న్యూఢిల్లీ: ఈరోజు(గురువారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశలోని చివరి రోజు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో హంగామా నెలకొంది. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) నివేదికను బీజేపీ ఎంపి మేధా కులకర్ణి ప్రవేశపెట్టారు. మరోవైపు లోక్‌సభలో ఇదేవిధమైన గందరగోళం నెలకొన్న నేపధ్యంలో సభా కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
రాజ్యసభలో జేపీసీ నివేదికపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. తన మంత్రిత్వ శాఖ సభ్యులు జేపీసీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్షాలు నివేదికను చదివి, ఆపై స్పందించాలని ఆయన కోరారు. ప్రశ్నలు లేవనెత్తే వారు కూడా జేపీసీ సభ్యులేనని ఆయన అన్నారు.
వక్ఫ్ బిల్లుపై సభలో ప్రవేశపెట్టిన జేపీసీ నివేదికను ప్రతిపక్షం అంగీకరించబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. దానిని చర్చ కోసం వెనక్కి పంపాలని ఆయన ఛైర్మన్‌ను అభ్యర్థించారు. వక్ఫ్ బిల్లుపై ఏ పార్టీ అభిప్రాయాన్నీ పరిగణలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. వక్ఫ్ బోర్డుపై జేపీసీ నివేదికపై రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
జేపీసీ జనవరి 30న ముసాయిదా నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ నివేదికను 655 పేజీలలో పొందుపరిచారు. 16 మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 11 మంది సభ్యులు వ్యతిరేరించారు. కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(గురువారం) పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను చట్టం-1961ని సరళీకరించడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను-1961 కంటే శరళమైనది. అయితే దీనిలో మరిన్ని విభాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి. 622 పేజీల కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్‌లలో 536 విభాగాలు ఉన్నాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలో 298 విభాగాలు, 14 షెడ్యూల్‌లు ఉన్నాయి. 880 పేజీలు. కాగా పార్లమెంటులో లోక్‌సభ కార్యకలాపాలు ఐదు నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ప్రతిపక్షం గందరగోళం సృష్టించడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్
Comments
Please login to add a commentAdd a comment