దత్తత తీసుకుందాం రండి..! | Wildlife Animals being adopted at Indira Gandhi Zoo Park | Sakshi
Sakshi News home page

దత్తత తీసుకుందాం రండి..!

Published Sun, Feb 20 2022 5:02 AM | Last Updated on Sun, Feb 20 2022 3:37 PM

Wildlife Animals being adopted at Indira Gandhi Zoo Park - Sakshi

కరోనా మహమ్మారి మీతో పాటు మమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..అది మీ శరీరంలో ప్రవేశించి ప్రాణాలు తీస్తుంది. మమ్మల్ని ఆకలితో అలమటించేటట్లు చేస్తోంది... కొందరు దాతలు పేదలకు భోజనాలు పెడుతున్నారు.. అలాంటి దాతలే ముందుకొచ్చి మమ్మల్ని దత్తత తీసుకొని మా ఆకలి తీర్చండి.. ఇదీ ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాల వేదన.. 
ఆరిలోవ (విశాఖ తూర్పు)

ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణులను దత్తత ఇస్తున్నారు.. జూ  అధికారులు ఇక్కడ జంతువులు, పక్షుల ఆకలి తీర్చడానికి వాటిని దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులకు అవకాశం కల్పిస్తున్నారు. వాటిని మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరంలేదు. దత్తత తీసుకొన్నవారు వాటిని జూలోనే ఉంచి ఆహారం మాత్రమే అందిస్తారు. ఖర్చు మాత్రమే మనం జూ అధికారులకు ఇస్తే సరిపోతుంది. ఆ డబ్బులతో వన్యప్రాణులకు వారే ఆహారం సరఫరా చేస్తుంటారు..

రెండేళ్లు నుంచి ఆకలి బాధలు.. 
జూ పార్కు నగరంలో ప్రధానమైన పర్యాటక కేంద్రం. సాధారణ రోజుల్లో 3,000 పైగా సందర్శకులు వెళుతుంటారు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య 4,000 దాటుతుంది. దీని ప్రకారం రోజులో రూ 1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు ఆదాయం లభిస్తోంది. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి ఆ ఆదాయానికి గండిపడింది. 2020 మార్చి 23 నుంచి అక్టోబర్‌ వరకు లాక్‌డౌన్‌లో భాగంగా జూ పార్కు మూసేశారు. దానివల్ల సుమారు రూ.4 కోట్లు ఆదాయం కోల్పోయింది. 2021లో మళ్లీ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దానివల్ల మరింత ఆదాయం కోల్పోయింది. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ వన్యప్రాణులకు జూ అధికారులు ఆహారం అందిస్తారు. ఆదాయం రాకపోవడంతో గతంలో ఆదా చేసిన డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోంది. జూ నిధి ఖాళీ అవుతోందని జూ అధికారులు ఆందోళనలో పడ్డారు. దాతలు ఆదుకోకపోతే ఇక్కడ వన్యప్రాణుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.. 

ఎంతైనా ఇవ్వవచ్చు.. 
ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి వ్యక్తులు, సంఘాలు, పరిశ్రమలు వారి శక్తి మేరకు సహకారం అందించవచ్చు. వాటి కోసం ఒక రోజుకు, నెల రోజులకు, ఏడాదికి వాటికయ్యే ఖర్చు చెల్లించవచ్చు. జూలో వన్యప్రాణులను దత్తత తీసుకొన్నవారికి ఆదాయ పన్నులో మినహాయింపు ఉంటుంది. ఏనుగు నుంచి చిన్న పక్షి వరకు ఎవరైనా ఎంత కాలానికైనా దత్తత తీసుకోవచ్చు. సింహం, పులికి పశు మాంసం, చికెన్‌ ఆహారంగా వేస్తున్నారు. ఏనుగుకు రాగి సంగటి, చెరకు, గ్రాసం, అరటి దవ్వ, బెల్లం, కొబ్బరి కాయలు అందిస్తున్నారు. చింపాంజీలకు పండ్లు, కాయలు, పాలు ఆహారంగా వేస్తారు. జింకలు, కణుజులు, కొండ గొర్రెలు తదితర వాటికి గ్రాసం వేస్తారు. అన్ని పక్షులకు పలు రకాల పండ్ల ముక్కలు కోసి వేస్తారు. కోతులకు పండ్లు, వేరుశెనగ పిక్కలు వేస్తారు. నీటి ఏనుగుకు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వేస్తారు. ఇలా ఇక్కడ వన్యప్రాణులన్నింటికి వాటి ఆహారం కోసం రోజుకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.. 

జూలో 810కు పైగా వన్యప్రాణులు
జూలో ప్రస్తుతం 90 జాతులకు చెందిన 810కు పైగా వన్యప్రాణులున్నాయి. వాటిలో ఏనుగులు, జీబ్రాలు, పులులు, సింహాలు, జింకలు, జిరాఫీలు, ఎలుగుబంట్లు, నీటి ఏనుగులు, కోతులు, చింపాంజీలు, ఖడ్గమృగం, అడవి కుక్కలు, కణుజులు, అడవిదున్నలు, పాములు, మొసళ్లతో పాటు నెమళ్లు, నిప్పుకోళ్లు, ఈమూలు, హంసలు, మరికొన్ని రంగురంగుల పక్షులు ఉన్నాయి. వాటన్నింటికీ ఆహారం కోసం రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు సహకరించాలని జూ అధికారులు జంతు ప్రేమికులను కోరుతున్నారు. వ్యక్తులు, స్వచ్ఛంద సంఘాలతో పాటు కొన్ని పరిశ్రమలు సీఎస్‌ఆర్‌ నిధులు ఇవ్వడానికి ఇప్పటికే ముందుకొచ్చాయి. మరింత ఎక్కువమంది ఇక్కడ వన్యప్రాణుల దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని జూ అధికారులు కోరుతున్నారు.. 

ఖడ్గమృగాన్ని మూడేళ్లు దత్తత తీసుకున్న  ఐఓసీఎల్‌  
జూలో నకుల్‌ అని పిలవబడే ఇండియన్‌ ఖడ్గమృగాన్ని (మగది) ఐఓసీఎల్‌ ప్రతినిధులు మూడేళ్లు పాటు దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. దీనికోసం జూ క్యూరేటర్‌ నందనీ సలారియాతో ఐఓసీఎల్‌ ప్రతినిధులు వరుసగా మూడేళ్లు పాటు దత్తత తీసుకొన్నట్లు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 13న ఒక ఏడాదికి సరిపడగా రూ.3 లక్షలు చెక్కును ఐవోసీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజయ్‌కుమార్‌ జూ క్యూరేటర్‌ నందనీ సలారియాకు అందజేశారు. 

ఒక జంతువు/పక్షికి దత్తతకు చెల్లించాల్సిన మొత్తం..
► ఏనుగుకు ఒక రోజుకు–రూ.1200 
► ఖడ్గమృగానికి ఒక రోజుకు–820 
► నీటి ఏనుగుకు ఒక రోజుకు–600 
► సింహానికి ఒక రోజుకు–600 
► పెద్ద పులికి ఒక రోజుకు రూ.600 
► జిరాఫీకి ఒక రోజుకు రూ.500 
► చిరుత పులికి ఒక రోజుకు రూ400 
► ఎలుగుబంటి ఒక రోజుకు రూ.300 
► చింపాంజీకి ఒక రోజుకు రూ.210 
► అడవి దున్నకు ఒక రోజుకు రూ.200 
► జీబ్రా రెండింటికి ఒక రోజుకు రూ.330 
► తోడేళ్లు రెండింటికి ఒక రోజుకు రూ.300
► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 
► చుక్కల దుప్పి ఒక రోజుకు రూ.100
► రింగ్‌టైల్డ్‌ లెమూర్‌కు ఒక రోజుకు రూ.100 
► మొసలి/ఘరియల్‌ రెండింటికి ఒక రోజుకు రూ.150 
► హంసలు రెండింటికి రెండు రోజులకు రూ.100 
► నక్షిత్ర తాబేళ్లు పదింటికి ఐదు రోజులకు రూ.150 
► సారస్‌ కొంగ/నిప్పుకోడి/ పాములకు నాలుగు రోజులకు రూ.100 
► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 గుడ్లగూబలు నాలుగింటికి ఒక రోజుకు రూ.100 
► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 మకావ్‌లు నాలుగింటికి మూడు రోజులకు రూ.100 
► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 పీజియన్‌/నెమళ్లు నాలుగింటికి నాలుగు రోజులకు రూ.100 
► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 రామ చిలుకలు/ఆఫ్రికన్‌ చిలుకలకు ఐదు రోజులకు రూ.100 
► రేచుకుక్క ఒక రోజుకు రూ.135 లవ్‌ బర్డ్స్‌ పదింటికి ఐదు రోజులకు రూ.100 

దాతలు ముందుకు రావాలి... 
కరోనా కారణంగా రెండేళ్లగా జూ ఆదాయం తగ్గిపోయింది. సందర్శకులు జూకి రావడం మానేశారు. దీంతో ఆదాయానికి గండిపడింది. దాతలు స్పందించి ఇక్కడ వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలి. సంచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, జంతు ప్రేమికులు ముందుకు వచ్చి వాటి ఆకలి తీర్చడంలో భాగస్వాములు కావాలి. వాటిని దత్తత తీసుకోవడానికి చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను మినహాయింపు ఉంది. ఈ దత్తత పద్దతి 2011లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలువురు దాతలు ముందుకొచ్చి ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, పక్షులు దత్తత తీసుకొన్నారు. ఇటీవల ఐవోసీఎల్‌సంస్థ ముందుకొచ్చి ఖడ్గమృగాన్ని మూడేళ్లు పాటు దత్తత తీసుకొంది. స్పందించిన దాతలు 9440810160, 0891–2552081 ఫోన్‌ 
నంబర్లకు సంప్రదించాలి. 
   – నందనీ సలారియా, జూ క్యూరేటర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement