రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో ప్రణబ్
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ అందించిన సేవలు మరపురానివి. మరువలేనివి. ప్రజాస్వామ్యబద్ధంగా, హుందాగా, ఉత్తేజంగా రాష్ట్రపతిగా ప్రణబ్ ఉరిమే ఉత్సాహంతో పనిచేశారు. ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ఇంచుమించుగా అంతటి పేరు తెచ్చుకొని రాష్ట్రపతి భవన్‌కు పునరుజ్జీవనం తీసుకువచ్చారు. 2012–2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఇ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చారు.
ఆన్‌లైన్ కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. కేంద్రం అడుగులకి మడుగులు ఒత్తకుండా అన్నివైపుల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం రాష్ట్రపతిగా ఆయన తీసుకునే నిర్ణయాలకు బాగా పనికివచ్చింది. తన పదవీకాలంలో ఆఖరి రెండేళ్లు రాష్ట్రపతి భవన్‌ను ఒక పాఠశాలగా మార్చి తాను స్వయంగా టీచర్ అవతారం ఎత్తారు. రాష్ట్రపతి ఎస్టేట్‌లోని రాజేంద్రప్రసాద్ సర్వోదయ విద్యాలయాలో 11, 12 తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
ఆచితూచి అడుగులు
పార్లమెంటు ఆమోదించిన బిల్లులు సంతకం కోసం రాష్టపతి దగ్గరకి వస్తే ఆయన వెంటనే ఆమోదించేవారు కాదు. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, నష్టాలేంటి అన్న అంశాలన్నీ నిశితంగా పరిశీలించేవారు. భూసేకరణ, పునరావాస చట్టంపై బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వివిధ అంశాలపై ఆర్డినెన్స్‌లు ఎక్కువగా తీసుకువస్తోందని దాదా ఆగ్రహించారు.
ప్రజలకు చేరువగా
భారతీయ చారిత్రక వైభవాన్ని, వారసత్వ సంపదని కాపాడుతూనే రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకి చేరువ కావడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఇన్ రెసిడెన్స్ కార్యక్రమం ద్వారా రచయితలు, కళాకారులు, సృజనాత్మకత ఉన్నవారికి రాష్ట్రపతి భవన్ తలుపులు బార్లా తెరిచారు. సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్రపతి భవన్‌లో ఉంటూ ప్రాజెక్టులు నిర్వహించే సదుపాయం కల్పించారు. రాష్ట్రపతి భవన్‌కు ఎక్కువ మంది అతిథులు వచ్చేలా చర్యలు చేపట్టారు.
క్షమాభిక్ష పిటిషన్లు
ఉరిశిక్ష పడిన వారు దరఖాస్తు చేసుకునే క్షమాభిక్ష పిటిషన్ల విషయంలో ప్రణబ్ చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఖాతాలో ఎక్కువగా తిరస్కరణలే ఉన్నాయి. అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురికి క్షమాభిక్ష ప్రసాదిస్తే, 30 పిటిషన్లను తిరస్కరించారు
పర్యాటక ప్రాంతంగా..
భారత్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా రాష్ట్రపతి భవన్‌ను నిలపడానికి ప్రణబ్ ముఖర్జీ ఎంతో కృషి చేశారు. రాష్ట్రపతి భవన్, మొఘల్ గార్డెన్స్, మ్యూజియం సందర్శించడానికి ప్రజలకు అనుమతులు ఇచ్చారు. ప్రణబ్ హయాంలో భారీగా ప్రజలు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. 2017లో జరిగిన ఉద్యానోత్సవ్‌కి 7 లక్షల మంది వరకు హాజరవడం ఒక రికార్డుగా చెప్పుకోవాలి.
ట్విట్టర్‌లో ‘సిటిజన్ ముఖర్జీ’
ప్రణబ్ ముఖర్జీ హయాంలోనే రాష్ట్రపతి భవన్ మొదటిసారిగా సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టింది. 2014 జూలై 1న ట్విట్టర్‌లో అకౌంట్ ప్రారంభించి ప్రజలకు మరింత చేరువయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ విరమణ చేసినప్పుడు 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రజల మనిషి అయిన ప్రణబ్ ట్విట్టర్‌లో ‘సిటిజన్ ముఖర్జీ’పేరును వాడారు.
కొత్త మ్యూజియం
రాష్ట్రపతి భవన్‌లో గుర్రపు శాలలు ఉండే ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఇందులో మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ దగ్గర్నుంచి ప్రతీ ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ఫొటోలను ఉంచారు. పురాతన ఆయుధాలు, ఫర్నీచర్ కూడా ఈ మ్యూజియంలో కనువిందు చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment