
ఆయన నన్ను తండ్రిలా చూసేవారు: మోదీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తన అనుబంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసుకున్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్న సందర్భంగా మోదీ తన మనసులో మాటలను వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ తనను ఓ తండ్రిలా ఆదరించారని మోదీ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై తండ్రి ఎలా శ్రద్ధ తీసుకుంటారో, నా ఆరోగ్యంపై ప్రణబ్ కొన్నిసార్లు ఆందోళన చెందడం.. ఆయనలో మానవత్వకోణాన్ని చూపిస్తుందన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని, ఆయన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు.
ప్రధాని మోదీ తాను ఢిల్లీకి వచ్చిన తొలి రోజులను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. ఆ సమయంలో ఉన్నతస్థాయిలో ఉన్న ప్రణబ్ నాకు మార్గనిర్దేశం చేశారు. ప్రణబ్ లాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని ప్రధాని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీ కాలం ముగియనున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ ను నిలపగా, విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నాయకురాలు మీరాకుమార్ ఎన్నికల బరిలో ఉన్నారు.