రాజ్యాంగాన్ని పరిరక్షించే అత్యంత క్లిష్టమైన బాధ్యత గవర్నర్లదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు.
గవర్నర్లకు రాష్ట్రపతి ఉద్బోధ
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని పరిరక్షించే అత్యంత క్లిష్టమైన బాధ్యత గవర్నర్లదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. ‘అన్ని చర్యలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో ఉండేలా.. అందులో పేర్కొన్న అత్యున్నత ఆశయాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. రాజ్యాంగ పవిత్రతను కాపాడాలి’ అని గవర్నర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం గవర్నర్ల 47వ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రణబ్, ప్రధాని మోదీ పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపు విషయంలో గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా పాత్ర వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర: మోదీ
మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రాల అభివృద్ధిలో గవర్నర్లు ఉత్ప్రేరక పాత్ర పోషించాలని కోరారు. తాము ప్రత్యక్షంగా భాగస్వాములు కాకుండానే, అభివృద్ధి ప్రక్రియలు వేగవంతం అయ్యేందుకు కృషి చేయాలన్నారు. దేశంలోని సహకార సమాఖ్య వ్యవస్థను ఆరోగ్యకరమైన పోటీదాయక సమాఖ్య వ్యవస్థగా మార్చేందుకు గవర్నర్లు ప్రయత్నించాలన్నారు.