర్మన్‌గా, మరోపూజారి గోపాలకృష్ణను కన్వీనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయ నిర్వహణకు భక్తుల నుంచి బ్యాంకు అకౌంట్లద్వారా నిత్యపూజానిధిని తీసుకునే వీలును కల్పించింది.  
 
ప్రపంచవ్యాప్తంగా..
గతంలో ఐటీ రంగం ఒక వెలుగు వెలుగుతున్న  సమయంలో వీసాలురాక ఎంతో మంది ఇంజినీరంగ్ పూర్తిచేసిన విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. కోరిన కోర్కెలు వెంటనే తీర్చె చిలుకూరు బాలాజీ దేవాలయం విశిష్టతను తెలుసుకుని ఎక్కువశాతం మంది త్వరగా వీసాలు రావాలంటూ కోరుకోవటంతో వెంటనే వచ్చాయనేది భక్తుల నమ్మకం. అలా ఉద్యోగాలు పొంది ఇతర దేశాల నుంచి వచ్చి సైతం మొక్కులు తీర్చుకున్నారు. అమెరికాలో ఎక్కువశాతం ఉద్యోగాలు సంపాదించిన వారిలో చిలుకూరు బాలాజీ భక్తులే కావటంతో  ఇక్కడి స్వామివారికి వీసాల దేవుడిగా పేరొచ్చింది.

ఈ విషయం తెలుసుకున్న అమెరికాలోని ప్రముఖ పత్రికవాల్‌స్ట్రీట్ జర్నల్ చిలుకూరు బాలాజీ విశిష్టతను ప్రముఖంగా ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం కల్పించింది. ఇటీవల అమెరికాలో ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగాలు పోతున్న సమయంలో సైతంవారంతా ప్రతి ఇంట్లో చిలుకూరు బాలాజీ ఫొటోలు పెట్టుకుని తమ ఉద్యోగాలను నిలపాలంటూ పూజలు చేస్తున్న విషయాన్ని సైతం అదే పత్రిక ప్రచురించింది.
 
సామాజిక దృక్పథం
భక్తుల నుంచి ఆదాయాన్ని ఆశించకుండా సమాజానికి ఎలాంటి మంచి సందేశాన్ని ఇద్దాం, భక్తుల ఇబ్బందులకు ఆధ్యాత్మికతను జోడించి ఎలా ఉపశమనం కలిగిద్దామనే ఉద్దేశంతో చిలుకూరు దేవాలయ పూజారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు నివారణోపాయంగా ప్రభుత్వం తీసుకునే చర్యలతో పాటు ప్రతి ఒక్కరూ ఖాధీ వస్త్రాలను దరించాలని విన్నపం చేశారు.

ప్రతి శనివారం దేవాలయానికి వచ్చే భక్తులు ఖాధీ వస్త్రాలు మాత్రమే దరించి రావాలనే సూచనతో వారిలో నైతిక స్థైర్యాన్ని నింపారు. ప్లాస్టిక్ వాడకంతో సమాజానికి ఎంత కీడు జరుగుతుందో తెలియజెప్పాలనే ఉద్దేశంతో దేవాలయం వద్ద ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిరోధించి చేనేతబ్యాగులను ప్రవేశపెట్టారు. అమెరికాలో ఉద్యోగాలు పోతున్న వారిని కాపాడాలని, యేటా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఐదేళ్లుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
 
అభివృద్ధి ఇలా..
దేవాలయం చుట్టూ గతంలోనే రూ.26 లక్షలతో సీసీ రోడ్లు నిర్మంచగా ఇటీవల రూ.8 లక్షలతో దేవాలయం ముందు భాగంలో సైతం రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. మంచినీటి ఇబ్బందిని తీర్చటానికి ఎక్కడికక్కడ కులాయిలు ఏర్పాటు చేశారు. ఓ దాత సాయంతో దేవాలయానికి ముఖద్వారం లేని లోటును సైతం తీర్చారు. దేవాలయం ముందుభాగంలో రావి చెట్టుకింద ఫ్లోరింగ్ పనులను చేపట్టి భక్తులు సేదతీరటానికి అనుకూలంగా చేశారు. దేవాలయం లోపల క్యూలైన్ల ఏర్పాటు, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పర్యాటకశాఖ నిధుల నుంచి రూ.72లక్షలు వెచ్చించి హోటల్, గదులను నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాల కూడా కొనసాగుతోంది.


 
 

ఆలయ చరిత్ర
పూర్వం చిలుకూరు గ్రామంలో గున్నాల మాదవరెడ్డి అనే వేంకటేశ్వరస్వామి అపర భక్తుడు ఉండేవారు. యేటా క్రమం తప్పకుండా స్వామివారి దర్శనానికి తిరుమలకు కాలినడకన వెళ్లేవారు. అదేక్రమంలో వృద్ధాప్యంలో సైతం తిరుమలకు బయలుదేరిన ఆయన గ్రామపొలిమేరలకు రాగానే సొమ్మసిల్లి పడిపోయారు. తిరుమలకు రాలేక పోతున్నానంటూ మదనపడుతున్న ఆయన అవస్థను గమనించిన వేంకటేశ్వరస్వామి లీలగావచ్చి ఈవయస్సులో అంతదూరం రావాల్సిన అవసరం లేదని నీపక్కనే ఉన్న పుట్టలోనే నేను ఉన్నానని బయటకు తీసి దర్శించుకోవాలని తెలిపారు. వెంటనే తేరుకున్న ఆ భక్తుడు గ్రామంలోకి వెళ్లి మనుషులను తీసుకొచ్చి పుట్టను తవ్వటం ప్రారంభించారు.

గునపంతో తవ్వుతుండగా అది స్వామి గుండెల్లో దిగి రక్తం రావడంతో తవ్వటం ఆపి పాలతో పుట్టను కరిగించి విగ్రహాన్ని బయటకు తీసి చిన్న దేవాలయం నిర్మించి పూజలు చేశారు. పుట్టను తవ్వే క్రమంలో గునపంతో తగిలిన గాయం స్వామి విగ్రహానికి ఛాతిపై ఇప్పటికీ కనిపిస్తుంది. అలా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్య పూజలందుకుంటూ భక్తుల కొంగుబంగారంగా మారాడు. ఇక్కడ ఏకశిలలోనే శ్రీదేవి, భూదేవి, వే ంకటేశ్వరస్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. కాలక్రమంలో గోల్కొండ సామ్రాజ్యంలో మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు దేవాలయానికి అవసరమైనపలు నిర్మాణాలను చేపట్టారు. అప్పటి సినీనటి భానుమతి, మార్వాడీలు అద్దాలమహల్, కోనేరులను కట్టించి దేవాలయానికి మరింత శోభను తెచ్చారు.
 
కార్తీక వైభవం
కార్తీక మాసం పురస్కరిం చుకుని చిలుకూరు బాలాజీ దేవాల యానికి శని వారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాం గణంలో కార్తీక దీపాలు వెలిగిం చారు. 11, 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు మహాద్వార దర్శనమే ఏర్పాటు చేశారు. భక్తులకు స్వామివారి తీర్థప్రసాదలు అందించారు. కార్తీక మాసంలో భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినదానితో సమానమని, అందుకే ప్రతి ఒక్కరూ సమీపంలోని ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించాలని ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులకు సూచించారు. రెండు వత్తులతోనే కార్తీక దీపాలు వెలిగించాలని అవి రెండు జీవాత్మ, పరమాత్మగా జ్యోతి రూపంలో వెలుగుతాయని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులచే 108 వ్యాక్యాల రామనామ సంకీర్తనలు పారాయణం చేయిస్తున్నామన్నారు.
 
సౌకర్యాలు..
భక్తులకోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గతంలో రాత్రి సమయంలో ఆలయం వద్ద నిద్రించేందుకు తగిన సౌకర్యాలు ఉండేవి కావు. ప్రస్తుతం పర్యాటక శాఖ ప్రత్యేకంగా భవనం నిర్మించింది. ఇందులో ఐదు గదులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గదికి 24 గంటలకు రూ. 1050 చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు రెస్టారెంట్ సైతం అందుబాటులో ఉంది. భక్తులకోసం ప్రత్యేకంగా త్వరలో బాత్‌రూంలు, టాయిలెట్స్ నిర్మించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది.
 
రవాణా సౌకర్యం...
చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకునేందుకు నగరం నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మెహిదీపట్నం నుంచి ప్రతి ఐదు నిమిషాలకో బస్సు(288D) బయలుదేరుతుంది. ఎల్‌బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి సైతం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. లంగర్‌హౌస్ నుంచి ఆటోల్లోనూ చిలుకూరుకు చేరుకోవచ్చు.
 
 
దేవుళ్లతో వ్యాపారం సరికాదు
దేవాలయాలన్నీ ప్రస్తుతం వ్యాపార కేంద్రాలుగా మారాయి. కొబ్బరికాయ కొట్టాలన్నా, దేవుణ్ని దర్శించుకోవాలన్నా టిక్కెట్లు కొనాల్సిన పరిస్థితి ఉంది. దేవుళ్లతో వ్యాపారం చేయడం సరికాదు. వీటికి భిన్నంగా చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని నడుపుతున్నాం. దీనికోసం అనేక ఉద్యమాలు చేశాం. చిలుకూరులో భక్తులకు భక్తే లభిస్తుంది. అన్ని దేవాలయాలు ఇలాగే కొనసాగాలన్నది మా తాపత్రయం.  
 - ఎంవీ.సౌందరరాజన్, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్  
 
 
భక్తులంతా సమానమే..
భగవంతుని సన్నిధిలోకి వచ్చిన భక్తులందరికీ మనశ్శాంతి కలగాలి. ఆయనకు అందరూ సమానమే. అలాంటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకం దర్శనాలు, సేవలు కల్పించాల్సిన పనిలేదు. చిలుకూరులో కొనసాగుతున్న ఈ పద్ధతి అందరికీ నచ్చింది. అందుకే రోజురోజుకూ భక్తుల రాక పెరుగుతోంది. ఇక్కడ టిక్కెట్లు, హుండీలు, కానుకలు లేకుండా అందరికీ సమానంగా స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నాం.
 - గోపాలకృష్ణ, ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్
 
ఉపాధి పొందుతున్నాం..
బాలాజీ దేవాలయం అభివృద్ధి చెందాకా వందల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. కొబ్బరి కాయలు, పుస్తకాలు, గాజులు, బొమ్మలు, హోటళ్లు వంటివి ఏర్పాటు చేసుకుని చాలామందిమి ఇక్కడ బతుకుతున్నాం. 15 సంవత్సరాలుగా మాకు ఇక్కడే ఉపాధి దొరుకుతోంది.                -చంద్రకళ, చిరువ్యాపారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement